Take a fresh look at your lifestyle.

భారత్‌ – ‌పాకిస్థాన్‌ ‌మధ్య ఉద్రిక్తతకు కాశ్మీరే కారణం!

Kashmir is the cause of tension between India and Pakistan!

  • చిచ్చు రాజేసిన ట్రంప్‌
  • ‌భారత్‌ ‌కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధం
  • పర్యటన ముగించుకొని వెళ్తూ
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు
  • భారత్‌ – అమెరికాల మధ్య 20 బిలియన్‌ ‌డాలర్ల ఒప్పందాలు

రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పర్యటన చివరి రోజయిన మంగళవారం దాయాది దేశాలు భారత్‌ ‌పాకిస్తాన్‌ ‌మధ్య చిచ్చు రాజేసే విధంగా మాట్లాడారు. భారత్‌ ‌పాక్‌ ‌దేశాల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర్‌ అం‌శమే కారణమనీ, రెండు దేశాలు కోరితే మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ ‌ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌తనకు మంచి మిత్రుడని ప్రశంసలు కురిపిస్తూనే ఆ దేశంలో ఆరాచక శక్తులను తామే నియంత్రిస్తున్నామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌ అం‌శంపై రెండు దేశాల వాదనలు వినాలనీ, పాకిస్తాన్‌ ‌విషయంపై భారత ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్ట్ ‌ట్రంప్‌ ‌రెండో రోజైన మంగళవారం దేశ రాజధాని న్యూదిల్లీలోని హైదరాబాద్‌ ‌హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఆరోగ్యం, ఆయిల్‌ ‌కార్పొరేషన్లపై మూడు ఒప్పందాలు జరిగాయి. ఇంధనంపై రెండు దేశాల మధ్య 20 బిలియన్‌ ‌డాలర్ల ఒప్పందం కుదిరింది.

వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం… ట్రంప్‌-‌మోదీ సంయుక్తంగా డియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ‌మాట్లాడుతూ మోడీ ఓ టెర్రిఫిక్‌ ‌లీడర్‌ అని అభివర్ణించారు. ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అనీ, ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాడే శక్తి సామర్ధ్యాలు ఆయనకు ఉన్నాయని కితాబునిచ్చారు. ఆయన నిశ్శబ్దంగా ఉంటూనే ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని ప్రశంసించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ఆణచివేసే అంశంలో పాలనాపరంగా ఆదేశం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. తాను సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాననీ, రక్షణ రంగంలో భారత్‌కు అమెరికా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు ట్రంప్‌. ‌రక్షణ రంగంలో 3 వేల మిలియన్‌ ‌డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపారు.

రక్షణ రంగంలో భారత్‌ అభేద్యంగా మారుతుందన్నారు. భారతీయుల ఆదరాభిమానాలు వెలకట్టలేనివన్న ట్రంప్‌ .. ‌మొతేరా స్టేడియంలో లభించిన అపూర్వ ఆదరణ తనకు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. భారత్‌ ‌పర్యటన అద్భుతంగా సాగిందని చెప్పారు. తనకు అద్భుత స్వాగతం పలికిన ప్రధాని మోదీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఫలవంతమైన పర్యటనగా ఇది ఉంటుందని, ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనని ట్రంప్‌ ‌తెలిపారు. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని, సరిహద్దు ఉగ్రవాదంపై చర్చించు కున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని వెల్లడించారు. రక్షణ ఒప్పందాలపై చర్చించామని, 3 బిలియన్‌ ‌డాలర్ల ఒప్పందం జరిగిందన్న ట్రంప్‌ అపాచీ, ఎం-16 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని వివరించారు. ఉగ్రవాదం, సైబర్‌ ‌నేరాలు, చొరబాట్లు ఎక్కువైపోయాయని, 5జీ వైర్‌లెస్‌ ‌నెట్‌వర్క్‌పై చర్చించుకున్నామని వెల్లడించారు. తాను అధ్యక్షుడిని అయ్యాక భారత్‌తో ఆర్థిక బంధం పెరిగిందని.. భారత్‌తో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయని చెప్పుకొచ్చారు. మహాత్మాగాంధీకి నివాళులు అర్పించడం తన జీవితంలో గొప్ప విషయమనీ, అదే విధంగా ప్రపంచంలోనే అత్యద్భుతమైన తాజ్‌మహల్‌ను సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు.

భారత్‌ ‌తమ దేశానికి అతి పెద్ద మార్కెట్‌ అనీ, ఈ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో కీలక మితృత్వ దేశమైన భారత్‌కు మరిన్ని ఆయుధాలను విక్రయించనున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం బాగా జరిగిందనీ, భారత ప్రధాని మోడీ టెర్రిఫిక్‌ ‌లీడర్‌ అని అభివర్ణించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడుతున్నామనీ, రష్యా, ఇరాన్‌, ఇరాక్‌, ‌సిరియా దేశాలు కూడా ఉగ్రవాదంపై పోరులో తమతో కలసి రావాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర మూకలపై సైతం ఈ దేశాలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌కు తాము 8 వేల మైళ్ల దూరంలో ఉన్నామనీ, ఇంధన రంగంలో భారత్‌లో తమ పెట్టుబడులు ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో పెరిగాయన్నారు.మత స్వేచ్ఛపై ప్రధాని మోడీతో మాట్లాడాననీ, ఆయన మతస్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు తనతో చెప్పారని వెల్లడించారు. సీఏఏపై మోదీతో చర్చించలేదనీ, అది పూర్తిగా భారత్‌ అం‌తర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదనీ, వాణిజ్య విషయాలలో భారత్‌ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా వస్తువులపై భారత్‌ అధిక సుంకం విధిస్తోందనీ, దీనిని తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ భరించబోదని కుండబద్దలు కొట్టారు. సుంకాలతో భారత్‌ ‌తమను దోపిడీ చేస్తున్నదనీ, ఆ భారీ సుంకాలను త్వరలోనే ఆపే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ట్రంప్‌తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి : ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ హైదరాబాద్‌ ‌హౌస్‌ ‌వేదికగా అమెరికా అధ్యక్షుడితో జరిగిన చర్చలు ఫలప్రదమైనట్టు ప్రకటించారు. భారత్‌, అమెరికా భాగస్వామ్యానికి చెందిన కీలక విషయాలను చర్చించామన్నారు. రక్షణ, భద్రత, ఎనర్జీ, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, ప్రజల సంబంధాల గురించి మాట్లాడామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌ ‌సతీసమేతంగా భారత్‌ ‌రావడం ఆనందం కలిగించిందని, గత ఎనిమిది నెలల్లో తానూ, ట్రంప్‌ 8 ‌సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. అమెరికా-భారత్‌ ‌మధ్య స్నేహ బంధం పెరిగిందని, 21వ శతాబ్దానికి అమెరికా-భారత్‌ ‌స్నేహం ముఖ్యమైందని చెప్పారు. అమెరికా-భారత్‌ ‌బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని, డ్రగ్స్‌పైనా నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు. భారత్‌-అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ట్రంప్‌ ‌తాజా పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసిందనీ, ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల మధ్య ఒక అవగాన కుదిరిందని చెప్పారు.

అమెరికాతో ఓ భారీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని ప్రధాని వెల్లడించారు. అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నారి ఆనందం వ్యక్తం చేశారు. అంతకు ముందు ట్రంప్‌ ‌దంపతులు తొలుత రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించి.. ఆ తర్వాత హైదరాబాద్‌ ‌హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత పర్యటనలో భాగంగా అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలుతో పాటు.. 3 బిలియన్‌ ‌డాలర్ల ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా… ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను భారత గడ్డపై నుంచి ట్రంప్‌ ‌హెచ్చరించారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తున్నామని… అతివాద ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అదే విధంగా భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ ‌తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్‌- అమెరికా సంబంధాలు బలపడ్డాయన్న అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఢిల్లీలో ఐరాస డెవలప్‌మెంట్‌ ‌ఫండ్‌ ‌శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.

Leave a Reply