- రికార్డు బద్దలుకొడుతూ బిజెపి విజయ దుందుభి
- 156 సీట్లతో రాష్ట్రంలో 7వ సారి అధికారం కైవసం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 8 : గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ప్రభంజనం సృష్టించింది. రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకుని 7వ సారి బిజెపి అధికారం కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ విజయదుందుభి మోగించి గుజరాత్ ఎన్నికల్లో పలు పాత రికార్డులను తుడిచిపెట్టింది. వరుసగా 27 ఏళ్లుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ గత ఎన్నికల్లో అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలవగలిగింది. 2002లో ఈ రికార్డ్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అచేసింది. మరోవైపు 1985లో మాధవ్ సింగ్ సొలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డ్ స్థాయిలో 149 స్థానాల్లో గెలిచి రికార్డ్ స్థాయి మెజారిటీని సాధించింది.
సామాజిక కూటమి ఖమ్(కోలి క్షత్రియ, హరిజన్, ఆదివాసి, ముస్లిం) ఏర్పాటు చేసిన సోలంకి అతి భారీ విజయాన్ని సాధించడంలో సఫలీకృతమయ్యారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటీ అదే రికార్డుగా ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీజేపీ చెరిపేసింది. కాగా గత 27 ఏళ్లుగా గుజరాత్ పాలిస్తున్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలు 2017లో 99 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. కానీ తాజా ఎన్నికల్లో చతికిలపడింది. కేవలం 17 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వొచ్చింది. 1985లో రికార్డ్ స్థాయి విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఆప్ 5 స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో మొదటిసారిగా ఖాతా తెరిచింది. కాగా ఆప్ పోటీ చేయడం కాంగ్రెస్‌కు భారీ నష్టం చేసిందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీకి రికార్డ్ స్థాయి విజయం సాధ్యమయింది.