అత్యాచారం, హత్యలకు గురైన మునగాల హారతి, గాదం మానస, సిరిగిరి వెన్నెల, ఐత అనుష్కరాణి కుటుంబాలకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు బాధిత కుటుంబాలతో కలిసి సోమవారం హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరానికి జిల్లా కార్యదర్వి అరూరి కుమార్ అధ్యక్షత వహించగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో వరుస అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అత్యాచార సంఘటన జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు కేవలం ఫోటోలకు ఫోజు ఇచ్చారని, నయా పైసా న్యాయం చేయలేదన్నారు. ఎన్కౌంటర్లు అత్యాచార్యాలు, హత్యలను నిర్మూలించలేవని చెప్పారు. దిశ హత్య ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మునిగాల హారతి హత్య జరిగిందని గుర్తు చేశారు. మద్యంషాపులు బజారుకొక్కటి ప్రారంభిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు మాత్రం మూసివేస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
25లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌బెడ్ రూం ఇల్లు, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని చెప్పారు. ఈ దీక్షా శిబిరంలో హారతి తల్లి రేణుక, సోదరి ప్రసన్నరేఖ, గాదం మానస తల్లిదండ్రులు స్వరూప, మల్లయ్య, సిరిగి వెన్నెల నానమ్మ సిరిగిరి లక్ష్మి, ఐత అనుష్కరాణి తల్లిదండ్రులు అనిత, రాజేష్‌లు దీక్షలో కూర్చున్నారు. కాగా వ్యకాసం నుంచి జి.రాములు, డిబిఎఫ్ నుంచి రౌతు రమేష్‌లు సంఘీభావం తెలిపారు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు గబ్బెట రాంకుమార్, జిల్లా నాయకులు శంకర్, జోసెఫ్, సుదర్శన్, రాఘవులు, శంకర్, బొట్ల రవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags: Justice,families, rape victims ,KVPS Zilla Presidents Gabbetta Rankumar, Zilla Chiefs Shankar, Joseph, Sudarshan