Take a fresh look at your lifestyle.

నామినేషన్ దాఖలు చేసిన కవిత..

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం శాసన మండలి స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం కు వెళ్ళిన కవిత ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, కామారెడ్డి ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ ఆమెర్, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, గంప గోవర్ధన్ లు కవితని అభినందించారు.
2015లో నిజామాబాద్ స్థానిక సంస్థల కేటగిరీలో ఎన్నికైన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయింది.  ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వారికి మరో 22 నెలల పదవీ కాలం (2022 జనవరి వరకు) మాత్రమే ఉంది. ఇప్పుడు అభ్యర్థిత్వం దక్కిన వారినే, తదుపరి కూడా కొనసాగించే అవకాశం ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో పలువురు పోటీపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్‌, పార్టీ నేతలు నర్సింగ్‌రావు, ఈగ గంగారెడ్డి ఈ స్థానాన్ని ఆశించినా, చివరికి కవితవైపే టీఆర్ఎస్ అధినేత  కేసీఆర్ మొగ్గు చూపారు. కవిత ఎంపిక విషయమై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజ్యసభ సభ్యులతోనూ చర్చించారు. వారంతా కవిత ఎంపికను స్వాగతించారు.
kavitha nomination latest updates
కవిత విజయం ఏకపక్షమే కానుంది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో అదే స్థానంలో ఓడిపోయారు. రాజ్యసభకు ఆమెను ప్రతిపాదిస్తారనే ప్రచారం జరిగినా, గతంలో ఇచ్చిన హామీ మేరకు మాజీ సభాపతి సురేశ్‌రెడ్డికే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో శాసన మండలి స్థానానికి కవిత పేరు ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు గల ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 95 శాతానికిపైగా టీఆర్ఎస్ వారే ఉన్నారు. దీంతో కవిత ఎమ్మెల్సీ గా ఎన్నికవడం లాంఛనమే. త్వరలోనే కవిత ను పెద్ద పదవి వరించబోతున్నదని సమాచారం.  కవితకు మంత్రి పదవి లభిస్తుందని ఆమె అభిమానులు సంతోషంగా చెప్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కవిత అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సంబరంగా అంటున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు కవిత కాన్వాయ్ ను ఆపుతూ ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.  మొత్తానికి కవిత ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రకటించడంతో నిజామాబాద్ టీఆర్ఎస్ వర్గాల్లో  ఉత్సాహం పెల్లుబికింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!