- తోబుట్టువులా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అందజేస్తున్న సిఎం కెసిఆర్
- దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు
- గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు
- తల్లి బరువును దించేలా.. తోబుట్టువులా
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆడపిల్లల పెండ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్నారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం రూ.4.79 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, గజ్వేల్ మునిసిపల్ ఛైర్మన్ రాజమౌళితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. అదే విధంగా సమీకృత ఆఫీసు కాంప్లెక్సులో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…సిద్ధిపేట జిల్లాలో 5588 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద రూ.48 కోట్ల 45 లక్షల రూపాయల సాయం అందించినట్లు వె•ల్లడించారు.
పేదింటి ఆడ పిల్లల పాలిట కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఓ వరమని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నట్లు, బిజెపి పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో, కాంగ్రెస్, శివసేన పార్టీ ప్రభుత్వాలైన మహారాష్ట్రలో ఎక్కడ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు లేవని చెప్పారు.ఇవాళ రూ.4.79 కోట్ల రూపాయలతో గజ్వేల్‌లో వివిధ అభివృద్ధి పనుల కార్యక్రమాలు చేసుకుంటున్నామనీ, రూ.30 లక్షలతో షీ టాయిలెట్స్, రూ.81.25లక్షలతో భూసార పరీక్షా కేంద్రాన్ని, ఎడ్యుకేషన్ హబ్‌లో 80 లక్షలతో సోలార్ సిస్టమ్, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గజ్వేల్ అన్నింటా ఆదర్శంగా నిలిచిందన్నారు. త్వరలోనే అర్బన్ పార్కు, షాదీఖాన ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఐఓసీలో ఏర్పాటు, సమీకృత మార్కెట్, పాండవుల చెరువు సుందరీకరణ, గజ్వేల్ ఔటర్ రింగు రోడ్డు, రైలు.. ఇలా ఎన్నో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సిఎం కేసీఆర్, ప్రభుత్వానికి దీవెనలు ఇవ్వాలని కోరారు.