Take a fresh look at your lifestyle.

కర్ణాటక ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయా ?

ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు కర్ణాటక వోటర్లు తగిన గుణపాఠం చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా వేసినట్టే కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ  మెజార్టీ సాధించింది. ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను దాటి  కాంగ్రెస్‌ ‌పార్టీ  137 స్థానాల్లో విజయం  సాధించింది.  కేంద్ర బీజేపీ ప్రభుత్వం  గతంలో  ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్పొరేట్‌ ‌శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్‌ ‌శక్తుల చేతులలో బంది చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం,  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలను మోసగించారు.   ఉద్యోగాలు కల్పన, ఉపాధి భ్రాంతి గానే  మిగిలిపోయింది. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం ఎంత మందికి చేశారు. నోట్ల రద్దు ద్వారా అవినీతి సొమ్మంతా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి రూ. 15 లక్షలు అకౌంట్‌ ‌లో వేస్తానన్న మోదీ ఇప్పటికీ ఎంతమంది అకౌంట్లలో రూ. 15 లక్షలు వేశారు. వచ్చే అన్ని రాష్ట్రాల శాసనసభ  2024 పార్లమెంట్‌  ఎన్నికల్లో  కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండ కట్టడానికి ఇప్పటి నుండి  ప్రజలంతా ఏకం కావాలి.  దేశంలో నిరుద్యోగం పెరిగి, ప్రజల ఆదాయ వనరులు తరుగుతున్నాయి. ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేటాయింపులు పడిపోతున్నాయి. రైతులు, ఇతర అన్ని తరగతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రజల అప్పులు పెరుగుతున్నాయి. శత కోటీశ్వరుల అప్పులు రద్దు అవుతున్నాయి.
వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యలో ఉన్న కుబేరుల సంపద అంతులేకుండా పెరుగుతున్నది ఎవరి మద్దతుతో ఇలా జరుగుతున్నది అనే సత్యం ప్రజలు తెలుసుకుంటున్నారు.   మోదీ ప్రభుత్వం  రాఫెల్‌ ‌కుంభకోణం  రూ. 68 వేల కోట్ల విలువైన రాఫెల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై పెద్దఎత్తున అవినీతి, మనీ లాండరింగ్‌, ఆ‌శ్రిత పక్షపాతం, అక్రమాలు, పన్నుల మాఫీల ద్వారా అనుచిత లబ్ధి వంటి ఆరోపణలు వెలువడ్డాయి. రక్షణ పరికరాల సమీకరణ పద్ధతి (డిపిపి) కింద 126 రాఫెల్‌ ‌యుద్ధ విమానాలను సమకూర్చుకునేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. డసాల్ట్ ‌నుండి హెచ్‌.ఎ.ఎల్‌ ‌కు సాంకేతికతను బదిలీ చేసుకుని, దానితో వీటిలో 108 విమానాలను భారత్‌లో బెంగళూరుకు చెందిన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ (‌హెచ్‌.ఎ.ఎల్‌) ‌తయారుచేసి ఇచ్చేలా కూడా అంగీకారం కుదిరింది.  ఒప్పందాన్ని కాదని ఆనాడు మోదీ తాజాగా ఒప్పందాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రధాని మదీ ఆనాడు ఫ్రాన్స్ ‌పర్యటనలో ప్రకటించిన ఒప్పందంలో అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఏరో స్పేస్‌ ‌భాగస్వామ్యాన్ని అకస్మాత్తుగా ప్రవేశపెట్టారు. ఏరోనాటిక్స్‌లో రిలయన్స్ ‌కంపెనీకి అప్పటికి ఎలాంటి అనుభవం లేదు. పైగా రిలయన్స్ ‌కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది, ఇటువంటి ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా లేదు.  