- టీచర్ల పట్ల ప్రభుత్వం దమననీతిని వీడాలి
- జివో రద్దుకు బిజెపి ఉద్యమిస్తుంది
- రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
- జివో రద్దును కోరుతూ ప్రగతిభవన్ ముట్టడికి బిజెవైఎం యత్నం
- కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
- టీచర్లను బలిపశువులు చేస్తున్నారు : ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి మైనార్టీ మోర్చా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ప్రభుత్వం జీవో నంబర్ 317ను వెంటనే సవరించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ జీవో కారణంగా టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ జీవో ఎందరో టీచర్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందన్న ఆయన… 34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. టీచర్ల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని పరష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వొచ్చిందన్నారు. జీవో 317తో ఉపాధ్యాయుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో ఐఏఎస్ అధికారికే రక్షణ లేకుంటే..సామాన్యుల పరిస్థితేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు 42రోజుల పాటు సకలజనుల సమ్మె చేయకుంటే తాను సీఎం అయ్యేవాడిని కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సకలజనుల సమ్మెతో తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించాలరని అన్నారు. కానీ ఇప్పుడు వారు పరాయి పాలనలో బతుకుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి బయటకు గుంజుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. టీచర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కూడా సీఎం కేసీఆర్ బాధితులమేనని గుర్తుంచుకోవాలన్నారు.
సాటి ఉద్యోగుల పట్ల పోలీసుల తీరు బాధాకరమని.. జీవో 317పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. బదిలీలు, ప్రమోషన్ల పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా షురూ చేసిందని బండి సంజయ్ విమర్శించారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, టాన్స్ ఫర్ల కోసం బీఆర్ఎస్ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పైసలివ్వలేదని 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు ఆపారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తారీఖున ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని బండి నిలదీశారు. టీచర్లకు నాలుగు డీఏలు బకాయి ఉన్నారని, ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవడం ఖాయమని అన్నారు.
జివో రద్దు కోరుతూ ప్రగతిభవన్ ముట్టడికి బిజెవైఎం యత్నం
ఇదిలా వుంటే స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. అనంతరం గోషా మహల్‌కు తరలించారు. బీజేపీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రగతి భవన్‌కు కిలోవి•టర్ దూరం వరకు పోలీసులను మోహరించారు. 13 జిల్లాల్లో స్పౌజ్ టీచర్ల బదిలీలను బ్లాక్ చేయడంపై టీచర్లు ఆందోళనకు దిగారు.
టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు ముందే తమను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పని చేయడం వల్ల తమతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని అంటున్నారు. అయితే మూడునాలుగు రోజులుగా టీచర్లు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీజేపీ మండిపడుతుంది. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.
టీచర్లను బలిపశువులు చేస్తున్నారు : ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి మైనార్టీ మోర్చా
ఉపాధ్యాయులను బాధపెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా అన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా, టీచర్లకు మద్దతుగా లక్డికాపుల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు ముట్టడించారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వారు అక్కడే ఆందోళనను కొనసాగిస్తున్నారు. స్పౌజ్ బదిలీలు చేయకుండా భార్యభర్తలను వేరు చేసి ప్రభుత్వం వారికి మానసిక వేదనను మిగిలిస్తోందని మైనార్టీ మోర్చా నాయకులు విమర్శించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటి వరకు 30 మంది ఉపాధ్యాయులు అత్మహత్యాలు చేసుకున్నారన్న ఆయన..కేసీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.