Take a fresh look at your lifestyle.

కారుచీకటిలో వెలుగురేఖ..

కవిత్వం రాసి మెప్పించడమే కవికి అసలైన యుద్ధం. అనుభవాలను అక్షరబద్ధం చేయడమంటే జ్ఞాపకాలతో నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి తలపడడమే. పదికాలాలూ నిలుస్తూ పనికొచ్చేంత లోతుగా కాళనాళికలోకి ప్రవహించి ప్రజ్వరిల్లే కవిత్వపు ప్రామాణికత వెలకట్టలేనిది. కవి తనలో తానే ఉద్యమ బీజాన్ని విత్తుకుని ఆత్మగౌరవంతో సాగుచేసేకునే సృజనక్షేత్ర కల్పద్రుమం కవిత్వం. దారిచూపే జ్ఞానదిశగా కవిత్వాన్ని మలిచే కృషికి నిదర్శనంగా తండ హరీశ్‌గౌడ్‌ ఇన్‌బాక్స్ ‌కవిత్వం నిలిచింది. అనుభూతులను అక్షరాల్లోకి ఒంపితే తగిలే సెగలాంటిది హరీశ్‌గౌడ్‌ ‌కవిత్వం. సాంకేతిక నుడికారంతో కలగలసిన తన కవిత్వభాషకు సహజత్వాన్ని అద్దగలిగిన హరీశ్‌గౌడ్‌ ‌సమర్థతకు నిదర్శనంగా కవితలిందులో ఎన్నో ఉన్నాయి. యాంత్రికత అంటిన జీవితానికి స్వాభావికతను అద్దుతూ మట్టి పరిమళాన్ని నిండారా వెదజల్లుతూనే నిర్మోహమాటంగా అమానవీయతను ఖండిస్తూ వాస్తవికతను కవిత్వంగా కుండబద్ధలు కొట్టిన ఈ కవి కవితావాక్యాలు మనసుకి గుర్తుండి పోతాయి. సామాజికత, వైయక్తికత కవితల్లో చోటు చేసుకున్నాయి. సామాజిక సంఘటనలు వలస జీవుల బాధలు, రాజకీయ, కరోనా నేపథ్యాలు, గుండెలో నిలిచిపోయిన జ్ఞాపకాలు వంటివెన్నెన్నో ఇన్‌బాక్స్ ‌కవితల్లో అంతర్భాగాలుగా కన్పిస్తాయి. గాయపడిన హృదయాలకు కవిత్వమే బాధను దూరం చేసే మందు అని కవి భావించారు. ఆమె చేతులతో / పిండిని ముద్దలు చేసి/ చందమామలను చుట్టింది అని ఆకాశంలో అమృతాన్ని కలిపిన అమ్మతత్వాన్ని చిరుతిళ్ల సాయంత్రంలో చెప్పారు. నదులను బతిమాలి/ నేలలోకి నీళ్లను మళ్లిస్తాడు/ చీకటినంతా ఇంటికి మోసుకెళ్లి/ వెలుగులను పలహారంగా పంచేవాడి ఖాళీ చేతుల పాఠం తనకు ఎప్పటికీ గుర్తేనని చెబుతారు. రాత్రి మిగిల్చిన భీకరాన్ని తలచుకుంటూ ప్రయాణిస్తూనే సెలవంటూ తెలవనోళ్లు జీవితానికే సెలవు ప్రకటించారు అని మరణపు రాత్రి కథలో వేదన పడ్డారు. రాత్రి చుట్టూ మనుషులు కాదు/ మనుషులు చుట్టే రాత్రి తిరుగుతుందన్న ప్రతిపాదికను చేశారు. సాయంత్రానికి రంగులేసి దాని సిగలో ఇంధ్ర ధనస్సును పురమాలన్న ఆకాంక్షను నల్లని సాయంత్రం కవితలో వ్యక్తపరిచారు. సీతాకోకలు వాడి నవ్వుల్లోంచి ఎగిరినట్టుగా కన్పించిందంటే పొద్దుటి కిరణాలను అప్పు తెచ్చుకున్నాడేమోనన్న అద్భుత భావనను ప్రయోగించారు. చిన్నోడి నవ్వును సీతకోక చిలుకతో పోల్చారు. అమ్మచేతి రోటి పచ్చడి రుచిని గుర్తు చేసుకున్నారు.

వలస పాదాలు నడిచి నడిచి నెర్రెలతో నెత్తూరోడితే స్పందించి సముద్రమంతా గాయమయిన చోట/ పిల్లవాగంత పసరైనా పూయండి అంటారు. పాదం చల్లగా ఉంటేనే నడక అడుగులేస్తుందంటారు. వాడిపోని పువ్వునై రోజంతా వాసనొస్తాను అనడంలో ధీరత ప్రకటితమైంది. భవిష్యత్తుకు బాట వేసే తాతయ్య కట్టెచప్పుడును గుర్తు చేసుకున్నారు. రెండు కన్నీటి చుక్కలతో దీపాన్ని వెలిగించి ఆరోగ్యాన్ని పిండుకునేందుకు నడక ఒక గొప్ప సాధనం అని చెప్పారు. ఇంటింటిని పొద్దునే తట్టిలేపే అలారం మోతకు ప్రతీకగా కోడి పూంజును చూపారు. గాలి శబ్దాన్ని చెట్ల పెదాలపై వాలే సీతాకోక చిలుకగా చూపారు. పైరుగాలి పియానోకి చెమట చేతుల దరువు/ ఊడలుగా పాకుతున్న కన్నీరును ఏ సమాధులలో దాచిపెడతావని ప్రశ్నిస్తారు. నీవు గెలిస్తే నేను గెలిచినట్లే అని అన్నారు.

మాధ్యమపు చెట్టు కొమ్మలు రెమ్మలురెమ్మలుగా మారి విరామమెరుగని విస్తరణ అయిందని ఆన్‌లైన్‌ ‌కవితలో అంటారు. దేహం ఎవరిదైనా నొప్పి మాత్రం ఒకటేలా ఉంటుందని చెబుతూ దేహమే ప్రశ్నగా మారితే మనుషులే సమాధానం చెప్పాలని అన్నారు. ఒక రత్నాన్నైనా దోసిట పట్టి/ నీ చేతులతో కవిత్వాన్ని చేసి వెలిగించాలని కవిత్వ జాడ కోసం వెతికారు. తెలియని ప్రయాణంలో నిజాలు బయటకు వస్తాయంటారు. ప్రకృతిని పెకిలించడమంటే పాతాళానికి దారి కనిపెట్టడం అని హెచ్చరించారు. గుండె తెగిన గొంతుకను చూసి అది ఊతం ఇచ్చిన శ్రామిక చేతులను గుర్తు చేసుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ సగం జీవితాన్ని ఎలాగో ఖాళీ చేసావు/ మిగిలిన సగాన్నైనా భర్తీచేయి అంటూ నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. నిన్ను నువ్వు నిర్దారించుకోవాలంటే నీలోంచి నలుగురి లోకో/ నలుగురి లోంచి నీలోకో తెలుసుకొమ్మంటారు. గాయాలను లెక్కపెట్టుకున్న రాత్రులను/ రాత్రులను లెక్కపెట్టుకున్న గాయాలను లెక్కించారు. ఎన్నికల పోటీ ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు వీధి చివర నిలబడి కునుకుతీసిన నిశ్శబ్దాన్ని చూశారు. గడిచిన రాత్రిని అతికించుకోవడమంటే అసలు ఇష్టం లేదని చెప్పారు. కెమెరా అనే ఇంద్ర ధనస్సుకు ముఖాన్ని అప్పగించి ఫోటో కోసం ఆశగా ఎదురు చూశారు. సూర్యుడు రావాలంటే జాబిల్లి వెళ్లిపోక తప్పదని, నిన్నంటే మరణం/ రేపంటే జీవితమని తాత్వికంగా విశ్లేషించారు. ఇంటి గుమ్మానికి జ్ఞాపకాన్ని పచ్చతోరణమై వేలాడమన్నారు. ఊపిరికి రంగులు అద్దుకొమ్మని ఊహాతీత కాంతను ఆహ్వానించారు. నువ్వు నేను మారి అనేక నేనులను కావాలన్నారు. లేత పూరేకు వంటి పిల్లల రెక్కలను విచ్చుకోనివ్వమన్నారు. ఊరిలోని నలుగురి పలకరింపుల తడి తాకి ప్రాణం లేచివచ్చిందని చెప్పారు. మట్టిని పిండుకొని అన్నం ముద్దలు తినేవాళ్లం అని స్పష్టం చేశారు. ఇవాళ నీ కళ్ళముందు సానుభూతి కోసం కొత్తగా చచ్చిపోయినం అంటే అని ఏమీ తెలియనోళ్ల గురించి చెప్పారు.

అక్షరమే జీవితమని బ్రతికిన వాళ్లు మహాసముద్రాలతో సమానమన్నారు. నేటి పరిస్థితి శవంతో మాట్లాడుతున్నట్టుగా ఉందని చెప్పారు. ఒంటికి పూసుకున్న బురద దురదను దులుపుకొమ్మని జాత్యహంకారాన్ని హెచ్చరించారు. తాతల, తండ్రుల చేతులకు, కాళ్లకు కాచిన కాయలు పూసునప్పుడు తాటి వనం యాదికొచ్చిందంటారు. కట్ట కింద బావిని కష్టాలమయమైన జీవితంతో పోల్చి చూపారు. గుండె అలమారాలో దాగిన చూపుల నిర్వేదం బొట్లు బొట్లుగా రాలిపడి గుండెతడి విలువేంటో చెప్పిందన్నారు. కుండపోతగా కురిసిన వానను కన్నీటి బహుమతిగా ఇస్తానన్నారు. పొద్దుటి కిరణాలతో ప్రేమమయ ప్రపంచాన్ని వెలిగించాలన్నారు. నీకు నాకు ఊపిరే వంతెన అంటూ ఉండే కలుక్కుమన్న క్షణాలను కవిత్వీకరించారు. లాక్‌డౌన్‌ ‌పోయెట్రీలో ఒక్కొక్కరిగా విడిపోయి బ్రతుకుతున్న జీవితాలను పైకి ఎగబాకే దేవదారు వృక్షాలతో పోల్చిచూపారు. ఒకప్పుడు నేను నువ్వు ప్రపంచం/ ఇప్పుడు నేను నేను ప్రపంచం అన్న నగ్న సత్యం కరోనా విలయంతో తెలిసిపోయిందన్నారు. వానపాముతో ముచ్చట్లు పెట్టు/ భూమండలాన్నంతా ఇంట్లోనే చుట్టేయి/ మంట ఆరిపోకుండా/ పుల్లల కోసం గాలిస్తూ ఉండు అన్న ఆలోచనాత్మకమైన వాక్యాలు తారసపడతాయి. వెచ్చదనం లేని దేహాల్లోంచి గాజుపెంకులాంటి రోజులోకి వచ్చామని వేదన చెందారు. మాటలను త్రాగించి మనుషులుగా మార్చమన్నారు. మనిషిని తీరం చేర్చే పచ్చని పాట రక్తగతం కావాలని ఆకాంక్షించారు. చివరి చూపునైనా తన కుటుంబానికి బహుమతిగా ఇవ్వమన్నారు. ఒకరిలోనుంచి ఒకరిని తీసివేసినట్టుగా,  మళ్లీ ఎక్కడ కలపబడుతామో అర్థం కానట్టుగా మారిన అగమ్యగోచర వ్యవస్థకి డోంట్‌ ‌టచ్‌ ‌కవిత అద్దం పట్టింది. తెళ్లని పగలుకు నల్లని రంగు వేసి చీకటి గుండెలను హత్తుకున్న దయనీయతను ఈరోజు ఏమైందో అన్న కవితలో  విశ్లేషించి చూపారు. ఎవ్వరికీ చెప్పకుండానే నిర్ధాక్షిణ్యంగా, అంతా నిశ్శబ్దంగా ఓడిపోతానని అంటూ తనలోని ప్రతీకలు తననే వెలివేసిన వేదనను చెప్పారు. ఇష్టంలేని దూరాలకు మనస్సును బలవంతంగా వెళ్లగొట్టి బ్రతుకును ఖాళీ చేసిన కరోనా కరోనా కర్కశంలో దగ్గరనేది కేవలం మనుష్యుల నటననే అంటారు. ఎడబాట్లు, కట్టుబాట్ల మధ్య చేతి స్పర్శల పువ్వులు వాడిపోయి, కబుర్లు కవర్లలో కట్టిపెట్టినంత మాత్రాన దగ్గరితనం శాశ్వతంగా దూరమవుతుందా అని ప్రశ్నించారు. రాసులు పోసిన అనుభవాలతో చెక్కిన ఉప్పెనలా ఈ కవిత్వం కన్నీటిని, చెమట పన్నీటి పరిమళాన్ని వెదజల్లింది.

(తెలంగాణ సారస్వత పరిషత్తు – 2022 ఉత్తమ కవితా సంపుటి పురస్కారాన్ని ఇన్‌బాక్స్ ‌పొందిన సందర్భంగా ఈ వ్యాసం)

– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply