Take a fresh look at your lifestyle.

పారదర్శకతనూ, ప్రావీణ్యాన్ని పెంచే పథకం ‘కర్మయోగి’

కేంద్రంలో, రాష్ట్రాల్లో పని చేసే సివిల్ సర్వెంట్స్ చిత్తశుద్దినీ, అంకిత భావాన్ని శంకించలేం. కానీ, వారు దశాబ్దాలుగా ఒకే మూసలో పని చేసుకుంటూ పోతున్నారు. స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉన్నా, అధికారంలో ఉన్నవారేమంటోరన్న శషబిషలతో వారు రొటీన్ గా తమ పనులు చేసుకుని పోతున్నారు. దీని వల్ల ప్రభుత్వాధినేత ఆశించిన ప్రయోజనాలు ఒనగూరడం లేదు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ అంశంపై దృష్టిని కేంద్రీకరించారు. ప్రభుత్వ శాఖల్లో ప్రిన్సిపల్, చీఫ్, జాయింట్, అసిస్టెంట్ కార్యదర్శుల పేరిట ఎన్నో అంచెలలో పదవులు ఉన్నాయి. వీరందరూ ఐఏఎస్ కేడర్ కి చెందిన వారే. తక్కువ వారెవరూ లేరు. అయితే, వీరి మధ్య సంప్రదింపులు చాలా అరుదు. కొన్ని సందర్భాల్లో హెచ్చు తగ్గుల భావన కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. తమకు వొచ్చిన ఆలోచనలను ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకుని వెళ్ళాలన్న ఆకాంక్షను తమ పై అధికారులు ఏమనుకుంటారోనని తొక్కి పట్టి ఉంచుకునే వారున్నారు. ఇలాంటి వారందరికీ తమ సృజనాత్మకతనూ, స్వయం చోదిత ఆలోచనలను బహిరంగ పర్చేందుకు అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కర్మయోగి పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కర్మయోగి అంటే విద్యుక్త ధర్మానికి కట్టుబడి ఉండేవాడని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. మన దేశంలో అధిక సంఖ్యాకులు కర్మయోగులే. అయితే, ఎప్పుడూ చేసుకునే పనిలో మెలకువలనూ, సాంకేతికతనూ జోడించి మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం కల్పించడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యం.

బ్రిటిష్ కాలం నాటి ఐసీఎస్ వ్యవస్థకు రూపాంతరమే మన దేశంలో ఐఏఎస్ వ్యవస్థ . ఐసీఎస్ లో కొన్ని మార్పులతో ఐఏఎస్ వ్యవస్థ నడుస్తోంది. స్వాతంత్ర్యం వొచ్చిన తర్వాత కూడా ఐసీఎస్ లు మన యంత్రాంగంలో కొనసాగారు. బ్రిటిష్ వారు తమ అవసరాలకు తగినట్టుగా అధికార గణాన్ని మలుచుకున్నారు. అంటే, తాము ఆశించిన ఫలితాలను సాధించేవారికి ప్రాధాన్యం ఇచ్చారు. స్వాతంత్ర్యం వొచ్చి ఏడు దశాబ్దాలు దాటినా మన వ్యవస్థలో ఇంకా పాత ధోరణులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలులోకి రావడానికి విపరీతమైన తాత్సారం జరుగుతోంది. ప్రభుత్వాధినేత ఇచ్చిన హామీలు, లేదా వాగ్దానాలు అమలులోకి రావాలంటే చాలా కాలం పడుతున్నది. దీంతో ప్రజల్లో నైరాశ్యం పెరుగుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ లేదా, కూటమి అధికారంలోకి వొచ్చినా ఇలాగే జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితిని చక్క దిద్దేందుకు మోడీ అధికారంలోకి రాగానే ఆలోచన చేశారు. అంచెల వారీ వ్యవస్థను పక్కన పెట్టి ఏదైనా సందేహం వొస్తే సంబంధిత అధికారులను పిలిపించుకుని నేరుగా మాట్లాడేవారు. దీనిపై అప్పట్లో విమర్శలు వొచ్చాయి. ప్రధాని ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించిన వారు కొందరూ, గుజరాత్ తరహాలో తనకంటూ అధికార గణాన్ని ఆయన కేంద్రంలోనూ ఏర్పాటు చేసుకుంటున్నారని మరి కొందరూ విమర్శించారు. ఈ విమర్శలను పక్కన పెడితే, మోడీ ఆలోచనలను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తే, ఆయన తీసుకున్న చొరవ వల్ల కొన్ని సానుకూల ఫలితాలు ఒనగూరాయి. ఆకాశవాణి ద్వారా ప్రతినెలా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన ప్రజాభిప్రాయ సేకరణకు ఒక ఆలంబనగా మలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలిచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ వీలైన వాటిని అమలులో పెడుతున్నారు.

ఇప్పుడు కర్మయోగి పథకం ద్వారా ఐఏఎస్ లు తమ పని తీరు మెరుగు పర్చుకునేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. ఆధునిక కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం, కలం కనిపించడం లేదు. ఫైళ్ళు బూజు పట్టిపోవడం అనేది పాత పర్యాయపదంగా మారింది., ప్రభుత్వ రికార్డులను అన్నింటినీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడం వల్ల సంబంధిత ఉద్యోగి, లేదా అధికారి సెలవు పెట్టినా, లేదా ఊరెళ్లినా, పై అధికారులు కంప్యూటర్లలో సొంతంగా సెర్చ్ చేసుకునే పరిజ్ఞానాన్ని ఇప్పటికే పుణికి పుచ్చుకున్నారు. ఇది మరింతగా విస్తరిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలులో లోపాలు, లొసుగులు తొలగిపోతాయన్నది ప్రధాని ముఖ్యోద్దేశ్యం. ఉన్నతాధికారుల నుంచి సెక్షన్ ఆఫీసర్ల వరకూ, కింది స్థాయి ఉద్యోగుల వరకూ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు జవాబుదారీగా, పారదర్శకంగా ఉండేందుకు తీర్చిదిద్దే ప్రక్రియ ఇది. అంతేకాక, పాలనా వ్యవహారాల్లో మానవతా కోణం చాలా అవసరమని ఉపన్యాసాలు దంచేయడమే కానీ, ఇంతవరకూ ఆ కోణాన్ని ఆవిష్కరించేందుకు, కొత్త కొత్త విషయాలను కనిపెట్టి ఆచరణలో పెట్టేందుకు ఉన్నతాధికారులకు ఇంతవరకూ అవకాశం ఎవరూ కల్పించలేదు. ఇప్పుడు ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.అలాగే, డిజిటల్ ఇండియా , స్కిల్ ఇండియా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న వారిలో కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారుంటారు. అలాంటి వారి స్థానే యువకులు, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని ‘రూల్స్ బేస్డ్’ కాకుండా ‘రోల్స్ బేస్డ్ ‘ పాలన అందించేందుకు మోడీ తలపెట్టిన ప్రక్రియకు ఇది దోహదం చేస్తుంది. పాలనా రంగంలో సమూలమైన మార్పులకు ఇది దోహదం చేస్తుంది. పాలనా యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగానూ, జవాబుదారీగానూ తీర్చి దిద్దేందుకు మిషన్ కర్మయోగి దోహదం చేస్తుంది.

Leave a Reply