Take a fresh look at your lifestyle.

మళ్ళీ హైదరాబాద్ కు -5

“రాజకీయ పోరాటాలు, సమ్మెలు చేయకుండా ట్రిబ్యునళ్ళ ముందరికి వెళ్ళడం, ఆ కాలయాపనలో పడి అణాపైసల కోసం దేబిరించడం మొదలయింది. మరోవైపు చాల మంది న్యాయవాదులు పారిశ్రామిక వేత్తల, వ్యాపారస్తుల ఛాంబర్లలో సభ్యులయి, యజమానుల పక్షాన వాదించడం మొదలయింది.అట్లాగే రాజకీయాలతో ఏ సంబంధమూ లేకుండా, రాజకీయ దృక్పథం లేకుండా కుప్పలు తెప్పలుగా ట్రేడ్‌ ‌ యూనియన్లు పుట్టుకు రావడం కూడ కార్మికోద్యమానికి నష్టం కలిగించింది.”

నా పేరు జనం నోళ్ళలో చాలా రకాలుగా మారిపోయింది. కొందరు కన్నాభిరామన్‌ అని, మరికొందరు కన్నాభిరామ్‌ అని, ఇంకా కొందరు కన్నాభిరాన్‌ అని, మరికొందరు కన్నబీరన్‌ అని పిలుస్తారు. ఆ భద్రాచలం ఆలయ పూజారి బహుశా తమిళ సంపర్కం వల్ల కావచ్చు నా పేరు సరిగ్గా పలికారు.

ఆ రకంగా ఒకవైపు ఎక్కువగా సివిల్‌ ‌కేసులు చేస్తూనే పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్‌ ‌ముందుకూడ చాలా కేసులు వాదించాను. ఆ తర్వాతి కాలంలోని పౌర హక్కుల ఉద్యమాచరణకు ఈ ట్రేడ్‌ ‌ యూనియన్‌ ‌కేసుల అనుభవం కూడ చాలా ఉపకరించిందనుకుంటాను.

ఇక్కడ ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం గురించి నా ఆలోచనలు చెప్పాలి. ట్రేడ్‌ ‌యూనియన్లలో 1960ల చివరికల్లా ఆర్థిక వాదం ప్రబలిపోయింది. ట్రేడ్‌ ‌ యూ నియన్ల లో, కార్మికోద్యమంలో తప్పనిసరిగా ఉండవలసిన రాజకీయ సునిశితత్వం మొద్దుబారి పోవడం మొదలయింది. అందరూ వేతన శర్మలై పోయారు. ఒకప్పుడు రాజకీయ అభినివేశం సక్రమంగా ఉండిన కార్మిక సంఘాలను కూడా ఆర్థిక వాదం లోలోపలి నుంచి తొలిచివేసింది.

అప్పుడే ప్రొఫెషనల్‌ – ‌వృత్తిపరమైన – ట్రేడ్‌ ‌ యూ నియన్‌ ఉద్యమం ఈ దేశంలో ప్రారంభమైంది. ట్రేడ్‌ ‌ యూనియన్‌ ‌నాయకులకు కార్మికుల పని పరిస్థితులతోగాని, వారి జీవితాలతో గాని ఏ సంబంధమూ ఉండనవసరం లేని స్థితి తలెత్తింది. యాజమాన్యం తో బేరసారాలాడగలగడం, యాజమాన్యాన్ని ఒప్పించ గలగడం, ఆడంబరంగా ఉండ గలగడం మాత్రమే కార్మిక నాయకత్వానికి అర్హత అయ్యాయి.

అటువంటి పరిణామాలకు ఒక సూచిక దత్తా సామంత్‌ ‌వంటి కార్మిక నాయకులు పుట్టుకురావడం.

అంటే కార్మిక నాయకులకు, కార్మికోద్యమాన్ని నడపదలచిన వాళ్ళకు ఎటువంటి విశాల దృక్పథం అవసరంలేని, రాజకీయాలు అవసరం లేని స్థితి ఏర్పడింది. అందువల్ల కార్మిక నాయకత్వం సులభంగా అవినీతికి లొంగేదిగా, అమ్ముడు బోయేదిగా తయారయింది.

ట్రేడ్‌ ‌ యూనియన్లు తమ కార్మికుల సమస్యల మీద రాజకీయ పోరాటాలు, సమ్మెలు చేయకుండా ట్రిబ్యునళ్ళ ముందరికి వెళ్ళడం, ఆ కాలయాపనలో పడి అణాపైసల కోసం దేబిరించడం మొదలయింది. మరోవైపు చాల మంది న్యాయవాదులు పారిశ్రామిక వేత్తల, వ్యాపారస్తుల ఛాంబర్లలో సభ్యులయి, యజమానుల పక్షాన వాదించడం మొదలయింది.

అట్లాగే రాజకీయాలతో ఏ సంబంధమూ లేకుండా, రాజకీయ దృక్పథం లేకుండా కుప్పలు తెప్పలుగా ట్రేడ్‌ ‌ యూనియన్లు పుట్టుకు రావడం కూడ కార్మికోద్యమానికి నష్టం కలిగించింది.

అలా ఎమర్జెన్సీ నాటికి, ఒక్క రైల్వే కార్మికోద్యమం మినహా, మిగిలిన అన్ని రంగాలలో కార్మికోద్యమం బలహీనమై పోయింది. ఒక రంగపు కార్మికులకు మద్దతుగా, సంఘీభావంగా మరో రంగపు కార్మికులు ఆందోళనకు దిగడం అనే అలవాటే తప్పిపోయింది.

కార్మికోద్యమం ఇట్లా బలహీన పడుతుండగా న్యాయస్థానాలు దాన్ని మరింత దెబ్బతీశాయి. కార్మికులకు, పౌరులకు సంఘాలలో సంఘటితమయ్యే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం హామీ ఇచ్చినా, న్యాయస్థానాలు ఆ హక్కును నీరుగార్చడం మొదలుపెట్టాయి.

కార్మికులకున్న సామూహికంగా బేరసారాలాడే హక్కులో సమ్మె హక్కు భాగం కాజాలదని న్యాయస్థానాలు కొత్త నిర్వచనాలిచ్చాయి. ప్రతి వివాదాన్నీ ‘సామరస్య పూర్వకంగా’ ట్రిబ్యునళ్ళలో పరిష్కరించుకోవాలని చెప్పడం ద్వారా సంఘంగా ఏర్పడే హక్కు పల్చబారిపోయింది. ఆ ట్రిబ్యునల్‌ ‌పరిష్కారాలు కూడా కొత్త నిర్వచనాల ప్రకారం అమలులోకి రావడం మొదలయింది. వివాదాలను సివిల్‌ ‌దావాల పరిధిలోకి తీసుకు వచ్చి కార్మికులకు కార్ఖానా ఆవరణలో ప్రవేశించే హక్కు లేదని, యాభై మీటర్ల అవతలే ఉండాలని, ఊరేగింపులు తీయగూడదని, ప్రదర్శనలు జరపగూడదని అనేక ఆంక్షలు విధించడం మొదలయింది.

అంటే న్యాయస్థానాలు శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత తమ భుజాలకెత్తు కున్నాయన్న మాట. సాధారణంగా కార్యనిర్వాహక వర్గం, ముఖ్యంగా పోలీసు శాఖ సెక్షన్‌ 144 ‌ద్వారా ఏ అధికారాలు అనుభవిస్తుందో, ఆ అధికారాలను పారిశ్రామిక ప్రాంతాల విషయంలో న్యాయస్థానాలు అనుభవించడం మొదలు పెట్టాయి. న్యాయ స్థానాలు ఇవాళ్టికి కూడ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అడ్డుపెట్టుకుని, సమ్మెలను భగ్నం చేసే వ్యవస్థలుగా తయారయ్యాయి.

పారిశ్రామిక వివాదాల చట్టం ఎంత వివాదస్పదమైన వ్యాఖ్యానాలకు దారితీసిందో ఊహించశక్యం కాదు. కార్మికులు నిస్సహాయులై పోయారు. ట్రేడ్‌ ‌ యూనియన్లు ఒకప్పుడు విడివిడి కార్మికుల సమస్యల మీద కూడా పోరాటం చేసేవల్లా ఇప్పుడా పనిని వదిలేశాయి. పారిశ్రామిక వివాదాల చట్టంలోని అభ్యంతరాలను సవరించేందుకు ఎన్ని సవరణలు వచ్చినా, కొత్త కొత్త రూపాలలో పాత నిర్వచనాలే, పాత వ్యాఖ్యానాలే కొనసాగాయి.

ట్రేడ్‌ ‌ యూనియన్‌ ఉద్యమం ఇంత గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉండగా అందులోకి నక్సలైట్లు ప్రవేశించారు. వాళ్ళకు ఈ రంగాన్ని ఎట్లా అవగాహన చేసుకోవాలో, ఇందులో సమస్యలేమిటో, వాటికి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలేమిటో తెలియదు. నిజానికి ట్రేడ్‌ ‌ యూ నియన్‌ ‌సమస్యల పరిష్కారంలో తిరుగుబాటు (ఇన్‌సరెక్షనరీ) పద్ధతులు పనిచేయవు. కాని నక్సలైట్లు పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్ర మన్నట్టు అవే పద్ధతుల ద్వారా ట్రేడ్‌ ‌ యూనియన్‌ ‌సమస్యలను పరిష్కరిద్దామనుకున్నారు. ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం తప్పనిసరిగా ప్రజాస్వామికంగా ఉండవలసి ఉంటుంది.

అలా ప్రజాస్వామికంగా ఉండక పోవడం వల్ల, తిరుగుబాటు పద్ధతులను అమలు చేసినందువల్ల ఎన్నో కార్మిక సమస్యలలో ఓడిపోవడం నాకు తెలుసు. కాని ఆ సమస్య లన్నీ న్యాయమైనవీ, ఇతర పద్ధతులలో పోరాడి ఉంటే విజయం సాధించగలిగినవీ కూడ. అటువంటి పద్ధతుల వల్లనే రైతాంగ ఉద్యమం కూడ అపయానికి గురయిందని నేననుకుంటాను. కాని అది మరోచోట.

దేశం మొతం మీద పనిచేస్తున్న ట్రేడ్‌ ‌యూ నియన్లు ఒకవైపు ఆర్థిక వాదంలో కూరుకు పోవడంతో పాటు మరోవైపు పిడివాదంతో కొందరు కార్మికులను, ఒక విశాల కార్మిక రంగాన్ని దూరం చేసుకున్నాయి. అది అసంఘటిత కార్మిక రంగం. కాంట్రాక్టు కార్మికులను పూర్తి స్థాయి కార్మికులుగా గుర్తించి, తమ సంఘాలలో సంలీనం చేసుకునేందుకు జాతీయ కార్మిక సంఘాలు సంకోచించినందువల్ల దేశంలో విస్తృతమైన అసంఘటిత రంగంలోని కార్మికులు ఎక్కడికక్కడ తమకు తోచిన రీతిలో సంఘాలలో సంఘటితం కావడం మొదలయింది.

ఇటువంటి కార్మికులను సమీకరించవలసి ఉన్నదని, ఆ ఉద్యమాన్ని రాజకీయ స్పర్శతో నిర్వహించాలని సంపూర్ణంగా గుర్తించి, ఆ పని చేసినవాడు శంకర్‌  గుహనియోగి. ఆయన మీద ఎన్ని రకాల ఒత్తిడులు ఎన్నివైపుల నుంచి వచ్చినా లొంగిపోలేదు. అందుకే ఆయనను చంపేశారు. ఆయన హత్యకేసు నేను వాదించాను. అది మరోసారి.

ఇదంతా చెప్పడం ఎందుకంటే నా పౌరహక్కుల ఉద్యమ కార్యాచరణ నాటి సామాజిక, రాజకీయ స్థితిగతులు ఆ ఉద్యమాన్ని ఎట్లా అనివార్యం చేశాయో చూపడానికే.

ట్రేడ్‌ ‌యూనియన్లలో ఆర్థికవాదం ప్రవేశిస్తే అది ఏ ప్రమాదానికి దారితీస్తుందో లెనిన్‌ ‌రాశాడు. సరిగ్గా ఆయన హెచ్చరించినట్టుగానే మనదేశంలో కూడ సంఘటిత కార్మికోద్యమంలో ప్రవేశించిన ఆర్థికవాద వేరు పురుగు దేశ రాజకీయ జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్నీ ధ్వంసం చేసేసింది. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపైన పోరాడగలిగిన శక్తి ఉన్న కార్మికవర్గం ఆ ఆర్థికవాదం వల్లనే నిర్వ్యాపకతలోకి దిగజారింది.

మన సామాజిక జీవితంలోని ఒక్కొక్క వ్యవస్థా – రాజకీయాలు, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, మధ్య తరగతి, కార్మిక వర్గం – తమ కర్తవ్య నిర్వహణలో ఎట్లా విఫలమవుతూ వచ్చాయో నా అనుభవం నుంచి రేఖామాత్రంగా వివరించాను.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం

అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply