Take a fresh look at your lifestyle.

సాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీకి అసమ్మతి సెగ గులాబి గూటికి కడారి అంజయ్య

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌పై గెలిచి దుబ్బాక సీన్‌ ‌రిపీట్‌ ‌చేయాలని భావిస్తున్న బీజేపీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ ‌నేత కడారి అంజయ్య సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో గులాబి గూటికి చేరారు. సాగర్‌ ఉప ఎన్నికలలో బీజేపీ నుంచి కడారి కూడా టికెట్‌ ఆశించారు. తనకే టికెట్‌ ‌వస్తుందని భావించిన కడారికి పార్టీ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. చివరి నిమిషంలో రవినాయక్‌కు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కడారి అసంతృప్తితో ఉన్న విషయాన్ని గమనించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్ర కుమార్‌, ‌సైదిరెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో గులాబి తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన వీరంతా సీఎం కేసీఆర్‌ అక్కడ లేరనే విషయం తెసుకుని ఫామ్‌ ‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడే సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో కడారి టీఆర్‌ఎస్‌ ‌కండువా కప్పుకున్నారు. అయితే, సాగర్‌ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది.

టీఆర్‌ఎస్‌ ‌ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పార్టీలోని అసమ్మతి నేతలను చేరదీసి టికెట్‌ ఇద్దామని కమలం నేతలు భావించారు. అయితే, టీఆర్‌ఎస్‌ ‌దివంగత నోముల నర్సింహ్యయ్య కుమారుడు భగత్‌కు చివరి నిమిషంలో బి ఫాం ఇచ్చింది. ఆ పార్టీలో టికెట్‌ ఆశించిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సీఎం కేసీఆర్‌ ‌వారికి భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తానని హామీ ఇచ్చి శాంతింపజేశారు. చివరికి బీజేపీ నుంచే టికెట్‌ ఆశించిన కడారి పార్టీని వీడి గులాబి కండువా కప్పుకోవడంతో ఆ పార్టీ నేతలు పార్టీ అభ్యర్థి రవికుమార్‌ను గెలిపించేందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నది.

Leave a Reply