Take a fresh look at your lifestyle.

కార్మిక జనపక్ష నేత.. నేడు మన్నెబొయిన నర్సింహ యాదవ్‌ ‌వర్ధంతి

తెలంగాణ ప్రపంచ చరిత్ర గమనంలో తనదైన విలక్షణ పాత్రను పోషిస్తూనే ఉంది. అణచివేత, వివక్షత, అన్యాయానికి గురవుతున్న ప్రజల విముక్తి కోసం చరిత్ర మాత గర్భం నుండి వైతాళికులు ఉద్భవిస్తూనే ఉన్నారు.ప్రజలలో తాము బానిస జీవనం గడుపుతున్నామనే స్పృహ ను కలిగించి వారి జీవితాల్లో వెలుగు కోసం ఉద్యమబాటలో నడిపించిన యోధుల నిధి తెలంగాణ. ఈ నిధిలో ఉన్న విస్మృత చరిత్రకెక్కని యోధుడు మన్నెబొయిన నర్సింహ యాదవ్‌. ‌జీవించింది 61 సంవత్సరాలైన అందులో 40 సంవత్సరాలు బ్రిటిష్‌ ‌సామ్రా జ్యవాద, వారి తొత్తు నైజాం వ్యతిరేక పోరులో, గడిపి, హైదరాబాద్‌ ‌రాజ్య విలీనం తర్వాత నగర నవ నిర్మాణంలో,కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నర్సింహ యాదవ్‌ ‌పాటుపడ్డాడు. తెలంగాణ రైతాంగ సాయుధపోరులో చురుకైన పాత్ర వహించిన రామన్నపేట మండలంలో తుమ్మలగూడెం కు చెందిన మన్నబోయిన రామకృష్ణ ,దుర్గమ్మ దంపతులకు 12 జూన్‌ ,1915 ‌లో జన్మించారు.తండ్రి రామకృష్ణ 1944 భువనగిరి ఆంధ్రమహాసభ నాయకుడైన రావి నారాయణరెడ్డి పిలుపును అందుకొని తండ్రి రామకృష్ణ యాదవ్‌ ‌తో కలసి అనేక గ్రామాలలో వలంటీర్‌ ‌దళాల నిర్మాణంలో పాల్గొన్నాడు.

కమ్యూనిస్టుల అణచివేత కోసం 1948 లో యూనియన్‌ ‌సైన్యాలు ,ప్రవేశించాక నిర్భంధం తీవ్రతరమయింది. తల్లి దుర్గమ్మతో హైద్రాబాద్‌ ఆడిక్‌ ‌మెట్‌ ‌ప్రాంతానికి వచ్చి కార్మికరంగంలో పని చేసారు. హైద్రాబాద్‌ ‌లో సోషలిస్టు భావాలు గల స్వామి రామానంద తీర్థ ప్రభావంతో కాంగ్రెస్‌ ‌లో పని చేశారు.ఆల్విన్‌ ‌కార్మికుడిగా పని చేసిన టంగుటూరి అంజయ్య తో కలిసి కార్మిక హక్కుల కోసం వారి సౌకర్యాల కల్పన కోసము పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌పరిపాలన అవసరాల కోసం అనేక నూతన భవనాల నిర్మాణం లో కాంట్రాక్టర్‌ ‌గా ఇసుకను పంపిణీ చేశారు. ఉస్మానియా హాస్పిటల్‌ ‌రెనోవేషన్‌ ‌పనులను,తుంగభద్ర డాం పనులను చేపట్టారు.తన దగ్గర పని చేసిన కార్మికులను కుటుంబసభ్యులుగా భావించి వారి బాగోగులను స్వయంగా చూసుకునేవాడు. కార్మికులను తీర్థయాత్రలకు పంపేవారు. కొండా లక్మన్‌ ‌బాపూజీ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు డిబిఆర్‌ ,‌వి యస్‌ ‌టి కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. సినీ కార్మికులకు నివాస స్థలాలను ఇప్పించారు.బస్తీ వాసులకు ఉచిత వైద్యాన్ని అందించారు.తన మానవవాద చర్యలతో కార్మికబస్తీలకు నర్సింహ యాదవ్‌ ఆరాధ్యుడు అయ్యాడు. సికింద్రాబాద్‌ ‌పార్లమెంటు సభ్యుడుగా ,కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా టంగుటూరి అంజయ్య పని చేయడంలో నర్సింహాయాదవ్‌ ‌కీలక భూమిక పోషించారు.

నరసింహా యాదవ్‌ ‌తన మిత్రులు గండికోట చంద్రయ్య,కోమటి సోమయ్య,మిలట్రీ రాములు ,అజీమ్‌ ‌ఖాన్‌ ‌లతో కలిసి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయే అంశం మాణికేశ్వర్‌ ‌నగర్‌ ‌గా పిలిచే వడ్డెర బస్తీ నిర్మాణం. ఉస్మానియా యూనివర్సిటీ భవన నిర్మాణ కార్మికులు,క్రింది స్థాయి ఉద్యోగులు క్యాంప్‌ 1,2,3 ‌ప్రాంతాలలో తాత్కాలిక నివాసంలో ఉండేవారు.యూనివర్సిటీ విస్తరణలో నిర్వాసితులైన వీరికి హిమాయత్‌ అలీ ఖాన్‌ ‌బాగ్‌ ‌గా పిలిచే మాణికేశ్వర్‌ ‌నగర్‌ ‌ప్రాంతంలో నివాసస్థలాలకు 1100 పట్టాలు ఇప్పించారు. ఈ ప్రాంత వాసులు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని విద్యార్థి ఉద్యమ కారులను కాపాడుకున్నారు.అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఉక్కుపాదం మోపి విద్యార్థి ఉద్యమకారులను చంపించాడు. నర్సింహ యాదవ్‌ ‌తన మిత్రుడు పోలీస్‌ అధికారి ఖయామత్‌ ‌సహకారంతో అనేక ఉద్యమకారుల ప్రాణాలు కాపాడాడు.తదనంతర పరిణామాలతో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి లో కార్మిక రంగాన్ని సమీకరించి వెంకటస్వామి, హాషింలతో కలిసి పని చేసి దాని విజయం లో క్రియాశీల పాత్ర పోషించారు.

అతివాదుల్లో మితవాదిగా, మితవాదుల్లో అతివాదిగా, మానవతవాదిగా, కార్మికవర్గ పక్షపాతిగా పనిచేస్తూ తన సంపాదనను ,రాజకీయ సంబంధాలను ప్రజల బాగోగుల కోసం మళ్లించిన అపురూప మనిషి నరసింహ యాదవ్‌. ‌తన పిల్లలకు కేవలము చదువును మాత్రమే సంపాదనగా ఇచ్చి ఏమి దాచుకొని నవ్య మానవుడు.ప్రజా రాజకీయాల్లో తుదిశ్వాస వరకు పనిచేస్తూ అక్టోబర్‌ 1‌న 1976 లో తాను మెరుగులు దిద్దిన ఉస్మానియా హాస్పిటల్‌ ‌లో మరణించారు.అంతిమ యాత్రలో టంగుటూరి అంజయ్య,వెంకటస్వామి లతో వేలాదిగా బస్తీ ప్రజలు పాల్గొన్నారని దక్కేన్‌ ‌క్రానికల్‌ ‌ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.తన రాజకీయ జీవితానికి ఇరుసుగా పని చేసిన నర్సింహ యాదవ్‌ ‌తనయులకు అంజయ్య వివిధ కంపెనీలకు ఉద్యోగాలు ఇప్పించాడు.నర్సింహ యాదవ్‌ ‌కుమారులు తండ్రి జ్ఞాపకార్ధం మన్నెబొయిన ఫౌండేషన్‌ ‌స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.వీరి చిన్న కొడుకు కృష్ణయాదవ్‌ ‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.నగర సౌధాలను నిర్మించి ,నిర్మాణ కార్మికుల హుందా జీవితానికి కృషి చేసిన నర్సింహ యాదవ్‌ ‌జీవితం సదా స్పూర్తి దాయకం.

asnala srinivas
– అస్నాల శ్రీనివాస్‌, ‌రచయిత, పరిశోధకుడు 9652275560

Leave a Reply