Take a fresh look at your lifestyle.

ఎమర్జెన్సీ-2

“అప్పటి అరెస్టుల గురించి రమణి నాకొక విషయం చెప్పాడు. మామూలుగా ఎవరిని, ఏ కారణాల మీద అరెస్టు చేస్తున్నారో పేరు, వివరాలు, నేర అభియోగాలు, సెక్షన్ల వివరాలతో అరెస్టు వారెంట్లు తయారుచేసి, అవి నిందితుడికి చూపి అరెస్టు చేయాలి. కాని పోలీసులు పేర్లు, వివరాలు లేకుండా ఖాళీ అరెస్టు వారెంట్లు తయారు చేసి ఇష్టం వచ్చిన వాళ్ళను అరెస్టు చేసి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆ వివరాలు నింపుతున్నారని రమణి చెప్పాడు. అప్పుడు కోర్టు హాల్లో రామకృష్ణా రెడ్డి అనే డిసిపి ఉన్నాడు. ఆయన దగ్గర కూడ అటువంటి ఖాళీ వారెంట్లున్నాయి. అసలు అట్లా ఖాళీ వారెంట్లు తయారుచేసి దగ్గర పెట్టుకోవడం శిక్షార్హమైన, చట్ట వ్యతిరేకమైన పని. అలా పోలీసు అధికారి దగ్గర ఖాళీ వారెంట్లున్నాయని, అలా అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమని నేను జస్టిస్‌ ‌చెన్నకేశవ రెడ్డి గారికి చెప్పాను. ఆ పోలీసు అధికారి దగ్గర వారెంట్లు దొరికాయి. చెన్నకేశవ రెడ్డి గారు నిండు కోర్టు హాల్లో ఆ అధికారికి బాగా చివాట్లు పెట్టారు. ‘ఏమిటీ చట్ట వ్యతిరేక చర్యలు’ అని అరిచారు.”

అంతకు ముందే సుప్రీం కోర్టు రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చగూడదు అని తీర్పు ఇచ్చి ఉంది గదా. అది ఆస్తి విషయంలోనేనా మనకు ఉండగూడదా అని అరెస్టు రాజ్యాంగపు మౌలిక నిర్మాణానికి ఉల్లంఘన, కనుక చెల్లదని వాదించాను.

నేనిట్లా వాదించగానే మాధవ రెడ్డి గారు దాన్ని ఫుల్‌ ‌బెంచికి నివేదించారు. ఫుల్‌ ‌బెంచిలో జస్టిస్‌ ‌మాధవ రెడ్డి గారు, జస్టిస్‌ ‌గంగాధరరావు గారు, జస్టిస్‌ ‌జయచంద్రా రెడ్డి గారు ఉన్నారు.

ఇది ఎట్లా అయిపోయిందంటే నేనీ కేసు వాదిస్తూ ఉండగానే, ఇంకా ఇంకా ఎంతో మందిని అరెస్టు చేసి డిటెన్యూలుగా తీసుకురావడం, వాళ్ళు మా వకీలు కన్నబిరాన్‌ అని అంటూ ఉండడం. ఇట్లా వాదన సాగుతూ పోయింది.

అందరికీ నేను మెమో ఆఫ్‌ అపియరెన్స్ ‌వేసేవాణ్ణి. రిట్‌ ‌పిటిషన్లు వేసేవాణ్ణి. తలమునకలుగా పని ఉండేది. జక్కా వెంకయ్య, వై. రాధాకృష్ణమూర్తి – సిపిఎం వాళ్ళు, ఎంఎల్‌ ‌వాళ్ళు అందరూ నా పేరే చెప్పేవాళ్ళు.

జైల్లో పడి ఉన్నప్పుడు బైట గాలి పీల్చాలంటే కోర్టు వాయిదానే ఆధారం. అట్లా ఏదో ఒక కారణం మీద ఆ డిటెన్యూలందరూ పిటిషన్లు వేసేవాళ్ళు. వాళ్ళ తరఫున నేనే వాదించే వాణ్ణి. అట్లా మొత్తం మీద ఆ రోజుల్లో నేను దాదాపు రెండు మూడు వందల రిట్‌ ‌పిటిషన్లు వేసి ఉంటాను. ఒకే పిటిషన్‌ ‌నలుగురు, ఐదుగురు డిటెన్యూల తరఫున వేయవలసి ఉండేది.

పత్తిపాటి వెంకటేశ్వర్లు తరఫున వేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ ‌చేసింది. అట్లాగే ఆ పిటిషన్లన్నీ డిస్మిస్‌ అయిపోయాయి.

ఆ రోజుల్లో నా ఇంటి ముందర విపరీతమైన నిఘా పెట్టారు. ఎందుకో నన్ను మాత్రం అరెస్టు చేయలేదు. ఇంకో న్యాయవాది ఎవరూ ఇటువంటి కేసులు చేయడం లేదు గనుక ఉన్న ఒక్కణ్ణి ఎందుకు అరెస్టు చేయాలనుకున్నారో ఏమిటో తెలియదు. వకీలును కూడా తీసేసినారంటే ఇంకా భ్రష్టు పడతామని అనుకున్నారేమో.

ఒక్కసారి ఇన్ని రిట్‌ ‌పిటిషన్లు ఉండడంతో ఒక్కోసారి ఒకే సమయానికి రెండు మూడు కోర్టుల్లో వాదనలు ఉండేవి. అవి వాయిదా అయినా అడిగే వాణ్ని, లేదా ఏం మునిగిపోయింది మీరే వాదించుకోండి అని డిటెన్యూలకు చెప్పేవాణ్ణి.

అట్లా ఒక ఫుల్‌ ‌బెంచికీ, మరొక బెంచికీ పరస్పరం విభేదించుకున్న తీర్పు వచ్చింది. జస్టిస్‌ ‌మాధవ రెడ్డి, జస్టిస్‌ ‌పున్నయ్య ఆ బెంచిలో ఉన్నారు. కేశవరావు జాధవ్‌, ‌నరేంద్ర, శీతల్‌ ‌సింగ్‌ ‌లష్కరి, పి. వెంకటేశ్వర్లు – ఇట్లా పదిమంది ఒక బ్యాచ్‌గా వేసిన రిట్‌ ‌పిటిషన్‌ అది.

మాధవ రెడ్డి గారు ఆ రిట్‌ను అనుమతించారు. పున్నయ్య గారు కొట్టేశారు.

ఈ డిటెన్యూలు పున్నయ్యకు వ్యతిరేకంగా కోర్టు హాల్లో నినాదాలు చేశారు. నరేంద్ర, శీతల్‌ ‌సింగ్‌ ‌లష్కరిలు బెంచి మీదికి చెప్పులు విసిరేశారు.

అలా చేయడం తప్పే. పున్నయ్య గారేదో ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. అప్పటికే ఎందరో మహామహులు ఇందిరా గాంధీకి దాసులయి పోయినప్పుడు పున్నయ్య గారి మీద అట్లా ప్రవర్తించడం తప్పే.

అట్లా కోర్టు హాల్లో నినాదాలివ్వడం, న్యాయమూర్తి మీదికి చెప్పులు విసరడం తప్పు. అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. నన్ను న్యాయమూర్తులు తమ ఛాంబర్‌ ‌లోకి పిలిపించారు. ‘మీ క్లయింట్లు ఇట్లా కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఎట్లా? దీన్ని కోర్టు ధిక్కరణ కింద విచారించి శిక్షలు వేస్తాము’ అన్నారు.

అది ఒక పెద్ద సంక్షోభం. అప్పటికే వాళ్ళు ఆరు నెలలకు పైగా అక్రమ నిర్బంధం లో ఉన్నారు. మళ్ళీ కోర్టు ధిక్కరణ కింద శిక్ష పడితే మరింత వేధింపుకు గురవుతారు. నేను గందరగోళంలో పడ్డాను. అటు వాళ్ళు తప్పు చేయలేదని వాదించలేను. ఇటు ఈ కొత్త నేరం కింద శిక్ష విధించడానికి ఒప్పుకోలేను.

అందుకని జస్టిస్‌ ‌పున్నయ్య గారి మానవతా దృష్టిని మేల్కొలిపాను. ‘‘నిజమే. వాళ్ళు అట్లా ప్రవర్తించడం తప్పే. అది కోర్టు ధిక్కారమే. న్యాయమూర్తిని, న్యాయస్థానాన్ని అవమానించడమే. కాని అప్పటికి ఆరు నెలలుగా వాళ్ళు ఏ నేరారోపణ లేకుండా, విచారణ లేకుండా జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళ ప్రవర్తనను ఆ నేపథ్యం నుంచి అర్థం చేసుకోండి. మీరిప్పుడు ఈ కొత్త నేరం కింద మరింత శిక్ష విధించారనుకోండి, మీకు అదనంగా వచ్చేదేమీ లేదు. పెద్ద మనసుతో వాళ్ళను క్షమించండి. న్యాయమూర్తిగా మీరెంత హుందాగా ప్రవర్తించగలరో చూపండి’’ అని వాదించాను.

మొత్తానికి పున్నయ్య గారు నా విన్నపాన్ని అంగీకరించారు. డిటెన్యూల ప్రవర్తనను క్షమించారు.

ఆ రోజుల్లో జరిగిన మరొక సంఘటన చెప్పాలి.

జస్టిస్‌ ‌చెన్నకేశవ రెడ్డి బెంచి ముందు నేను ఈ ఎమర్జెన్సీ డిటెన్యూల కేసులే వాదిస్తున్నాను. అప్పటి రాడికల్‌ ‌విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎన్‌. ‌వెంకటరమణి కూడా డిటెన్యూలలో ఉన్నాడు.

అప్పటి అరెస్టుల గురించి రమణి నాకొక విషయం చెప్పాడు. మామూలుగా ఎవరిని, ఏ కారణాల మీద అరెస్టు చేస్తున్నారో పేరు, వివరాలు, నేర అభియోగాలు, సెక్షన్ల వివరాలతో అరెస్టు వారెంట్లు తయారుచేసి, అవి నిందితుడికి చూపి అరెస్టు చేయాలి. కాని పోలీసులు పేర్లు, వివరాలు లేకుండా ఖాళీ అరెస్టు వారెంట్లు తయారు చేసి ఇష్టం వచ్చిన వాళ్ళను అరెస్టు చేసి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆ వివరాలు నింపుతున్నారని రమణి చెప్పాడు.

అప్పుడు కోర్టు హాల్లో రామకృష్ణా రెడ్డి అనే డిసిపి ఉన్నాడు. ఆయన దగ్గర కూడ అటువంటి ఖాళీ వారెంట్లున్నాయి. అసలు అట్లా ఖాళీ వారెంట్లు తయారుచేసి దగ్గర పెట్టుకోవడం శిక్షార్హమైన, చట్ట వ్యతిరేకమైన పని.

అలా పోలీసు అధికారి దగ్గర ఖాళీ వారెంట్లున్నాయని, అలా అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమని నేను జస్టిస్‌ ‌చెన్నకేశవ రెడ్డి గారికి చెప్పాను. ఆ పోలీసు అధికారి దగ్గర వారెంట్లు దొరికాయి. చెన్నకేశవ రెడ్డి గారు నిండు కోర్టు హాల్లో ఆ అధికారికి బాగా చివాట్లు పెట్టారు. ‘ఏమిటీ చట్ట వ్యతిరేక చర్యలు’ అని అరిచారు.

అయితే ఎమర్జెన్సీలో ఎంత భయానక వాతావరణం ఉండిందంటే ఈ చట్ట వ్యతిరేక పని గురించి తెలిసి కూడ, నిండు కోర్టు హాల్లో పోలీసు అధికారిని చివాట్లు పెట్టి కూడ, న్యాయమూర్తి ఆ అరెస్టులను మాత్రం కొట్టివేయ లేకపోయారు. ఎంత గట్టిగా మాట్లాడినా, న్యాయమూర్తి అరెస్టులను కొట్టివేసి, మా రిట్‌ ‌పిటిషన్‌ను ఆమోదించి, డిటెన్యూలను విడుదల చేయబోరని నాకు ముందే తెలుసు.

నా ఊహను నిజం చేస్తూ న్యాయమూర్తి మా పిటిషన్‌ను డిస్మిస్‌ ‌చేశారు. అక్రమ అరెస్టులని తెలిసినప్పటికీ ఆ అరెస్టులను ఆమోదించారు.

అట్లా ఎమర్జెన్సీలో ఆంధ్ర ప్రదేశ్‌లో వందలాదిమంది అక్రమ నిర్బంధానికి గురయి, ఎమర్జెన్సీ కాలమంతా జైళ్ళలో మగ్గిపోయారు. వేలాది మంది కొద్ది రోజుల పాటో, నెలల పాటో తాత్కాలిక నిర్బంధ, చిత్రహింసా శిబిరాల్లో ఉండిపోయారు.

ఆ ఎమర్జెన్సీ డిటెన్యూలలో కొందరి పిటిషన్లయినా ఆమోదించి వారి విడుదలకు ఆదేశించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ‌జి.సి.కొండయ్య, జస్టిస్‌ ‌సాంబశివరావు, జస్టిస్‌ ‌మాధవ రెడ్డి, జస్టిస్‌ ‌కుప్పుస్వామి లాంటి కొద్దిమంది మాత్రమే.

అంటే ఇక్కడ ఒక విచిత్రం చూడాలి. వామపక్ష, ప్రగతి శీల రాజకీయాలకు దగ్గరగా ఉండే ప్రభుత్వం అని అందరూ చెప్పుకుంటూ ఉంటే అణచివేత ఎక్కువగా వామపక్ష పార్టీల మీద, సానుభూతిపరుల మీద అమలయింది.

భారత కమ్యూనిస్టు పార్టీ శ్రీమతి ఇందిరా గాంధీని సమర్థించింది. మొదట డాంగే సమర్థించాడు. తర్వాత పార్టీ అంతా అదే ధోరణి అవలంబించింది.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply