జిల్లాలో కానరాని ఉత్సాహం
వేడుకలకు దూరంగా సర్కార్
కొరోనా, వరదలతో మహిళల్లో నిరుత్సాహం
తొమ్మది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబురాలు సద్దుల బతుకమ్మ రోజున అట్టహాసంగా, సందడిగా సాగేవి. అయితే శనివారం నాడు సద్దుల బతుకమ్మ ఊరూవాడ జరిగినా గతంలో లాగా ఎక్కడా పెద్దగా హడావిడి లేకుండా కొనసాగింది. సద్దుల బతుకమ్మ సిద్దిపేట, జనగామ, హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్ పట్టణాల్లో ఏటా జోరుగా సాగేది. అయితే వరదలు, వర్షాలు, కొరోనా కారణంగా ఆడపడుచుల్లో మునుపటి ఉత్సాహం కానరాలేదు. అలాగే పూల మార్కెట్లు కూడా డల్‌గా కనిపించాయి. దీనికితోడు వర్షాలతో బతుకమ్మ పూల ధరలు చుక్కలనంటుండడంతో కూడా ఎక్కడా పెద్దగా కొనుగోళ్లు సాగలేదు. ఆడపడుచుల సందడి పెద్దగా లేకుండానే బతుకమ్మ సాగిపోయింది.
తెలంగాణలో ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు పూల జాతరతో జరుపుకున్న బతుకమ్మ పండుగపై ఈ యేడాది పెద్ద ప్రభావమే చూపింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా పల్లె, పట్నం, ఊరూ, వాడా, తంగేడు, గునుగు పువ్వుల వనాలయ్యేవి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోయేది. మొత్తంగా సద్దుల బతుకమ్మ పండుగ సంబురంగా సాగేది. అయితే గతంతో పోలిస్తే సందడి తగ్గినా ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజుల పాటు ఎక్కడికక్కడ ఉత్సాహంగానే జరిగాయి. సద్దుల బతుకమ్మను జిల్లాల్లో ఒకే దగ్గర కాకుండావారి వాడల్లో, కాలనీల్లో ఆడిపాడారు. అన్ని గ్రామాల్లో పూలపండగతో మహిళలు సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు మాత్రం ఈ యేడు కానరాలేదు.
శనివారం సద్దుల బతుకమ్మ రోజు ప్రతీ ఇంటా బతుకమ్మను పేర్చి ఇళ్లవాకిళ్ల ఎదుట బతుకమ్మ పాటలతో ఆడిపాడి బతుకమ్మ ఘాట్‌ల వద్ద కాకుండా ఎక్కడికక్కడే నీళ్లలో వొదిలారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై, హన్మకొండలోని పద్మాక్షి గుండం, వరంగల్‌లోని రంగసముద్రం వంటి ప్రాంతాల్లో, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సద్దుల బతుకమ్మ పండుగ సందడి ఎక్కడా కానరాలేదు.