- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- 24న ప్రమాణం.. 2022 ఆగస్ట్ 26 వరకు పదవిలో..
సుప్రీమ్ కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీమ్ సిజెగా జస్టిస్ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 48వ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగష్టు 26, 2022 వరకు పదవిలో కొనసాగనున్నారు. సుప్రీమ్ కోర్టు తదుపరి సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు.
ఈ ప్రతిపాదనలను న్యాయశాఖ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ. అంతకుముందు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన ఎన్వీ రమణ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఎన్వీ రమణ 1957 ఆగష్టు 27వ తేదీన ఆంధప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. జూన్ 27, 2000లో ఆంధప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఆంధప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. జస్టిస్ ఎన్వీ రమణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
ఎన్. గణపతిరావు, సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. జస్టిస్ రమణ కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి, అమరావతిలోని ఆర్‌వివిఎన్ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తి ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ రమణ దిట్ట. రాజ్యాంగపరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీమ్ కోర్టులతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు. రైల్వేతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్‌గా విధులు నిర్వహిస్తూ 2000 జూన్ 27న ఆంధప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.