Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 9 ‌న కాళోజీ జయంతి ..

సగటు మానవుని లాగే ఊహించుకున్నాడు.సగటు మానవుని రాజకీయ చైతన్యాన్ని అభివ్యక్తం చేసాడు.అదే ఇతర రాజకీయ కవులకు అతడికి గల వ్యత్యాసం. అందుకే కాళోజీ ప్రజా కవిగా,ధిక్కార స్వరం గా,తెలంగాణ తోలిపొద్దుగా,తెలంగాణ వైతాళికుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.తన కార్యచరణను నెరవేర్చటానికి తన జీవితమంతా ప్రజా క్షేత్రం లో పయనించాడు.వారి స్ఫూర్తి ని కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి ప్రజా సంఘాల పై ఉందని,కాళోజీ అందించిన ఒక్క సిరా చుక్క ద్వారా తెలంగాణ సమాజాన్ని మరింత చైతన్యవంతం చేస్తూ వారి అడుగుజాడల్లో నడుచుకోవడం,వారి ఆలోచనలు ఆచరణలో పెట్టడమే కాళోజీ రాజీలేని జీవితాని కి సార్థకత..

కాళోజీ సగటు మానవుని ప్రతినిధి..
కాళోజీ ఒక ఫినామినల్‌ ,‌కాళోజీ వెల్‌ ‌రౌండప్‌ ‌పర్సనాలిటీ,కాళోజీ మన కాలపు వేమన,కాళోజీ చూడడానికి మూడక్షరాలే కాని అవి భూ పాతాళ ఆకాశ లోకాలు.కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు,తెలంగాణ సమాజం జీవితం.పోరుగల్లు ఓరుగల్లు కు వెళ్లితే అధ్యయనం చేయాల్సిన ప్రధాన అంశాలు రెండు ఒకటి కాళోజీ గురించి, రెండు వేయి స్తంభాల గుడి.ఓరుగల్లు ను కాళోజీ ని,వెయ్యి స్తంభాల గుడి ని వేరు చేసి చూడలేము.తెలంగాణ చరిత్ర లో కాళోజీ జీవితం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది.ఇరవయ్యవ శతాబ్దం నుండి ఇరవై ఒకటవ శతాబ్దపు ద్వారాలు తెరుచుకునేంతవరకు సాగిన ప్రయాణం కాళోజీ లో కనిపిస్తుంది.కాళోజీ అంటే కన్నీరు. తన జీవితాన్ని కన్నీటిని జీవనంగా మలిచాడు.ఒక మనిషి ఒక శక్తిగా ఎదిగి మూడు తరాలను ప్రభావితం చేయడం అన్నది మనల్ని విస్మయానికి గురిచేసే అంశం.తెలంగాణ మట్టి మనుషుల వ్యధార్థ కాళోజీ. ఈ మట్టిని ప్రేమించి ఈ మనుషుల గుండెలకు అతుక్కున్నవాడు.సహజంగానే కాళోజీ పోరాటజీవి కాబట్టి ప్రపంచం తిరుగుతూ ప్రపంచాన్ని ప్రపంచానికి చూపించాడు,ప్రశ్నించాడు.దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ,నిరంతరం స్పందిస్తూ హక్కుల కోసం నినదించారు.అన్యాయాన్ని ఆవహించుకొని రాజ్యమేలుతున్న ఎంతటివారినైనా నిగ్గదీసీ అడిగి కడిగిన వాడు కాళోజీ.ఆయనలా ఆన్యాయాన్నికి ఎవరు ఎదురీదినా వారిని ఆరాధించాడు.ఆయన రాసిన నా గొడవ ఒక రన్నింగ్‌ ‌కామెంటరీ,ఒక రాజకీయ ,ప్రజాకీయ ప్రకటనలు.చాలా భావుకత ఉన్న కవి. ప్రజల సంవేదనలు ప్రజలకు చేరడానికి కవిత్వాన్ని ఒక చైతన్య వాహికగా తీసుకున్నాడు.1931 లో భగతసింగ్‌ ఉరితీత,స్కూల్లో నాటకాలు ,వాక్‌ ‌స్వాతంత్య్రాల సమావేశ స్వాతంత్య్రాన్ని హరించిన గస్తీ నిషాన్‌ ‌తిరుపన్‌ ‌చట్టం కాళోజీ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని ,సాహిత్యాన్ని చివరిదాకా ప్రభావితం చేశాయి.

స్వేచ్ఛా పిపాసీ కాళోజీ..
కాళోజీ స్వేచ్ఛాయుతమైన ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సమాజం కేంద్రం గా మానవ మనసులో క్షణ,క్షణానికి ఆలోచన లు మారటం సహజమనుకునేవారు.ఆలోచనలను పట్టి ఉంచకుండా వాటి వెంట పడకుండా స్వేచ్ఛగా వదిలేయమనేవారు.కాళోజీ కి ఒక ప్రాంతమని లేదు.దేశమంతా పర్యటించారు. ఆధునిక కాల ధర్మాన్ని అనుసరించి వేలాది సమావేశాల్లో ఉపన్యసించాడు. స్వీయ కవితా గానం గావించారు. వాటిలో అవకతవకలు లేని సమాజం కోసం కలలు కన్నాడు.విశ్వమానవత సందేశం వినిపించాడు.మనుషుల మధ్య సంపూర్ణ సహకారం, మైత్రి గల సంఘాన్ని వాంఛించాడు.