డసాల్ట్ ‌కు, ఏవియేషన్‌ ‌రంగంలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ ఏరో స్పేస్‌కు మధ్య అకస్మాత్తుగా ఒప్పందం కుదరడం, పైగా భారత్‌లో పాలక వర్గంతో అనిల్‌ అం‌బానీకి వున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఒప్పందం చుట్టూ అనేక ఆరోపణలు అలుముకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బొగ్గు బ్లాకులను అభివృద్ధి చేసి, బొగ్గు తవ్వేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. ఈ లైసెన్సుల జారీపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2014లో వాటన్నింటినీ రద్దు చేసింది.  అప్పుడే అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, గనుల అభివృద్ధి, ఖనిజాన్ని వెలికితీయడానికి లైసెన్సులు జారీ చేసే అంశంపై 2015లో కొత్త చట్టం తెచ్చింది.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని పర్సా, కంటా బొగ్గు బ్లాకుల లైసెన్సులు కూడా రద్దయ్యాయి. కానీ, వాటిల్లో బొగ్గు తవ్వుకొనేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు అనుమతి ఇచ్చింది. ఆర్‌ఆర్‌బీయూఎన్‌ఎల్‌కు 25 శాతం వాటా దక్కగా, ఏఈఎల్‌కు ఏకంగా 75 శాతం వాటా దక్కింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. వాటాలు తల్లక్రిందులు కావటంతో ఈ జాయింట్‌ ‌వెంచర్‌పై రాజస్థాన్‌ ‌ప్రభుత్వానికి దక్కాల్సిన యాజమాన్య హక్కులు అదానీ గ్రూప్‌ ‌చేతుల్లోకి వెళ్లిపోయాయి. కోల్‌ ఇం‌డియా నిబంధనల ప్రకారం దేశంలోని థర్మల్‌ ‌విద్యుత్తు కేంద్రాల్లో క్యాలరిఫిక్‌ ‌విలువ 2,200 కిలోక్యాలరీల కనిష్ట స్థాయివరకు ఉన్న బొగ్గును కూడా వినియోగించవచ్చు. కానీ, ఆర్‌ఆర్‌బీయూఎన్‌ఎల్‌, ఏఈఎల్‌ ‌మధ్య కుదిరిన ఒప్పందంలో ఈ విలువను ఏకంగా 4 వేల కిలో క్యాలరీలు పెంచేశారు. అంటే పర్సా, కంటా గనుల్లో తవ్విన బొగ్గులో క్యాలరిఫిక్‌ ‌విలువ 4 వేల కిలోక్యాలరీలకంటే ఎక్కువ ఉన్న నాణ్యమైన బొగ్గునే వినియోగించాలి. అంతకంటే తక్కువ ఉన్న బొగ్గును ఆర్‌ఆర్‌బీయూఎన్‌ఎల్‌ ‌తన ప్లాంట్లలో వినియోగించకుండా తిరస్కరించవచ్చు. ఈ ఒప్పందం వెనుక అదానీ గ్రూప్‌నకు ఆయాచిత ప్రయోజనం కల్పించే దురుద్దేశమే.
ఆర్‌ఆర్‌బీయూఎన్‌ఎల్‌ ‌తిరస్కరించిన బొగ్గులో 25 శాతాన్ని ఏఈఎల్‌ ఉచితంగా తీసుకొని వేరే పవర్‌ప్లాంట్లకు విక్రయించుకోవచ్చని జాయింట్‌ ‌వెంచర్‌ ‌నిబంధనల్లో పొందుపర్చారు. ఈ రెండు బ్లాకుల్లో వెయ్యి మిలియన్‌ ‌టన్నుల బొగ్గును వెలికితీయాలని ఈ కంపెనీల లక్ష్యం. అంటే మొత్తం బొగ్గులో 25 శాతం అంటే.. 250 మిలియన్‌ ‌టన్నుల బొగ్గును అదానీ గ్రూప్‌ ఉచితంగా పొంది, తనకు ఇష్టం వచ్చిన కంపెనీలకు అమ్ముకోవచ్చు. దానివల్ల వచ్చే ఆదాయంలో పైసా కూడా ఆర్‌ఆర్‌బీయూఎన్‌ఎల్‌కు ఇవ్వాల్సిన పనిలేదు. అంటే అదానీ గ్రూప్‌ ఉచితంగా లభించే 25 శాతం బొగ్గుతోనే రూ.లక్ష కోట్లు సంపాదించుకొనే అవకాశం లభించింది.గతంలో గోదావరిఖని పర్యటనకు వచ్చిన సందర్భంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రసక్తే లేదని ప్రకటించిన మోదీ నేడు వేలానికి  సిద్ధమవుతున్నారు. దేశంలో దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు దిల్లీలో మొదలై ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను  ఓ ఊపు ఊపేస్తుంది ఈ కేసు. అందులో తన పాత్ర ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కుమార్తె కల్వకుంట్ల కవితపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, ఇప్పటికే  వైసీపీ యంపీ  విజయసాయి రెడ్డి అల్లుడు మరో ఎంపీ కుమారుడు మాగుంట రాఘవ, దిల్లీ ఉపముఖ్యమంత్రి  మనీష్‌ ‌సిసోడియాతో సహా పలువురిని జైల్లో పెట్టారు. కవిత ఐదు విడతలుగా  ఈడీ విచారణ హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.
