Take a fresh look at your lifestyle.

జస్టిస్‌ భార్గవ కమిషన్‌

“ఆగస్ట్‌ 9, 1977న జస్టిస్‌ భార్గవకు సమర్పించిన మెమొరాండం ఆన్‌ ప్రొసీజరల్‌ మాటర్స్‌ ఆరు ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావించింది. ఏ అత్యాచారాల ఆరోపణల గురించి కమిషన్‌ విచారణ జరుపుతున్నదో, ఆ అత్యాచారాలు జరిపిందనే ఆరోపణ ఉన్న ప్రభుత్వం ఇంకా పాలన చలాయిస్తుండడం వల్ల కమిషన్‌ విచారణకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నదని మేం ఆ మెమొరాండంలో రాశాం. నిజానికి ఐదారు నెలలు తిరగకుండానే మా సందేహాలు రుజువయిపోయాయి.”

పై మెమొరాండంలతో పాటు ఆ రోజుల్లోనే అంటే ఆగస్ట్‌ 5-9 ప్రాంతాలలోనే మేం సమర్పించిన మరొక రెండు మెమొరాండంల గురించి కూడ చెప్పాలి. కమిషన్‌ విధివిధానాలకు సంబంధించిన మెమొరాండం ఒకటి, కమిషన్‌ ప్రకటించిన విచారణాంశాల వరుస క్రమాన్ని మార్చాలని కోరే మెమొరాండం ఒకటి కూడ మేం దాఖలు చేశాం.ముప్పై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ రెండు మెమొరాండంలను చదువుతుంటే వాటి చారిత్రక ప్రాధాన్యత తెలిసి వస్తోంది. ఆగస్ట్‌ 9, 1977న జస్టిస్‌ భార్గవకు సమర్పించిన మెమొరాండం ఆన్‌ ప్రొసీజరల్‌ మాటర్స్‌ ఆరు ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావించింది. ఏ అత్యాచారాల ఆరోపణల గురించి కమిషన్‌ విచారణ జరుపుతున్నదో, ఆ అత్యాచారాలు జరిపిందనే ఆరోపణ ఉన్న ప్రభుత్వం ఇంకా పాలన చలాయిస్తుండడం వల్ల కమిషన్‌ విచారణకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నదని మేం ఆ మెమొరాండంలో రాశాం. నిజానికి ఐదారు నెలలు తిరగకుండానే మా సందేహాలు రుజువయిపోయాయి.

ఆ అవరోధాలు కమిషన్‌ పని అడ్డుపడకుండా ఉండాలంటే ఆరు రంగాల మీద దృష్టి పెట్టాలని మేం సూచించాం. అవి:
1. విశ్వసనీయత. 2. విచారణాంశాలలో ప్రాధాన్యతలు నిర్ణయించడం. 3.హత్యలు, చిత్రహింసల ఘటనల విచారణాక్రమం . 4. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు యథాతథంగా కొనసాగడం. 5. మధ్యంతర నివేదికల ప్రచురణ ఆవశ్యకత. 6. అవసరమైన అధికారిక పత్రాల సేకరణ.
అప్పటికే కమిషన్‌ బహిరంగ ప్రకటన ద్వారా సాక్షుల వాంగ్మూలాలను ఆహ్వానించింది. కాని ఆ సాక్షులకూ, వాంగ్మూలాలకూ ఎటువంటి రక్షణ కల్పించాలో నిర్ధారించుకోలేదు. అందువల్ల సాక్షుల పేర్లు గాని, వాంగ్మూలాలలో ఉన్న విషయాలు గాని రాష్ట్ర ప్రభుత్వానికి, దాని అధికారులకు తెలిసిపోతే సాక్షులను బెదిరించవచ్చు. సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు. వాంగ్మూలాలను మార్చడానికి, సంబంధిత వాస్తవ రికార్డులను ధ్వంసం చేయడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల సాక్షులు చెప్పే విషయాలకు రక్షణ కల్పిస్తామని, రహస్యంగా ఉంచుతామని కమిషన్‌ హామీ ఇవ్వాలని మేం వాదించాం.

ఈ వాదనకు మద్దతుగా మేం భిక్షపతి అనే కీలక సాక్షి ఉదంతాన్ని ఉటంకించాం. భిక్షపతి సాక్ష్యం చాల కీలకమైనది, అరుదైనది. ఆయన సాక్ష్యాన్ని 1977 జులై 30న మేం రికార్డు చేశాం. తెలుగులో ఆయన సాక్ష్యం చెపుతుండగా తార్కుండే కమిటీ సభ్యులయిన అరుణ్‌ శౌరి, కాళోజీ నారాయణరావు విని, రికార్డు చేసుకున్నారు. ఈ రికార్డు చేసుకున్న సందర్భంలో హనుమకొండకు చెందిన ఇద్దరు న్యాయవాదులు పి.విఠల్‌ రావు, ఎస్‌. శంకరయ్య, విప్లవ కవి, కళాశాల అధ్యాపకుడు పి.వరవరరావు కూడ సాక్షి సంతకాలు చేశారు.
ఈ భిక్షపతి సాక్ష్యంలో రెండు భాగాలున్నాయి. అవి రెండూ వివరంగా పరిశీలించాలి. మొట్టమొదటిది, హనుమకొండకూ కాజీపేటకూ మధ్యన ఉన్న వడ్డెపల్లి గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యెదులాపురం భిక్షపతి గిరాయిపల్లి హత్యలకు ప్రత్యక్షసాక్షి. గిరాయిపల్లి అడవులలో జనార్దన్‌, మురళీమోహన్‌, ఆనందరావు, సుధాకర్‌లను తన కళ్ళముందే చెట్లకు కట్టి కాల్చి చంపారని భిక్షపతి చెప్పాడు. తార్కుండే కమిటీ ప్రాథమిక విచారణలో ఆయన ఈ మేరకు వాంగ్మూలం నమోదు చేయించాడు.

అంత ముఖ్యమైన వాంగ్మూలం చెప్పినందువల్ల ఆయన ప్రాణాలకు భద్రత లేదని భావించి, తార్కుండే కమిటీ ఆయనకు హైదరాబాదులో ఆశ్రయం కల్పించింది. కాని రోజువారీ కూలీగా పనిచేసే భిక్షపతి, హైదరాబాదులో ఉండలేక, తిరిగి వడ్డెపల్లికి వెళ్ళిపోయాడు. అప్పుడు వరంగల్‌లో జనతా పార్టీ నాయకుడిగా ఉండిన పి.శంకరయ్య సహాయంతో ఆయన జిల్లా కలెక్టర్‌ను కలుసుకున్నాడు. ఆయన అంతకు ముందు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారి షమీమ్‌ వల్ల తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించమని కలెక్టర్‌ను వేడుకున్నాడు. కలెక్టర్‌ జిల్లా ఎస్‌పితో మాట్లాడి భిక్షపతికి రక్షణ ఏర్పాట్లు కల్పించాడు. భిక్షపతి సురక్షితంగా ఉన్నాడో లేడో నిర్ధారించు కునేందుకు ప్రతిరోజు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి రెవెన్యూ అసిస్టెంట్‌ దగ్గర సంతకం చేయాలని చెప్పాడు. ఈ ఏర్పాటు 1977 మే 6న మొదలయింది. ఆ తర్వాత వారం రోజులకే ఇద్దరు పోలీసు అధికారులు భిక్షపతి ఇంటికి వెళ్ళి, ఆయన తార్కుండే కమిటీ ముందర సాక్ష్యం చెప్పినందుకు, జనార్దన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును తవ్వి తీయడానికి సహకరిస్తున్నందుకు మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించారు.

అప్పటి నుంచి జులై 26 దాకా ఇటువంటి వేధింపులు సాగుతూనే ఉన్నాయి. చివరికి జులై 26న – అంటే భార్గవ కమిషన్‌ ప్రకటన వెలువడిన తర్వాత – పోలీసు అధికారులు భిక్షపతి ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పకుండా ఉంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని , ఉద్యోగం ఇప్పిస్తామని ఆకర్షణలు చూపారు. సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు.ఈ విషయాలన్నిటినీ భిక్షపతి జులై 30న మరో వాంగ్మూలంలో ప్రకటించాడు. ఇది రెండో వాంగ్మూలం. మేం జస్టిస్‌ భార్గవకు ఈ రెండో వాంగ్మూలం అందజేశాం. ఈ కారణం వల్ల సాక్షుల రక్షణ బాధ్యతను తీసుకోవాలని, తాము చెప్పే సాక్ష్యం రహస్యంగా ఉంటుందనే నప్ముకం కలిగించాలని కమిషన్‌ను కోరాం. ఇక రెండవ అంశం, విచారణాంశాల ప్రాధాన్యతలను నిర్ణయించడం. కమిషన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విచారణాంశాలను నిర్దేశించింది. ఆ విచారణాంశాలు నక్సలైటు ఉద్యం ఆవిర్భావం దగ్గరి నుంచి భవిష్యత్‌ సూచనల దాకా అనేక అంశాలను తమ లో ఇముడ్చుకున్నాయి.