కాళోజి కి ప్రజాస్వామ్యం మీద ప్రగాఢ నమ్మకం.
ప్రజాస్వామ్యం లో హింసకు తావు లేదు,హింస తప్పు,కాని ప్రతిహింస తప్పు కాదని పౌర హక్కుల మీద ఆయన స్వరం గడ్గదంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పై వారి కి ఎనలేని నమ్మకం.ఆయన మాటకు కవిత్వానికి తేడా ఉండదు.కాళోజీ కవిత లోతులేని వాగు,మిలమిలలాడే ఇసుక, జలజలపారే పల్చని నీరు లాగే ముచ్చట గొల్పుతాయి.రాజకీయ కవిత్వానికి, ప్రజాకీయ కవిత్వానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని చెబుతూ సామాన్యుడు రాయగల్గిందే ప్రజాకీయ కవిత్వం అని అనేవారు.ఏదైనా సాధించాలంటే ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారానే సాధ్యం అనే బలమైన విశ్వాసం కాళోజీ ది. హైదరాబాద్‌ ‌సంస్థాన నిజాం నిరంకుశ పరిపాలన లోని అకృత్యాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య కోణంలో ప్రజల్లో చైతన్య జ్వాలలు రగిలిస్తూ ఊరు, వాడా ఉద్యమ ప్రవా హమై సాగుతున్న సందర్భంలో నిజామ్‌ ‌కాళోజీ ని వరంగల్‌ ‌నగర బహిష్కరణ చేయడం జరిగింది.ఐనా ఎక్కడ వెనక డుగు వేయలే.మరింత కసితో నిజామ్‌ ‌నిరంకుశత్వాన్ని ధిక్కరిస్తూ తన కలానికి మరింత పదును పెట్టినవాడు కాళోజీ. ఈ సందర్భంలో జైలు జీవితాన్ని అనుభవించాడు.తదనంతరం సైతం ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదిగా తన పోరాటాన్ని,తన కవిత్వాల కొనసాగింపులో ముంధు కు సాగాడు.అడ్డంకులు ఎన్నెదురైనా ప్రజలదే,దర్మానిదే అంతిమ విజయమని కాళోజీ ఆకాంక్ష.

పాలకులను నిలదీసి కడిగినవారు కాళోజీ.
కుటిలమతులను ,దేబే ముఖాలను జాగ్రత్తగా గమనిస్తూ జాతి మూలలను మరచిన పాలకులను నిష్కర్షగా మందలించేవారు.కాళోజీ కి సమకాలీన కవులు ఎందరో ఉన్నారు.కాని కాళోజీ కవిత్వం వారందరికంటే బిన్నంగా ఉండేది.ప్రజలకు అర్ధమైన రీతిలో తన కవిత్వాన్ని, తన రచనలను ప్రాంతీయ స్పర్శతో స్పృశించినవారు కాళోజీ.తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిపట్టి వలస పాలకుల చెర నుండి నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలగాలని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని డిమాండ్‌ ‌చేసినారు.తెలంగాణ యాస,భాష లను ఎక్కిరించిన ఆంధ్రా కవులను చీల్చి చెండాడిన గొప్ప కవి కాళోజీ.ఎవని భాష వాడే రాయాలే..ఇట్లరాస్తే అవతోలుడు ఏమనుకుంటడో,అవతోలినికి అర్థమైతదా.! అని మనల మనం తక్కువ అంచనా వేసుకోవడమనే బానిస భావన పోవాలి అని అనేక వేదిక ల పై ఉద్ఘాటించినారు.బాష రెండు రకాలుగా ఉంటాయని అవి ఒకటి బడిపలుకల బాష రెండు పలుకుబడుల బాష .మనకు కావాల్సింది పలుకుబడుల బాష అని స్పష్టం గా చెపుతూనే అచ్చ తెలుగు భాష తెలంగాణ ప్రజలదేనని బాష పై మమకారాన్ని చాటుకున్నవారు కాళోజి.భాష, యాసలకే పరిమితం కాకుండా దేశ స్థితిగతులను అంచనా వేయడంలో కాళోజీ దిట్ట.కాళోజి తన కవిత్వాన్ని మాటలను తూటాలుగా,కత్తులుగా మార్చి దౌర్జన్యపు దగుల్బాజీల గుండెల్లో సూటిగానే దింపేవాడు.ఉద్యమాలకు అడ్డుపడ్డ రాజకీయ వేత్తలను పేరు పేరునా నిలదీశారు.మన యాస, మన భాష ,మన బతుకులను అన్యాయం చేస్తున్న ప్రాంతేతరులను తన్ని తరమాలని..ప్రాంతంవాడే ధ్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరపెట్టాలని ప్రజలను చైతన్యవంతం చేసాడు.

