Take a fresh look at your lifestyle.

కార్తీక మాసం కానుక.. సంప్రదాయ వేడుక.. వనభోజనాలు

“ఈ వన భోజనాలు గొప్ప విశ్రాంతిని కలిగిస్తున్నాయి. వివిధ సంఘాలు, సేవా సమితులు, ట్రస్టులు కార్తీక మాసంలో, వారంతాల్లో ప్రత్యేక వన భోజనాలను ఏర్పాటు చేస్తున్నాయి. చెట్లు ఎక్కువగా ఉండే పార్కులు, గార్డెన్లు, స్టేడియాల్లో వన భోజనాలను ఏర్పాటు చేసి కొత్త పరిచయాలను పెంపొందిస్తున్నాయి. ఉన్న బంధాలను మరింతగా బలపడేలా చేస్తున్నాయి. పురిటిగడ్డకు..కుటుంబసభ్యులకు దూరంలో ఉండే వారంతా ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా.. తీరిక చేసుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలవడానికి ఇష్టంగా కదిలి వస్తారు.”

సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా ప్రకృతి ఆరాధనకు మనం పెద్దపీట వేస్తాం. రుతువులనుబట్టి మనకు పండుగలు, పబ్బాలు వస్తాయి.  కార్తీక మాసంలో అయినవారితో కలిసి అడవులు, చెట్లు, పుట్టలు, గుళ్లూ, గోపురాలకు వెళ్లి సరదాగా గడిపి, కమ్మని భోజనం కడుపునిండా తినడం ఆనవాయితీగా వస్తోంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు ఇలా ఎక్కడ ఉన్నా.. కార్తీక వనభోజనాలంటే మనవారికి చెవులు కోసుకునేంత ఆసక్తి వచ్చేస్తుంది. ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధం.. సంప్రదాయ వేడుక.. కార్తీకమాసం కానుకే.. వనభోజనం! కుబుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన కలిసి భోజనం చేయడాన్ని వనభోజనం  అంటారు. కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం అనాదిగావస్తున్న ఆచారం. ఎందరో దేవతలు వనాలలో, కొండకోనల్లో వెలశారు. సుప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు చాలా వరకు ఇలా కొండకోనల్లో  దుర్గమారణ్యాలలో వెలసినవే. అందువల్ల వనభోజనాలు చేయడం దేవతా ప్రీతికరమని ప్రతీతి. మానవాళి మనుగడకు పత్రహరితహారమే కీలకమని చెప్పడంతోపాటు, ‘వృక్షోరక్షతి రక్షితః’ అని పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల ఆంతర్యం. ఈ వనభోజనాలనేవి ఈ నాటివికావని, శ్రీ కృష్ణుని కాలం నుంచీ ఉన్నాయని పోతన భాగవతంలో ఉంది. మునులందరూ కలిసిసూత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్తీక పురాణంలోనూ పేర్కొన్నారు. అంటే పురాణ, పుణ్య పురుషుల కాలం నుంచి ఈ భోజనాలు ఉన్నాయన్న మాట. అలాగే పూర్వ కాలంలో ఉన్న అస్పృశ్యత, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను పారదోలడానికి కూడా ఇలాంటి సామూహిక భోజనాలు ఎంతో ఉపయోగపడ్డాయి.

పాశ్చాత్య దేశాల్లో లాంగ్‌ ‌వీకెండ్‌ ‌పేరుతో పిక్‌నిక్‌ ‌కల్చర్‌ ఉం‌టే..మన దేశంలో మాత్రం కార్తీక వనభోజనాల పేరుతో సంప్రదాయ వేడుక (పిక్‌నిక్‌) ‌జరుపుకుంటాం. చిన్ననాటి ఫ్రెండ్స్, ‌కొలీగ్స్, ‌బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ‌కుటుంబ సభ్యులు ఇలా ఎవరితోనైనా కలిసి నచ్చిన ప్రదేశంలో ఉత్సాహంగా గడిపిరావడం… కుదిరితే చెరువులు, సరస్సులు, నదులు, డ్యామ్‌లు.. పార్కులు, గుళ్లూ, కోటలు, కొండలు.. ఇలా ఫెవరైట్‌ ‌ప్లేసులు ఏవైతే అక్కడికి అందరూ కలిసి వెళ్లి సేదతీరుతుంటారు.
ప్రకృతి ఒడిలో జరుపుకునే పార్టీలే కార్తీక వనభోజనాలు. బంధాలు, అనుబంధాలను మరింత దృఢపరిచేవే ఈ వనభోజనాలు. అందుకే, కుటుంబ సభ్యులంతా వీలుచేసుకుని కొన్ని గంటలపాటు కలిసి ఆడిపాడేందుకు కార్తీక మాసం అనువైనది. ఓ వైపు వెచ్చని ఎండ, మరోవైపు చల్లని గాలులు, లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ రోజంతా గడిపేస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా సకుటుంబ సపరివార సమేతంగా వనభోజనాలకు హాజరై హ్యాపీగా గడిపేస్తారు.

భారతీయ పండుగలన్నీ ప్రత్యేకంగా ప్రకృతితో ముడిపడి ఉన్నవే. మరీ ముఖ్యంగా కార్తీకమాసం..వనభోజనాలు. అలా ఓ రోజంతా అడవుల్లో గడిపితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వృక్షాలు మానవ జాతికి మూలమని, మానవ మనుగడకు అవే కారణమునే తత్వం బోధపడుతుంది. అలాగే అడవుల్లో ఉండే వివిధ రకాల చెట్ల ప్రాధాన్యత తెలుస్తుంది. చెట్లను, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలనే స్పృహ మనిషిలో పెరుగుతుందనే భావనతోనే యుగాల కిందటే ఈ ఆచారం మొదలైంది. మన దైనందిన జీవితంలో, పురాణాల్లో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉసిరిని ఆరోగ్య ప్రదాయనిగానూ చెస్తారు. ఉసిరి చెట్టు నీడన భోజనం.. ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని, పదిమందిలో ఓ రోజంతా కలిసి గడిపితే కలిగే కొత్త ఉత్సాహం, ఉల్లాసం మాటల్లో చెప్పలేనిది. అందుకే బడి పిల్లలను కూడా పిక్నిక్‌ ‌పేరుతో ఉపాధ్యాయులు ఓ రోజంతా బయటకు తీసుకెళ్లి ప్రకృతి ఉపయోగాన్ని ఆవశ్యకతను వారికి వివరిస్తుంటారు.

ఉమ్మడి కుటుంబాలు విచ్ఛినమై, ఆచార వ్యవహారాలు దాదాపు అందరూ మరచిపోతున్న క్రమంలో వనభోజనాలు సమష్ఠి తత్వాన్ని, సమైక్యతను పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అందరికీ అనువైన ఓ శుభ దినాన పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఊరికి దూరంగా వనంలోకి వెళ్లి తలో చేయి వేసి వంటావార్పు చేసుకుని పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి అందరూ ఒకటిగా ఉసిరి చెట్టు నీడన సామూహిక భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపి, మంచి చెడు మాట్లాడుకుని, ఆ ప్రకృతి, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడమే మన భోజనం.

వన భోజనాలు..మన భోజనాలు. పల్లెలు, పట్టణాలు నగరాలే కాదు దేశ రాజధాని న్యూఢిల్లీ వంటి మహానగరాల్లోనూ ఈ సంస్కృతి విస్తరించింది. ఉరుకుల పరుగుల జీవితంలో పక్కవారు ఏమైపోతున్నారో కూడా పట్టించుకునేంత తీరికలేని ఎంతో మందికి..ఈ వన భోజనాలు గొప్ప విశ్రాంతిని కలిగిస్తున్నాయి. వివిధ సంఘాలు, సేవా సమితులు, ట్రస్టులు కార్తీక మాసంలో, వారంతాల్లో ప్రత్యేక వన భోజనాలను ఏర్పాటు చేస్తున్నాయి. చెట్లు ఎక్కువగా ఉండే పార్కులు, గార్డెన్లు, స్టేడియాల్లో వన భోజనాలను ఏర్పాటు చేసి కొత్త పరిచయాలను పెంపొందిస్తున్నాయి. ఉన్న బంధాలను మరింతగా బలపడేలా చేస్తున్నాయి. పురిటిగడ్డకు..కుటుంబసభ్యులకు దూరంలో ఉండే వారంతా ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా.. తీరిక చేసుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలవడానికి ఇష్టంగా కదిలి వస్తారు.