దేశ రాజధాని అయిన దిల్లీలో మద్యం దుకాణాలు మొదట ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వాటిని ప్రైవేటుకు అప్పగిస్తూ  2020 సెప్టెంబర్‌లో ఆప్‌ ‌ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో పెద్ద స్కాం జరిగిందని అనుమానిస్తూ  అసలు ఏం జరిగిందన్నది రూట్‌ ‌లెవల్‌ ‌నుంచి విచారణ చేయటం మొదలు పెట్టింది. పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలపై దాడులు నిర్వహించింది. లిక్కర్‌ ‌స్కాంకు మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నట్టు సీబీఐ, ఈడీ వెల్లడించింది. పలుమార్లు దాడులు చేసి విచారణ జరిపి మనీశ్‌ ‌సిసోడియా తో సహా  మొత్తం 11 మందిని అధికారులు అరెస్ట్ ‌చేశారు.   మరోవైపు ఈ కేసులో కవితకు కూడా భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని సీబీఐ, ఈడీ వెల్లడించింది.  సౌత్‌ ‌గ్రూప్‌ ‌నుంచి రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారినట్టు ఈడీ ఆరోపించింది. పన్నెండు  సంవత్సరాల క్రిందట జన్‌ ‌లోక్‌ ‌పాల్‌ ‌బిల్లు పెట్టడానికి అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రధాన భూమిక పోషించిన ప్రముఖ గాంధేయవాది  అన్నా హజారే గారి ప్రియ శిష్యులే నేడు లిక్కర్‌ ‌స్కాములో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సామాన్య మదుపరుల ఆస్తులు లక్షల కోట్లు ఆవిరవుతున్న, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ ‌రంగం కుదేలవుతున్న  జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం చలనం లేదు.
భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్యలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా రెజ్లర్లపై  అధ్యక్షుడితో పాటు ట్రెయినర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని  గత నెల  రోజులుగా  దిల్లీలో  నిరసన తెలియచేస్తున్నారు. గతంలో వచ్చిన  ఆరోపణలపై  కమిటీ వేశారు. నెలలు గడుస్తున్నా  ఇప్పటి వరకూ ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు.  లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఎంత సమయం పడుతుందని ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.  బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు  అతడిపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు   అర్ధరాత్రి మద్యం తాగి  పోలీసులు  దాడి చేశారు. మహిళా రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరు సభ్య సమాజం ఖండించాలి.  ఇది నిజంగా సిగ్గుచేటు,  బేటీ బచావో అనేది కేవలం ఓ బూటకం అని అర్థమైపోయింది..!
ఇటీవలి సంవత్సరాలలో, బిజెపి మతపరమైన ఉద్రిక్తతలను నిర్వహించడం, మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సమస్యల పట్ల దాని విధానం  ఆర్థిక అభివృద్ధి తో సహా అనేక అంశాలలో విమర్శలను ఎదుర్కొంది. బిజెపి హిందూ జాతీయవాద ఎజెండాను ప్రోత్సహిస్తోంది,  ఇది భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకిక  బహువచన విలువలు బలహీనపరుస్తుందని మేధావులు  హెచ్చరిస్తున్నారు. మహిళలపై హింస  వేధింపుల సంఘటనలుతో సహా మహిళల హక్కులకు సంబంధించిన సమస్యలపై పార్టీ విమర్శలను ఎదుర్కొంది.
 గత వారంలో పలు లైంగిక అకృత్యాలకు  పాల్పడ్డ  సీరియల్‌ ‌రేపిస్ట్ ‌ప్రవాస   బీజేపీ  అధ్యక్షుడు   బాలేష్‌ ‌ధంఖర్‌ ‌ని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు.  తన ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తో సన్నిహితంగా సంభాషించడానికి బాలేష్‌ ‌ధంఖర్‌   అనుమతించ బడ్డాడు . 43 ఏళ్ల డేటా నిపుణుడు బాలేష్‌ ‌ధంఖర్‌ ‌తన ఇంట్లో ఐదుగురు కొరియన్‌ ‌మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు. అతను తన దాడులు, వీడియో సాక్ష్యాలను పరిశీలించినప్పుడు జ్యూరీ సభ్యులను మెలికలు పెట్టే చర్యలను కూడా రికార్డ్ ‌చేశాడు,  2018లో, ధంఖర్‌ ‌సిడ్నీ సెంట్రల్‌ ‌బిజినెస్‌ ‌డిస్ట్రిక్ట్‌లోని తన స్టూడియో అపార్ట్‌మెంట్‌లో నలభై మంది మహిళలను అత్యాచారం  చేసాడు.    తనపై వచ్చిన 39 అభియోగాలలో ప్రతిదానిపై జ్యూరీ దోషిగా తీర్పులు ఇవ్వడానికి సహాయపడే వీడియోలు బహిర్గతం చేసింది.
భారత రాజ్యాంగాన్ని  దానిలో పొందుపరచబడిన స్వేచ్ఛను కించపరచడం గురించి పెద్దగా ఆలోచించరు.  పౌర నియమాలు  నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఈ సమాంతర శక్తి అనేక రకాలు, ఎటువంటి కార్యనిర్వాహక  చట్టబద్ధమైన అధికారం లేకుండా, శిక్షార్హత లేకుండా వీధుల్లో పాలన సాగిస్తున్నాయి, కాంగ్రెస్‌ ‌నాయకుడు  రాహుల్‌ ‌గాంధీ ని  యం.పి గా అనర్హుడ్ని చేసి రాక్షసానందం పొందుతున్నారు. సామాన్య మదుపరుల డబ్బు లక్షల  కోట్లు ఆవిరవుతున్న, దానికి కారణమైన  అదానీ పై జాయింట్‌ ‌పార్లమెంటరీ  కమిటీ వేయకుండా కార్పొరేట్‌ ఎగవేతదారులకు రక్షణగా నిలుస్తున్నారు.  భారత ప్రజాస్వామ్యం గత దశాబ్ద కాలంగా  కల్లోల పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇది నిస్సందేహంగా దేశంలోని మీడియాపై ప్రభావం చూపింది. మీడియా పరిస్థితి గురించి అర్ధవంతమైన చర్చలు లేకపోవడం గత దశాబ్దంలో స్థిరమైన దృగ్విషయంగా మిగిలిపోయింది. మీడియా స్వేచ్ఛ పై పౌర సమాజం మౌనం వహించడం భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో మీడియా పోషించగల పాత్రను రాజీ చేసింది.
మీడియా  రాజకీయ పక్షపాతం, స్వతంత్ర జర్నలిజం లేకపోవడం పౌర సమాజంలోని అనేక వర్గాల నుండి ఎటువంటి ప్రతిస్పందనను ఆకర్షించలేదు. కఠోర రాజకీయ పక్షపాతం, భూస్వామ్య,  మతపరమైన శక్తులతో అనుబంధం సమకాలీన కాలంలో భారతదేశంలోని పౌర సమాజ స్వభావాన్ని నిర్వచిస్తుంది. దేశంలో మీడియా వంటి ప్రజాస్వామ్య సంస్థలు క్షీణించడం పట్ల పౌర సమాజం లోని వర్గాలు ఉదాసీనత చూపడం   ఈ దౌర్భాగ్యానికి  ప్రధాన  కారణం గా భావించవచ్చు.
బీజేపీ పెట్టిన అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు  తెలుగుదేశం, వైఎస్సార్సీపీ ప్రత్యక్ష మద్దతు తెలిపారు. అలాగే ప్రతిపక్షాల పై సీబీఐ, ఇడి దాడులు జరిగినప్పుడు, నాయకులపై చర్యలకు ఉపక్రమించినప్పుడు, బిజెపి నాయకులు లైంగికదాడులు చేసినప్పుడు, సామాజిక సమగ్రత లేకుండా ఒక వర్గంపై దాడులు చేసినప్పుడు తెలుగుదేశం, జనసేన, వైఎసార్సీపీ  పరోక్ష మద్దతు తెలుపడం సిగ్గుచేటు.  రాబోయే  ఎన్నికల్లో  విజ్ఞత కలిగిన ప్రజలు  అవకాశవాద మతతత్వ పార్టీలకు బుద్ధి చెబుతారని ఆశిద్దాం..
image.png
డా. ముచ్చుకోట సురేష్‌ ‌బాబు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాసైన్స్ ‌వేదిక 

Leave a Reply