ఇంత విస్తృతమైన అంశాలను చర్చించే పనికి పూనుకోవడం చాలా ఆహ్వానించ దగిన పరిణామమే. కాని అసలు ఈ కమిషన్‌ ఏర్పాటుకు కారణం కొన్ని చట్ట వ్యతిరేక హత్యల పట్ల ప్రజలలో వెల్లువెత్తిన ఆందోళన. అందువల్ల ఆ ఆందోళనకు కారణమైన హత్యలనూ, అత్యాచారాలనూ, చిత్రహింసలనూ విచారించడం మొట్టమొదటి లక్ష్యం కావాలి.ఇవి హత్యలా, ఎదురు కాల్పులా, ఆత్మ రక్షణార్థం జరిపిన కాల్పులలో సంభవించిన మరణాలా అనేది మొట్టమొదట తేల్చవలసి ఉంటుంది. అవి హత్యలే అయితే బాధ్యులు, హంతకులు ఎవరో తేల్చవలసి ఉంటుంది. ఈ రెండు పనులూ తక్షణమే జరపాలి. అందువల్ల విచారణాంశాలు నాలుగింటిలో ఇది ప్రధానాంశం కావాలని, ప్రాధాన్యతలు మార్చాలని మేం కమిషన్‌కు సూచించాం. మా మెమొరాండంలో మేం లేవనెత్తిన మూడో అంశం చాలా ముఖ్యమైనది. హత్యలు, చిత్రహింసల ఘటనల విచారణలో వరుసక్రమం ఎట్లా ఉండాలనే విషయం అది. అప్పటికి మాకు అందిన సమా చారం ప్రకారం 1969 నుంచి 1976-77 వరకు ఎదురుకాల్పుల (ఎన్‌కౌంటర్‌) సంఘటనలుగా చెప్పబడిన వాటిలో మొత్తం 250కి పైగా వ్యక్తులు మరణించారు. ఈ మొత్తం ఘటనలలో 19 మంది నక్సలైట్ల మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలను తార్కుండే కమిటీ సేకరించింది. మరొక 70-80 మంది నక్సలైట్ల హత్యకు సంబంధించి మా దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారా లున్నాయి. ఇతర సంస్థల దగ్గర కూడ మరికొంత సమాచారం ఉండవచ్చును.

అందువల్ల, విరివిగా సమాచారం లభ్యమతున్న ఘటనలపైనే విచారణ ప్రారంభించడం కమిషన్‌ పనిని సులభతరం చేస్తుంది. అంతేగాక, ఈ ఘటనలకు సంబంధించి సాక్ష్యాధారాల సేకరణ పనిని అప్పగించడానికి విశ్వసనీయమైన ప్రభుత్వ సంస్థ ఏదీలేదు గనుక, ఈ పనికి సంస్థలనో, గడువులనో విధించడం సాధ్యం కాదు. కనుక విచారణ జరిగే క్రమానికి నిర్ణీత సమయవ్యవధిని పాటినంచనక్కరలేదని మేం సూచించాం. మా నాలుగో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను యథాతథంగా కొనసాగించవచ్చునా అనేది. ప్రభుత్వాధికారుల పైన చిత్రహింసలు చేశారనీ, హత్యలు చేశారనీ ఆరోపణలు వచ్చాయి. ఇంత తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ఆ అధికారులు గాని, ప్రభుత్వం గాని సాక్ష్యాధారాలను మాయం చేసే, తారుమారు చేసే అవకాశాలు ఎక్కువ. ఆ అధికారులే ఇంకా పదవులలో, నిర్ణయాధికారంలో ఉంటే ఆ అవకాశాలు ఇంకా పెరుగుతాయి.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply