Take a fresh look at your lifestyle.

బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జెపి నడ్డా
  • దేశం నరేంద్రమోడీ చేతుల్లో సేఫ్‌గా ఉందన్న సింధియా

ఇప్పటికే కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్‌ ‌రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ ‌జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురుకు కేంద్రమంత్రులతో సహా, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేదాల కారణంగా మంగళవారం కాంగ్రెస్‌ ‌పార్టీకి గుడ్‌బై చెప్పిన జ్యోతిరాదిత్య ఊహించినట్లుగానే బిజెపిలో చేరారు. పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించడంలేదని భావించిన సింధియా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంమంత్రి అమిత్‌ ‌షా భేటీ అనంతరం హస్తం పార్టీకి రాజీనామా సమర్పించారు. ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక ఊహించి నట్టుగానే ఆయన కాషాయదళంలో చేరారు. అయితే బీజేపీ నుంచి సింధియాను రాజ్యసభకు పంపుతారని, మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రి పదవి కూడా కట్టబెడతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ రాజమాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంతగూటికి రావడం సంతోషంగా ఉందని జేపీ నడ్డా అన్నారు. తమకు సంబంధించినంత వరకు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజమాత సింధియా అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అని అన్నారు. ఆమె కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య పార్టీకి రావడం ఆనందంగా ఉందన్నారు.

బీజేపీలోకి తనను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, •ం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జ్యోతిరాదిత్య సింధియా కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితాన్ని రెండు ఘటనలు మలుపు తిప్పాయని, తండ్రి మరణం జీవితాన్ని మలుపు తిప్పిందని, ఆయన 75వ జయంతి మరోసారి తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, యువతను కాంగ్రెస్‌ ‌పార్టీ విస్మరించిందని అన్నారు. ఆ పార్టీలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. దీంతో దేశానికి యువత సేవలు అందించలేక పోతోందన్నారు. కమల్‌నాథ్‌ ‌ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హాలు నెరవేర్చడంలో మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం విఫలమైంది.

ప్రజలకు సేవ చేసే అదృష్టం బీజేపీ కల్పించింది. మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందన్నారు. మధ్యప్రదేశ్‌లో అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియా అధికమైంది. ప్రజలకు సేవ చేయడానికి ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా తనకు అవకాశం ఇచ్చారు. అమిత్‌ ‌షా, జేపీ నడ్డా మార్గదర్శనంలో పని చేస్తాను. ప్రజల సేవకు బీజేపీ కార్యకర్తలతో కలిసి పని చేస్తాను’ అని సింధియా చెప్పారు.

2019లో ఎవరూ ఊహించని అద్భుతమైన తీర్పు ప్రజలు బీజేపికి ఇచ్చారని అన్నారు. ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని సింధియా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారత కీర్తిపతాకను మోడీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. దేశానికి సేవచేసే అవకావం కోసం తాను బిజెపిలో చేరానని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా బూజుపట్టిన విధానాలు వదులుకోలేదన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లో ప్రజలకిచ్చిన వాగ్దానాలనునెరవేర్చ లేకపోయిందన్నారు.

Leave a Reply