Take a fresh look at your lifestyle.

కన్నఊరి ప్రేమ

మట్టికుండలో మక్కగడ్క అండి
ఇంత సల్ల పోసుకొని తింటే ఎంత మధురంగ..
ఉంటదో..మా పల్లె ప్రేమ అంత కమ్మగుంటది.
మట్టితటారిలో జొన్నపిండిపోసి..
చేయిమీద రొట్టెకు రూపమిచ్చి..మా అవ్వ
పెంకమిదేసి కాల్చిన జొన్నరొట్టె తిన్నట్లుంటది.
మా ఊరి ప్రేమంటే బంధాలను కలిపేది.
ఆప్యాయంగా పలకరిస్తూ ఆకలి కడుపులను నింపేది.

చినుకులన్నీ నేలనుతడిపితే..
భూతల్లి కమ్మని వాసనని పంచినట్లుంటది
మా పల్లె ప్రేమ.
పూలమీద వాలిన తుమ్మెదలు కమ్మని మకరంధాన్ని
ఆస్వాదించినట్లుంటది.
ఒళ్ళంతా ప్రేమ గంధాన్ని పూసుకుని
మాయమవుతున్న మనుషుల నుదుటిపైన
బంధాల గంధాన్ని పూసి ఒక్కటి చేస్తుంది నా ఊరు.
అలసిన హృదయాలను అక్కున చేర్చుకొని..
నా ఊరు నదిలా మారి..చల్లని అలల తాకిళ్ళను
విసురుతూ మనసులను చల్లబరుస్తుంది.

దుడ్డేబోక్కులు మేకపిల్లలు నేను మా నాయన
అందరం ఓకేకాడ కూసోని సేదతీరుతం.
గేదేలకు కోసుకచ్చిన పచ్చని గడ్డి..నేను
మాట మంతీ కలిపి యోగక్షేమాలను అడుగుతుంటే..
పచ్చని గడ్డంతా గేదె కడుపురింపి..
త్యాగానికి మించిన గుణంకంటే గొప్పదేముందని
నవ్వుతూ ఆకలిని తీరుస్తుంది.
నెమరేస్తూ ముగజీవులన్ని తలచుకునేది..
కడుపునింపిన ఆకుపచ్చని తరువులనే.!
నిద్రాడోలికల్లో మునిగిపోయి కునుకుతీస్తుంటే..
కల్లోకచ్చి పలకరిస్తుంటది కన్నఊరు

అరుగుమీద మా అవ్వనాకు  ముచ్చట్లు చెపుతుంటే
గెలుపు గుర్రమెక్కి విజయతీరాల్ని చేరినట్లుంటది.
ఊరి ముచ్చట్లన్నీ ఎరుకజేస్తూ..
జ్ఞాపకాలను పల్లె పాటలుగాచేసి వినిపిస్తుంది.
తారలన్నీ మెరుస్తూ అవ్వ మాటల్ని వింటూ..
చందమామ వెన్నెలతో పోటీపడి..       నక్షత్రకాంతులను  వెదజల్లుతాయి.
నాయన దేహం చెమటలు కక్కుతూ..
నల్లని వజ్రంలా మెరిసిపోతుంటే..
మా పల్లె…గుండెలో కన్నీటి తెరలను తెంపుకొని
కాలాన్ని చేతులుగా మార్చుకొని..
తనువు కన్నీరును తుడుస్తుంది.!
మా ఊరు ఎపుడు పచ్చని  పందిరై
రెక్కలిరిగి వస్తున్న వలస పక్షులను అక్కునచేర్చుకొని
పేగుబంధమై ప్రేమను పంచుతుంది.

– అశోక్‌ ‌గోనె
9441317361.

Leave a Reply