- దారి పొడవునా స్వాగతం – మారనున్న సమీకరణలు
నిజామాబాద్ మాజీ ఎంపి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిఎం కేసీఆర్ ప్రకటించారు. టిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును సిఎం కేసీఆర్ ఓకే చేయడంతో బుధవారం నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కవిత కలిశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతోనూ కవిత సమావేశమయ్యారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ -స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల టిఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, గత పార్లమెంటు ఎన్నికలలో నిజామాబాద్ లోక్‌సభ వోటమి పాలైన ఆమె రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆమె కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. దీంతో మళ్లీ ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయబోరా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ, అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయాయి. ఆమె మళ్లీ పొలిటికల్‌గా స్ట్రాంగ్ అవ్వనున్నారు. వోడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండటం గమనార్హం.అంతేకాదు, ఎమ్మెల్సీగా ఆమె గెలుపు దాదాపు ఖరారు అయినట్లేనని, తెలంగాణలో తొలి మహిళా ఎమ్మెల్సీగా ఆమె రికార్డు నెలకొల్పనున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం… ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఎమ్మెల్సీగా బరిలోకి దిగడంతో… ఆమె రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశాలతో పాటు రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.