ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లున్న వీడియోలను పోలీసులు ఇంకా చూడకపోవడంపై మండిపడింది. వెంటనే ఆయా నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయమై సూచనలు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ఢిల్లీ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రమైన, ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని
ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఘటనలకు ముందు బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చూశారా? అంటూ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది.
అలాంటి వీడియో ఏదీ తాము చూడలేదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ చెప్పగానే ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు చూడండి అంటూ కపిల్ మిశ్రా వీడియోను కోర్టు గదిలోనే ప్రదర్శించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తిరిగి విచారణ ప్రారంభమయ్యాక కోర్టు తీవ్రంగా స్పందించింది. దేశంలో మరో 1984 ఘటనలను పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీలో ఐబీ అధికారి మృతదేహం లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర ఘటన అని అభివర్ణించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే బాధితులు, బాధిత కుటుంబాలను కలుసుకోవాలని ఆదేశించింది.