- జమ్ము-కాశ్మీర్లో రాహుల్ భారత్ జోడో యాత్ర
- పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్ రౌత్, గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు
- యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్ కోట్తో కనిపించిన రాహుల్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 20 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ శుక్రవారం తన భారత్ జోడో యాత్రను జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాలోని హత్లీ మోర్ నుండి ప్రారంభించారు. కాగా శివసేన(యుబిటి) సంజయ్ రౌత్, పరమవీర చక్ర గ్రహీత కెప్టెన్ బానా సింగ్‌తో సహా పలువురు గ్యాలంట్రీ అవార్డు విజేతలు ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా శీతాకాలపు వర్షాల కారణంగా గంటకు పైగా ఆలస్యంగా మొదలైంది. చివరి దశకు చేరిన యాత్రలో పార్టీ జమ్మూ-కాశ్మీర్ విభాగం అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ అధ్యక్షుడు జిఎ మీర్‌తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు రాహుల్ వెంట నడిచిన వారిలో ఉన్నారు. గురువారం కశ్మీర్లోకి ప్రవేశించిన యాత్ర జనవరి 30న పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేయడంతో శ్రీనగర్‌లో ముగియనుంది.
ఇక జమ్ము కాశీర్‌కు సంబంధించి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..యాత్రకు భద్రతా పరంగా ఎటువంటి సమస్య ఉండదని, అన్ని భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు యాత్ర మొత్తంగా కేవలం టీషర్ట్‌తో కనిపించిన రాహుల్ గాంధీ వర్షం కురుస్తుండడంతో మొదటిసారిగా తెల్లటి టీ-షర్ట్‌పై నల్లటి రెయిన్ కోట్ ధరించి కనిపించారు. యాత్ర ప్రారంభానికి కొన్ని గంటల ముందు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మద్దతుదారులు త్రివర్ణ పతాకాలు చేతబూని కనిపించారు. శుక్రవారం యాత్ర 25 కిలోమీటర్ల మేర కొనసాగి కతువా జిల్లాలోని చద్వాల్లో రాత్రికి విశ్రమిస్తుంది. జనవరి 26 వరకు జమ్ములోని వివిధ జిల్లాలలో పాదయాత్ర కొనసాగిన అనంతరం కశ్మీర్లోకి ప్రవేశిస్తుంది.