Take a fresh look at your lifestyle.

సుప్రీమ్‌ ‌కోర్టు 48వ చీఫ్‌ ‌జస్టిస్‌గా జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రమాణం

  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌‌కోవింద్‌
  • ‌హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ
  • రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
  • అత్యున్నత న్యాయపీఠంపై రెండవ తెలుగు వ్యక్తి

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సీజేఐ ఎస్‌ఎ ‌బొబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ ‌రమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ ‌రమణ నిలిచారు. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్‌ ‌రమణ సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా సేవలు అందించారు.

కొవిడ్‌ ‌దృష్ట్యా కొద్దిమంది అతిథుల సమక్షంలోనే జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్‌ ‌సెక్రటేరియట్‌ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌తో పాటు అతిథులందరూ జస్టిస్‌ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన నూతలపాటి గణపతిరావు, సరోజిని దంపతులకు 1957, ఆగస్టు 27న ఎన్వీ రమణ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కంచికర్ల ఉన్నత పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అమరావతి ఆర్‌వీవీఎన్‌ ‌కాలేజీలో బీఎస్సీ చదివారు. 1982లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.

 

1983, ఫిబ్రవరి 10న ఎన్వీ రమణ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సీఏటీ, ఏపీ హైకోర్టు, సుప్రీమ్‌ ‌కోర్టులో ఆయన ప్రాక్టీస్‌ ‌చేశారు. ఏపీ అదనపు అడ్వకేట్‌ ‌జనరల్‌గా సేవలందించారు. ఆంధప్రదేశ్‌ ‌జ్యుడిషీయల్‌ అకాడవి• అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000, జూన్‌ 27‌న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా సేవలందించారు. 2013, మార్చిలో ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ ‌చీఫ్‌ ‌జస్టిస్‌గా పని చేశారు. 2013, సెప్టెంబర్‌ 2‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 2014, ఫిబ్రవరి 17న సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.

 

సీజేఐగా నియమితులైన వారిలో రెండో తెలు వ్యక్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. 1966లో తొలిసారి సీజేఐగా జస్టిస్‌ ‌కోకా సుబ్బారావు నియమితులయ్యారు.

Leave a Reply