వాళ్ళు..
జానెడు పొట్ట కోసం..
వేల మైళ్ళు దాటొచ్చిన బాటసారులు..
బతుకు సమరంలో..
గెలుపును చేరలేక..
ఓటమిని ఒప్పుకోక
కాలంతో యుద్ధం చేసే నిత్య సైనికులు..
విశ్వవిపణి విషపుకౌగిలిలో
నలిగిన పల్లెకు ఆనవాళ్లు..
ఆరుగాలం కష్టవడ్డా
ఆగమయిన సేద్యానికి బలిపశువులు..
కార్పొరేట్ల మాయాజాలంలో చితికిపోయిన కులవృత్తులతో..
కూసమిరిగి,కునారిల్లిన
చితికిన బతుకుల ప్రతిరూపాలు..
పుట్టి పెరిగిన మట్టిని విడిచి..
ఆలి, పిల్లల ఇంట్ల వదిలి..
పొట్టలు చేత బట్టి..
బతుకు పోరుకు బయలెళ్లిన సిపాయిలు..
కాలే కడుపుల కల్లోలాలు..
మాడిన డొక్కల వెతలు, కతలు..
మూటగట్టుకొని,వెంటబెట్టుకొని..
గమ్యమెరుగని తీరాలకు సాగిపోయే పథికులు..
మన ఇంటి సొబగుకు
వాళ్ళ చెమటనద్ది..
ఒంటి సొగసుకు
చమ్కీల మెరుగులు దిద్ది..
భగ భగ మండే ఎండల్లో
చల్లని చలువ బండలై..
చల్ల కుండలై..
అలసిన శరీరాలతో,
అలుపెరుగక పరిశ్రమించే
మర యంత్రాలు..
వాళ్ళ భుజస్థంభాలపై
ఆనకట్టలు కట్టి..
అనాధల్లా,అనామకులై మరుగైతరు..
కమలిన వారి నల్లని దేహాన్ని..
మన రహదారికి తివాచీలా పరుస్తరు..
భుగ భుగలాడే పొగ గొట్టాలను
ఊపిరితిత్తులుగ ధరించి..
మ్రోగే సైరన్ మోతలలో
ఆకలికేకలను దమనం చేసి..
కన్నీళ్లు మరిగించి..
చెమటచుక్కలు చిందిస్తరు..
కర్మయోగులు వాళ్ళు…!
ఘర్మ యోగులు వాళ్ళు…!!
– మధుర శ్రీ, (మధుకర్ రావు బోగెళ్లి) , హన్మకొండ, 9491318502,8522000157