- సిజెఐకి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
- బాలాలయంలో ప్రత్యేక పూజలు
సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్ఠిస్ ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం వారు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ గీత సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. అంతకుముందు వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను వారు వీక్షించారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించారు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటి సారిగా ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.