“జస్టిస్ భార్గవా కమిషన్ ఏ విచారణ కొరకు నియమించబడిందో అది పూర్తి కాకుండానే తన పని మూసివేసుకోవలసి వచ్చింది. అది ఒక విషాద పరిణామం. కాని జరిగిన కొద్ది కాలమయినా భార్గవా కమిషన్ ప్రజల ముందుకు అవసరమైన వాస్తవాలను తీసుకువచ్చింది.సరే, భార్గవా కమిషన్ విచారణ ప్రారంభమయింది. కమిషన్ కొందరు నిపుణులను కూడా నియమించుకుంది. వాళ్ళు ఆయారంగాలలో నిష్ణాతులన్నమాట. ప్రకాశరావు అనే చేతిరాత నిపుణుడు. ఆయన కూడ శివశంకర్‌కు సహాయకుడిగా ఉండాలి. అట్లాగే మరికొందరు. మొత్తం మీద మా తరఫున 25 మంది సాక్షులు.”
గతంలో ఏర్పాటయిన విచారణ కమిషన్‌లు ఏవయినా అప్పుడు అధికారంలో లేని ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, అధికారుల మీద విచారణలు జరిపాయి. అది దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించాం. ఒకవేళ సస్పెన్షన్ సాధ్యంకాదని అనుకుంటే కనీసం విచారణను ఎదుర్కొంటున్న ఐపిఎస్ అధికారులను రాష్ట్రం బైటికి, ఇతర అధికారులను జిల్లాలకు బదిలీ చేయాలని మేం సూచించాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకపోతే, అసలు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగడం విచారణకు ఆటంకమవుతుందేమో ఆలోచించాలని కూడ మేం సూచించాం.
మా ఐదో ప్రతిపాదన మధ్యంతర నివేదికలు వెలువరించడం గురించినది. కమిషన్ గనుక తాను విచారిస్తున్న ఎన్‌కౌంటర్ల గురించి మధ్యంతర నిర్ధారణలకు వచ్చినట్టయితే, ఆ నిర్ధారణలను బైటికి ప్రకటించడం మంచిదని మేం సూచించాం. అట్లాంటి బహిరంగ ప్రకటనల వల్ల ఎంతోమంది సంకోచిస్తున్న సాక్షులకు నైతిక ధృతి కలుగుతుందని, ఈ కమిషన్ సత్యాన్ని వెలికి తీయడంలో సరైన పని చేస్తుందనే నమ్మకం కలుగుతుందని మేం సూచించాం. మా ఆరో ప్రతిపాదన సేకరించవలసిన ప్రభుత్వ, అధికారిక పత్రాల గురించినది. అప్పటికి కమిషన్ పత్రికా ప్రకటన ద్వారా సాధారణ ప్రజానీకం నుంచి సాక్ష్యాధారాల సేకరణ ప్రారంభించింది. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించవలసిన సమాచారం, అధికారిక పత్రాలు, సాక్ష్యాధారాల ప్రస్తావన ఆ ప్రకటనలో లేదు. అందువల్ల కమిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కొన్ని డాక్యుమెంట్లు అడగాలని, ప్రభుత్వాలు అవి ఇవ్వకపోతే అధికారికంగా స్వాధీనం చేసుకోవాలని మేం సూచించాం.
మేం ఆ మెమొరాండంలో పొందుపరచిన అధికారిక పత్రాల జాబితా ఇది:
- నక్సలైటు సమస్య గురించి భారత ప్రభుత్వ పత్రాలు
- ఈ విషయంలో పోలీసు శాఖకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశపత్రాలు
- ఈ సమస్యతో వ్యవహరించే పోలీసు అధికారుల సమావేశాల కార్యక్రమ వివరణలు
- గత మూడు సంవత్సరాలలో (ప్రత్యేకించి గత మూడు నెలలలో) జరిగిన పోలీసు అధికారుల బదిలీలు, నియామకాలు.
- 1969 నుంచి 1977 వరకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు సిబ్బందికి ప్రకటించిన పారితోషికాలు, ఆ పారితోషికాలకు కారణాలు.
- ఎన్‌కౌంటర్లు జరిగాయని చెప్పుతున్న జిల్లాలలో 1967-1977 కాలంలో పోలీసు అధికారుల ప్రయాణభత్యం, రోజువారీ భత్యాల బిల్లులు.
- ఎన్‌కౌంటర్లుగా చెపుతున్న సంఘటనలకు సంబంధించిన మృతదేహాల శవపరీక్ష నివేదికలు, పంచనామా నివేదికలు.
- 1968-77 కాలంలో నక్సలైట్లతో జరిగాయని చెపుతున్న ఎన్‌కౌంటర్‌లలో భాగం పంచుకున్న పోలీసు అధికారులు గత రెండు సంవత్సరాలలో ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పే నివేదికలు.
- 1968-77 కాలంలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ల టెలిఫోన్ బిల్లులు.
- ములుగు-గజ్వేల్-సిద్ధిపేట-హైదరాబాదుల మధ్య, విజయవాడ-ఖమ్మంల మధ్య, ఎల్లందు-హైదరాబాదుల మధ్య, శ్రీకాకుళం-హైదరాబాదుల మధ్య నడిచిన వైర్‌లెస్ సందేశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లు, అన్ని రికార్డులు.
- హైదరాబాద్ నగరానికి, మెదక్, వరంగల్, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన పోలీసు వాహనాల రాకపోకలు రికార్డు చేసే లాగ్ బుక్స్.
ఈ పత్రాలన్నీ వెంటనే కమిషన్ స్వాధీనం చేసుకోవాలని, సంబంధిత శాఖలను వెంటనే అప్పగించమని ఆదేశించాలని, అవి కమిషన్‌కు చేర్చడానికి మధ్యవర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉండడానికి కూడ వీలులేదని మేం ఆ మెమొరాండంలో రాశాం. ఆ మెమొరాండంలో రెండు మూడు అంశాలను మాత్రం కమిషన్ ఆమోదించింది. సాక్షులకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని, విచారణాంశాలను అటూ ఇటూ మార్చి ఎన్‌కౌంటర్ ఘటనల నిజానిజాలు ముందుగా విచారించవచ్చునని కమిషన్ అంగీకరించింది. ఐతే మా చివరి డిమాండ్ అయిన అధికారిక పత్రాల సేకరణకు, స్వాధీనానికి పోలీసులు అడ్డుపడ్డారు. ప్రభుత్వ న్యాయవాది అది సాధ్యం కాదన్నాడు. ఆ పత్రాలలో ఏ ఒక్కటి దొరికినా ఎన్‌కౌంటర్లు ఎంత బూటకమో, ప్రజాధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పోలీసులు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో బయటపడేది.
జస్టిస్ భార్గవా కమిషన్ ఏ విచారణ కొరకు నియమించబడిందో అది పూర్తి కాకుండానే తన పని మూసి వేసు కోవలసి వచ్చింది. అది ఒక విషాద పరిణామం. కాని జరిగిన కొద్ది కాలమయినా భార్గవా కమిషన్ ప్రజల ముందుకు అవసరమైన వాస్తవాలను తీసుకువచ్చింది. సరే, భార్గవా కమిషన్ విచారణ ప్రారంభమయింది. కమిషన్ కొందరు నిపుణులను కూడా నియమించుకుంది. వాళ్ళు ఆయారంగాలలో నిష్ణాతులన్నమాట. ప్రకాశరావు అనే చేతిరాత నిపుణుడు. ఆయన కూడ శివశంకర్‌కు సహాయకుడిగా ఉండాలి. అట్లాగే మరికొందరు. మొత్తం మీద మా తరఫున 25 మంది సాక్షులు. ప్రభుత్వం తరఫున మరికొందరు సాక్షులున్నారు. ఇదంతా గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి. మా మొట్టమొదటి సాక్షి చల్లా నరసింహారెడ్డి, ఆయన సిద్ధిపేటలో న్యాయవాదిగా పనిచేస్తుండేవాడు. ఆయన తన వాంగ్మూలం చాలా బాగా ఇచ్చాడు. క్రాస్ ఎగ్జామినేషన్ మొదలయింది. ప్రకాశరావు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం మొదలు పెట్టినాడు. నరసింహా రెడ్డి ఆయనను చీల్చి చెండాడాడు. నిజంగా ఆ రోజు నరసింహా రెడ్డి వ్యవహారం అద్భుతంగా ఉండింది.
అప్పుడు మాకు పెద్ద సమస్య, సాక్షులను కాపాడడం ఎట్లా అనేదే. సాక్షులను తీసుకురావడం, వారిచేత సాక్ష్యం చెప్పించడం, ఆ తర్వాత పోలీసులు వారిని ఎత్తుకు పోయి బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేయకుండా కాపాడడం-ఇదంతా పెద్దపనిగా ఉండేది. మేం మా సాక్షులతో ఒక్క అబద్ధం కూడ చెప్పించలేదు. నేను మామూలుగానే కోర్టులో చెపుతూ ఉంటాను – నిజం చెప్పేటట్టయితే ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది ముందర చెప్పినా, ఎందరు క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఒక్కలాగానే ఉంటుంది. అది అబద్ధమయితేనే ఒకసారికీ మరోసారికీ మారిపోతుంది. ఒకరి ముందర చెప్పినట్టు మరొకటి ముందర చెప్పలేం. క్రాస్ ఎగ్జామినేషన్‌లో బైటపడిపోతాం.