రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ కాలువ కారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు సత్యనారాయణకు సంబంధించిన కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును ప్రాథమికంగా కారు ప్రమాదంగానే పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చెల్లెలి కుటుంబం జనవరి27న కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళినట్లు గుర్తించారు. మంగళవారం కరీంనగర్ పోలీసులు విడుదల చేసిన రేణిగుంట టోల్‌ప్లాజా సిసిటివి పుటేజి ద్వారా నిర్ధారించారు. అయితే అంతకు ముందు రోజు జనవరి 26న ఉదయం సత్య నారాయణ కుటుంబం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళి, అదే రోజు రాత్రి కరీంనగర్ వచ్చినట్లు గుర్తించారు. మళ్ళీ జనవరి 27 ఉదయం సత్యనారాయణ కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరడం మిస్టరీగా మారింది. కారును సత్యనారాయణే స్వయంగా నడుపుతున్నట్లు సిసిటివి పుటేజి ద్వారా పోలీసులు గుర్తించారు. దీంతో కారు ప్రమాదంపై అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల రోజులుగా జరిగిన పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికల హడావుడిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరిక లేనంత ప్రచారంలో మునిగిపోవడం వల్ల చెల్లెలి కుటుంబంపై దృష్టి పెట్టలేక పోయినట్లు పలువురు భావిస్తున్నారు. కాగా, మొత్తం ఘటన ప్రమాదనశాత్తు జరిగిందా ? లేక కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గత నెల 28 నుంచి ఎమ్మెల్యే సోదరి కుటుంబం కనిపించకుండా పోగా, ఆమె ఫోన్ అంతకు రెండు రోజుల ముందు నుంచే స్విచ్ఛాఫ్ చేసి ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కరీంనగర్లో సీడ్స్, పెస్టిసైడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బావ సత్యనారాయణ రెడ్డి దుకాణంలో పని చేస్తున్న నర్సింగ్ అనే వ్యక్తి తన షాపు యజమాని కనిపించకపోవడంపై ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు మంగళవారం మీడియాకు వెల్లడించాడు.
దీంతో ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే సోదరి కుటుంబం గల్లంతు కావడానికి ముందు ఆమె భర్త ఏదో పని ఉందని హైదరాబాద్‌కు వెళ్లి వచ్చినట్లు ఆమె బంధువుల ద్వారా తెలిసినట్లు నర్సింగ్ మీడియాకు వెల్లడించారు. అసలు వాళ్లంతా ఎక్కడికి వెళ్లారనే విషయం తెలియక బంధువులు, స్నేహితులు ఎన్సిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ఛాఫ్ అనే వచ్చిందనీ, దీంతో సన్నిహిత బంధువులు, కొందరు స్నేహితులు వారి ఇంటికి వెళ్లి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా, అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో తిరిగి వెళ్లి పోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.