Take a fresh look at your lifestyle.

సుప్రీమ్‌ ‌కోర్ట్ ‌ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ…?

ప్రస్తుత సీజే బోబ్డె కేంద్రంకు లేఖ
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ, మార్చి 24: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీమ్‌ ‌కోర్టు 48వ సీజేగా జస్టిస్‌ ‌రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ‌బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు పదవీ విరమణ చేయబోతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ‌బోబ్డే లేఖ రాశారు. జస్టిస్‌ ‌బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ..హోమ్‌ ‌శాఖకు పంపనుంది. హోమ్‌ ‌శాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది.

రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక పక్రియ పూర్తవుతుంది. జస్టిస్‌ ‌బోబ్డే ఏప్రిల్‌ 23‌న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24‌న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26వరకు జస్టిస్‌ ఎన్వీ రమణ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి పదవిలో కొనసాగుతారు. సుప్రీమ్‌ ‌కోర్టులో జస్టిస్‌ ‌బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.

1957 ఆగస్టు 27న ఆంధప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ ‌జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీమ్‌ ‌కోర్టుకు పదోన్నతి పొందారు. జస్టిస్‌ ఎన్వీ రమణను అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి పదవికి నియమించటంపై ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్య మంత్రి జగన్‌ అభ్యంతరాలు తెలియజేస్తూ గతంలో కేంద్రానికి లేక రాసిన విషయం విదితమే.

Leave a Reply