September 9th Kaloji Birthday

రాజ్యం నుంచి ప్రజలకు దక్కాల్సిన పౌర హక్కుల విషయంలో బలమైన వాణిని వినిపించారు.కాళోజీ కి రాజ్యం నుంచి పద్మవిభూషణ్‌ ‌లాంటి అనేక ఉన్నత సత్కారాలు అందినప్పటికి రాజ్యంతో ఏనాడు రాజీపడని ప్రజాకవి కాళోజీ.తన సాంఘిక జీవితంలో రాజీ తెలువని ధిక్కార స్వరం కాళోజీ.తెలంగాణ ప్రాంతంలోని కవులంధరి పైన కాళోజీ ప్రభావం ఉంధనేది వాస్తవం.ఉధ్యమ సమయంలో అనేకమంది కవులు కాళోజీ కవిత్వాలు చదివి ప్రజలను ఉత్తేజపరిచిన వారే.నేటి ముఖ్యమంత్రి కూడ కాళోజీ కవిత్వాలు స్పృశించినవారే.కాని నాడు కాళోజీ ఆన్యాయాన్ని ఎదిరిస్తే కీర్తించిన16417వారు నేడు ఆన్యాయాన్ని ఎదిరిస్తున్న కంఠాల పై కత్తులు దూస్తున్నారు.స్వరాష్ట్ర కల సిద్ధించిన తర్వాత కాళోజి ని అనుకరించేవారు ఒకరిద్దరు కవులు మరియు విప్లవ కవులు మినహా మిగతా కవులందరు స్వరాష్ట్రంలో పాలకుల ఆస్థాన భజన కవులు అయ్యారనే అపవాదం లేకపోలేదు.భజన కీర్తనలు తప్ప ప్రజా కీర్తనలకు పదును పెట్టేవారి సంఖ్య తక్కువైంది.స్వీయ పాలనలో కాళోజీ ఆదర్శాలను కొనసాగించే కవులు ఎక్కడ.? నిరంతరం ప్రజల కేంద్రం గా సాగిన కాళోజీ కవిత్వాన్ని నేడు పునర్‌:ఉద్ఘాటించేవారు ఏరి అనేది తెలంగాణ సమాజం ముందు వున్న ప్రశ్న.కాళోజీ ఆశయాలను కొనసాగించే వరవరరావు లాంటి ప్రజా కవులను జైళ్లలో నిర్భందించారు.తెలంగాణ లో కొంతమంది కవులకు పదవుల పట్ల ఉన్న వ్యామోహం ప్రజల పట్ల లేదనేది స్పష్టం.

స్వయం పాలనలో ఆన్యాయం,అధర్మం ఆవహించి రాజ్యమేలుతుంటే… నినదిస్తున్న ప్రశ్నల కొడవళ్ళ పై ఉక్కుపాదం మోపుతున్నారు,భయబ్రాంతులకు గురి చేస్తున్నారు,చిత్రహింసలు పెడుతున్నారు,జైళ్లలో బంధిస్తున్నారు.ఐనా ఏ కవి ప్రశ్నించడు ఈ విధానాలు కాళోజీ స్పూర్తి కి విరుద్ధం కాదా.! ఇంకా ప్రాంతేతరులే తెలంగాణ సంపద పై ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే,కాంట్రాక్టులు వాళ్ళే అనుభవిస్తున్నారంటే వలస పాలకులకు వ్యతిరేకంగా గొంతెత్తి అరిచిన కాళోజీ పోరాట స్ఫూర్తి కి విలువెక్కడ.? ‘‘ఆకలిమంటలు ఒక చోట..అన్నపురాసులు ఒకచోట’’ అనే కవిత్వం ద్వారా ఆర్థిక అసమానతలు కండ్లకు కట్టినట్లు బీద పేదల స్థితిగతులకు చూపించిన కాళోజీ కవిత్వాలకు తెలంగాణ లో పరిష్కారం ఎక్కడ..? ‘‘పుట్టుక నీది..చావు నీది బతుకంతా దేశాని ది’’ అన్న కాళోజీ మాటలను ఆచరణలో పెట్టి తెలంగాణ యువత బతుకు కు భరోసా కల్పించింది ఎక్కడ.? కాళోజీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పౌర సమాజ సంస్థల,ప్రజా సంఘాల,కవుల,రచయితల,కళాకారుల ఆలోచనలను, వారి విజ్ఞప్తుల ను పరిగణలోకి తీసుకొని పరిష్కరించింది ఎక్కడ.? ప్రజా కవి కాళోజీ ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసిన పోరాట కృషి ని స్వీయ పాలకులు ఎంత మేరకు అవలంభిస్తున్నారనేది తెలంగాణ ప్రజలముంధున్న ఒక సంధేహాత్మకమైన ప్రశ్న.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply