Take a fresh look at your lifestyle.

కమలనాథుల టార్గెట్‌ ఎంఐఎం..!

‌కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఆదివారం జరిపిన హైదరాబాద్‌ ‌పర్యటన జాతరను తలపింప జేసింది. నిజానికి ఆయన ఎన్నికల కోసం వొచ్చారో, బలప్రదర్శనకు వొచ్చారో సామాన్యులకు అర్థ కాలేదు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీ ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఎందుకు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవలసిన అవసరం లేదు. పురపాలక, నగరపాలక ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగితేనే అవి అభివృద్ధి చెందుతాయి. గతంలో పార్టీలకు అతీతంగా పట్టణాభివృద్ధి సమితిల ఆధ్వర్యంలో మునిసిపల్‌ ఎన్నికలు జరగేవి. అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా జరిగేవి. పార్టీ రాజకీయాలతో నిమిత్తం లేకుండా నగరాలు, పట్టణాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేవి. ప్రమేయం వొచ్చిన తర్వాతే పౌర సంస్థల్లో అభివృద్ధి అడుగంటింది. కేంద్ర మంత్రిగా అమిత్‌ ‌షా గతంలో ఎన్నోసార్లు వొచ్చారు. పాతబస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం సందర్శించిన దాఖలాలు లేవు. గ్రేటర్‌ ఎన్నికలు లేకపోతే ఇప్పుడు కూడా సందర్శించి ఉండేవారా అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతున్నది. అంతేకాక, బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కూడా వరద సాయం ఆపేయమని కేంద్రానికి తాను లేఖ రాయలేదని ప్రమాణం చేయడానికి నగరంలో ఎన్నోఆలయాలుండగా భాగ్యలక్ష్మీ ఆలయాన్నే ఎంచుకున్నారు.

పాత బస్తీలో ఎంఐఎం బలంగా ఉండటం వల్ల ఆ పార్టీని సవాల్‌ ‌చేయడానికే అప్పుడు సంజయ్‌, ఇప్పుడు అమిత్‌ ‌షాఎంచుకుని ఉండవొచ్చు. ఎన్నికలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం ఉద్రిక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో కేంద్ర బలగాల బందోబస్తుతో ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీని సవాల్‌ ‌చేయడానికి ఇంకా చాలామార్గాలు ఉన్నాయి. బీజేపీ లక్ష్యం తెరాసని ఓడించడం కాదనీ, మజ్లిస్‌ ‌పార్టీయేనని దీంతో స్పష్టమైంది. మజ్లిస్‌ ‌పార్టీని రాష్ట్రంలో(ఉమ్మడి రాష్ట్రంలో కూడా) అధికారపార్టీలే పెంచి పోషించాయి. అందుకే ఆ పార్టీ నాయకుడు ఒకరు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఢంకా భజాయించి చెప్పారు. అది నిజంగానే కనిపిస్తోంది. బహుశా అందుకే కమలనాథుల్లో పట్టుదల పెరిగి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను హైదరాబాద్‌కి క్యూ కట్టించారు. తెరాస కూడా మజ్లిస్‌తో అంత సన్నిహితంగా ఉండకపోయి ఉంటే బీజేపీలో పట్టుదల పెరిగేది కాదేమో. కాంగ్రెస్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ప్రచార సరళి చూస్తుంటే ఈ ఎన్నికలు తెరాస, బీజేపీల మధ్యనేననిపిస్తోంది. నగర సమస్యలపై ప్రచారం జరపకుండా, సవాళ్ళు విసురుకోవడం, ఏ సంస్కృతో అర్థం కావడం లేదు. తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర మంత్రి కె.టి రామారావు ప్రసంగాల్లో కొంత అతిశయోక్తి ఉన్నా, కేవలం నగర సమస్యలకే పరిమితం అయ్యాయి.

ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు బీజేపీ నాయకుల కవ్వింపు ప్రసంగాలకు స్పందించిన తీరు కూడా పరిధిలోనే ఉంది. ఒక బక్కోణ్ణి కొట్టడానికి ఇంత మంది ఢిల్లీ నుంచి తరలి రావాలా అంటూ ఆయన వేసిన ప్రశ్న జనం సానుభూతి కోసమే. వరద సాయం డిసెంబర్‌ 7 ‌వ తేదీ నుంచి అందిస్తామని అన్నారు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ దాదాపు పాతవే. ఐదేళ్ళూ కార్పొరేషన్‌లో అధికారంలో ఉండి పాత వాగ్దానాలనే మళ్ళి వల్లించడం సమంజసంగా లేదు. వరద సాయం పక్కదారి పట్టిందన్న ఆరోపణలపై స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. బీజేపీపై ఆయన ఆచితూచి విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను ఈ రెండు పార్టీలు అసలు బరిలో ఉన్నట్టు గుర్తించలేదేమననిపిస్తోంది. హైదరాబాద్‌ని విశ్వనగరగా అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేసినా దాని కోసం కేంద్రం ఏపాటి సాయం అందించిందో, అందించదలచిందో కమలనాథులు ప్రకటించ లేదు. అసలు ఎవరూ చేయకపోయినా హైదరాబాద్‌ ‌భౌగోళికంగా కీలకమైన ప్రదేశంలో ఉన్నందున దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. కార్పొరేషన్లో అధికారంలోకి వొస్తే హైదరాబాద్‌ని భాగ్యనగరంగా మారుస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌వాగ్దానం చేశారు. బీజేపీ ప్రస్తుత లక్ష్యమేమిటో ఆయన చెప్పకనే చెప్పారు. మొత్తం మీద ఈ ఎన్నికల ప్రచార తీరు ప్రజలకు వెగటు పుట్టించింది. అక్కడా, ఇక్కడా అధికారంలో ఉన్న పార్టీలు అమీ తుమీ తేల్చుకోవడానికే ఈ ఎన్నికలను ఉపయోగిచుకున్నట్టు స్పష్టం అవుతోంది. నగర సమస్యలను గాలికి వొదిలేశారు.

Leave a Reply