Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌ ‌వాసుల కలల సాకారం

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది దశాబ్దాలుగా ఒక నినాదంగానే మిగిలి పోతోంది. ఇప్పటి పాలకులు ఇప్పుడిప్పుడే దానిని అమలు జరిపేందుకు  చర్యలు తీసుకుంటున్నారు. అయితే, వాటిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు అడగుడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌ముందుకు తెచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు, బీజేపీ, సిపిఐ పార్టీలు అడ్డుకుంటున్నారు. తెలంగాణాలో కూడా అలాంటి అడ్డంకులు ఎదురైనా కరీంనగర్‌ను ఐటి హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు సాగిస్తున్న కృషి కొలిక్కి వస్తోంది. కరీంనగర్‌లో ఐటి కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించడం సాఫ్ట్‌వేర్‌ ‌రంగానికి చెందిన వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఐటి పరిశ్రమ కేంద్రం హైదరాబాద్‌లోని సైబరాబాదేనన్న  అభిప్రాయం జనంలో స్థిర పడిపోయింది. టెలివిజన్‌ ‌చానల్స్ ‌కూడా హైదరాబాద్‌ ‌లోని ఐటి టవర్స్‌నే పదే పదే చూపుతున్నారు. అలాంటి టవర్స్ ‌తెలుగు రాష్ట్రాల్లో కనీసం నాలుగైదు నగరాల్లో నిర్మాణం కావాలని ఇంజనీరింగ్‌ ‌నిపుణులు ఎంతో కాలంగా సూచిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలామ్‌ ‌హైదరాబాద్‌ ‌సందర్శించినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌(అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం)లో కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ‌తిరుపతి,  విశాఖ, అనంతపురం తదితర నగరాల్లో ఐటి హబ్‌లు ఏర్పడాలని సూచించారు.

భవిష్యత్‌ అం‌తా ఐటి రంగానిదేనని   అప్పట్లోనే ఆయన స్పష్టం చేశారు. ఐటి రంగానికి చెందిన తెలుగువారు అమెరికాలోని సిలికాన్‌ ‌వ్యాలీలో స్థిరపడి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా సందర్శించినప్పుడు అమెరికాలో ఐటి రంగం అభివృద్ధి చెందడంలో భారతీయుల పాత్రను గురించి ఎన్నో సార్లు స్తుతించారు. ఐటి రంగంలో హైదరాబాద్‌తో పోటీ పడేందుకు తెలుగు రాష్ట్రాల్లో పైనదహరించిన నగరాలకు ఎన్నో వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారున్నారు. కానీ, రాజకీయ కోణంలో అడ్డంకులు సృష్టించేవారు అంతకన్నా ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ నగరాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌నగరాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ది పథంలో దూసుకుని పోతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి సమస్య తీరింది. విద్యుత్‌ ‌సమస్య కూడా ఇప్పుడు లేదు. పారిశ్రామికంగా ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందేందుకు నీరు, విద్యుత్‌ ‌వంటి మౌలిక సౌకర్యాలు అవసరమన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఇప్పుడు ఈ రెండు మౌలిక సదుపాయాల విషయంలో అడ్డంకులను అధిగమించింది. ఇంజనీరింగ్‌ ‌విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. పట్టా చేతికందగానే ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కరీంనగర్‌, ‌వరంగల్‌లలో ఉద్యోగాలు లభించాయంటే వారికి కావల్సిందేముంది. విదేశాల్లో కరీంనగర్‌కి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య రంగంలో పేరెన్నికగన్న వారు ఎంతో  మంది ఉన్నారు. స్థానికంగా ఉద్యోగాలు లభిస్తే వారంతా విదేశాల్లో లభించినంత ఆదాయం రాకపోయినా, మాతృభూమికి సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు., మానేరు జలాశయం పక్కన ఐటి టవర్‌ ‌ప్రారంభమైంది. మరో టవర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది.

తెలంగాణలో ఇంజనీరింగ్‌ ‌విద్యా ప్రమాణాలను పెంచే కృషిలో భాగంగా అకాడమీ ఆప్‌ ‌స్కిల్‌ అం‌డ్‌ ‌నాలెడ్జ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది  కూడా ఎంతో ఉపయోగకరం. చదువుతో పాటు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఈ అకాడమీ దోహదం చేస్తుంది. కొద్ది నెలల క్రితమే వరంగల్‌లోని మడి కొండలో ఐటి క్యాంపస్‌  ‌ప్రారంభమైంది. మహబూబ్‌ ‌నగర్‌, ‌ఖమ్మం, నల్లగొండ వంటి నగరాల్లో కూడా ఐటి హబ్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐటి ఉద్యోగాలంటే హైదరాబాద్‌కో, బెంగళూరుకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్వస్థలాల్లోనే వాటిని  నేటి తరం యువకులు పొందేందుకు ఈ టవర్లు, హబ్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఐటి రంగాన్ని తెలుగువారికి పరిచయం చేసింది తానేనని సమయం వచ్చినప్పుడల్లా చెప్పుకునే చంద్రబాబునాయుడు    హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సంస్థలను ప్రారంభించి ఉంటే మూడు రాజధానుల వంటి ప్రతిపాదనలు వచ్చేవి కావు. విశాఖను హైదరాబాద్‌లా అభివృద్ది చేస్తానని ప్రకటించి పెట్టుబడుల ఆకర్షణ సదస్సులను కోట్లాది రూపాయిల వ్యయంతో నిర్వహించిన చంద్రబాబు విశాఖనే కాదు, ఏ నగరాన్నీ అభివృద్ధి చేయలేదు. హైదరాబాద్‌ ఐటి హబ్‌గా తయారు కావడానికి భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉండటం, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు ప్రధాన కారణం. నేదురమల్లి జనార్దన రెడ్డి హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఐటి పార్క్ ఏర్పడిందనే వాస్తవం జనానికి తెలుసు. అయితే, వాజ్‌పేయి హయాంలో సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా విదేశీ కంపెనీలు మన దేశానికి క్యూ కట్టడం  కూడా ఒక కారణం. వచ్చిన అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అంతకు రెట్టింపు ప్రచారం పొందారు. కరీంనగర్‌లో ఐటి హబ్‌ ఏర్పాటు వల్ల నగరంలో ఇతర పరిశ్రమలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్‌కు సహజవనరులకు లోటు లేదు. సాంస్కృతికంగా కూడా చాలా మంచి పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ధాన్యం ఉత్పత్తిలో కోనసీమ ప్రాంతంతో పోటీ పడేది. అందువల్ల కరీంనగర్‌ ‌పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందితే తెలంగాణ యువకుల  కలలు సాకారమవుతాయి. ఇంటెలిజెంట్‌ ‌టెక్నాలజీ వృద్ధి చెందడానికి ఇది శుభారంభం కానుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!