మన సంప్రదాయ వంటలకు ఈ భోజనాల్లో పెద్దపీట వేస్తున్నారు. రకరకాల ఆధునిక వంటకాలకు అలవాటుపడి.. చప్పబడిపోయిన జిహ్వకు పసందైన విందు దొరికే రోజది. పులిహోర, దద్దోజనం, వడలు, చక్కెర పొంగలి వంటి సంప్రదాయ వంటలు వన భోజనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. సమైక్యతను, సమష్టితత్వాన్ని, ఐకమత్యాన్ని చాటి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తున్నాయి. స్థాయి, హోదాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు, కులసంఘాల పెద్దలు, వివిధ రంగాల నిఫుణులు, ఉన్నతోద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలూ వీటిల్లో పాల్గొంటారు.

రాష్ట్రంలో ఎన్నో విశిష్టమైన..అందమైన ప్రదేశాలు ఉన్నందున కార్తీకమాస వనభోజనాల పేరిట పిల్లా జల్లా అంతా కలిసి ఇంటి నుంచి బయటపడతారు. కాంక్రీట్‌ ‌జంగిల్‌ ‌నుంచి రియల్‌ ‌జంగిల్‌లో షికార్లు కొడతారు. కార్తీక మాసంలో వచ్చే సెలవులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీకెండ్‌ను ఆస్వాదిస్తారు. పర్యాటక స్థలాలతోపాటు, రాష్ట్రం నలుదిక్కుల్లో ఉన్న పలు రిసార్టుల్లో డే ప్యాకేజీలు తీసుకుని అయినవారితో ఆహ్లాదాన్ని పంచుకుని ఎంజాయ్‌ ‌చేస్తారు. ప్రతిఏటా కుల, సహకార, సేవాసంఘాల ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతూ సందడి చేస్తున్నాయి.
ప్రస్తుత దైనందిన యాంత్రిక జీవనంలో ఆనందాన్ని మానవ సంబంధాల్ని మరచిపోతున్న మనిషి ఒక్కరోజైనా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరిలో కలిసి కార్తిక మాస వనభోజనాల్లో పాల్గొంటే మంచిది. సర్వత్రా కాలుష్యం కోరలు చాచి మనిషి ఆరోగ్యాన్ని కబళిస్తున్న తరుణంలో పచ్చని చెట్లు అందించే స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన పరిసరాలలో మానసిక ప్రశాంతతను పొందేందుకు వీలవుతుంది. ముఖ్యంగా ఇది కుల, మత వర్గాలకు ఆతీతంగా రోజూవారి శ్రమను మరచిపోయేందుకు సంవత్సరానికొకసారి వచ్చే ఇలాంటి కార్యక్రమాలు మానసిక స్వాంతనను కలిగిస్తాయి. భక్తి, ఆధ్యాత్మిక, ఆనందం, ఆరోగ్యం, మధురస్మృతులను అందించే వనభోజనాలు మరెన్నో సందేశాలను అందిస్తాయి. ప్రజల మధ్య సమైక్యతను, మతసామరస్యాన్ని పెంపొందించేందుకు ‘వనభోజనాలు’ దోహదం చేస్తున్నాయి. అలాగే ప్రకృతిని, వృక్షాలను ప్రేమించే లక్ష్యాన్ని పెంపొందిస్తున్నాయి.

గడ్డం కేశవమూర్తి
సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌రచయిత,
రాష్ట్ర విశిష్ఠ పురస్కార గ్రహీత, సెల్‌ : 8008794162

Leave a Reply