Take a fresh look at your lifestyle.

బాబ్రీ పై తీర్పు….ఊహించినట్టే స్పందనలు

బాబ్రీమసీదు కూల్చివేత కుట్ర కేసులో బీజేపీ అగ్రనాయకులు ఎల్‌ ‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ ‌జోషిల సహా  32 మంది నిందితులు నిర్దోషులని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై  బీజేపీ, సంఘ్‌ ‌పరివార్‌ ‌వర్గాలు హర్షాతిరేకాలను వ్యక్తం చేయగా, ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు, ఎంఐఎం వంటి సంస్థలు న్యాయవ్యవస్థ చరిత్రలో ఇది చీకటి రోజు అని అభివర్ణించాయి. రామజన్మభూమి వివాదంపై సుప్రీమ్‌కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బట్టే ఈ కేసు కొట్టి వేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ కేసు తీర్పు తర్వాత ఇది వెలువడటం పట్ల అద్వానీ అందుకే హర్షం వ్యక్తం చేశారు.  ఈ కేసు విచారణకు 28 సంవత్సరాలు పట్టింది. ఈ కేసులో మొత్తం 49 మందిని నిందితులుగా పేర్కొనగా, కేసు విచారణ సమయంలో 17 మంది మరణించారు. బాబ్రీ కూల్చివేత సంఘటన అప్పట్లో  దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.  సమాజంలో  చీలికలు సృష్టించింది.  కూల్చివేత తర్వాత, అటుపిమ్మట ముంబాయి పేలుళ్ళు, దాడుల సంఘటనల్లో వందలాది మంది మరణించారు. వీరిలో అమాయకులు అనేక మంది ఉన్నారు. అసలైన  దోషులు దర్జాగా తిరుగుతునారు. ఈ సంఘటన భారత లౌకిక వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించింది.

ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు లేని పోని నిందలు మోయాల్సి వొచ్చింది. సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌ ‌పార్టీ వారే, ఆయన నిజాయితీని శంకించారు. నిజానికి అప్పట్లో పీవీ చేసిన నేరం ఏమీ లేదు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. కేంద్రం జోక్యం చేసుకుంటే విమర్శలు వొస్తాయి. అందుకుని ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా అప్పట్లో  బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణ్‌ ‌సింగ్‌ ఇచ్చిన భరోసా కారణంగా కేంద్ర దళాలను పంపలేదు. అలా పంపి ఉంటే మరో విధమైన విమర్శలు కేంద్రం మీద వొచ్చేవి. అందుకే పీవీ అప్పట్లో ఆచితూచి వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత కాంగ్రెస్‌ ‌లోనే కాకుండా, అన్ని పార్టీల్లో దాని ప్రభావం కనిపించింది. అయోధ్యలో వివాదాస్పద ప్రదేశంలో ఉన్న ఈ మసీదు  16వ శతాబ్ది నాటిది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో  రామాలయాన్ని ఆనాటి పాలకుల దన్నుతో కొందరు ధ్వంసం చేసి  మసీదును నిర్మించారన్నది హిందువుల నమ్మకం. ఈ స్థలం  కోసం ఇరు మతాల మధ్య  దశాబ్దాలపాటు న్యాయపోరాటం జరిగింది. చివరికి  2019 నవంబర్‌లో సుప్రీమ్‌కోర్టు  చారిత్రకాంశాల ఆధారంగా ఇది హిందువులకే చెందుతుందని తీర్పు ఇచ్చింది.

అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించాలని సూచించింది. దాంతో ఈ వివాదం పరిష్కారమై, గత  ఆగస్టులో ఐదవ తేదీన రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ  శంకుస్థాపన చేయడానికి మార్గం సుగమం అయింది. ఈ రెండు తీర్పులూ సహజంగానే హిందువులకు ఆనందాన్ని ఇవ్వగా, ముస్లింలు మసీదు కూల్చివేత ఘటనపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. సిబిఐ కోర్టు తీర్పుపై పై కోర్టుకు అప్పీలు చేస్తామని ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు ప్రకటించింది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇది చీకటి రోజు అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. అందరూ నిర్దోషులైతే మసీదును పడగొట్టిందెవరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మసీదు కూల్చివేత సంఘటనను హర్షిస్తూ ప్రకటనలు చేసిన నాయకులు ఇదంతా తమ పనేనని ఘనంగా చెప్పుకున్నారని వారి ప్రకటనలను పరిగణనలోకి  తీసుకోలేదని ఆయన అన్నారు. అంతేకాక, న్యాయం జరగడం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టేనన్న సామెత ఈ విషయంలో రుజువైందని ఆయన అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టిన ఈ ఘటనలో కొందరు రాజకీయంగా ప్రాచుర్యాన్ని పొందగా, మరి కొందరు చేయని నేరానికి నిందలు మోయాల్సి వచ్చింది. అందుకు పీవీయే ఉదాహరణ. పీవీని అవమానించిన కారణంగానే  కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ దెబ్బతింది.

బాబ్రి మసీదు విషయంలో అద్వానీ, మురళీ మనోహర్‌ ‌జోషి వంటి పాత తరం బీజేపీ నాయకులు తమ కల పండిందని  ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న మాట నిజమే కానీ, కరసేవకులను ఉసిగొల్పి, ప్రేరేపించిందెవరో తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే, అప్పట్లో నాయకులంతా భావోద్వేగమైన ప్రకటనలు చేసిన మాట వాస్తవం. ఆ ప్రకటనల కారణంగానే కరసేవకులు గుంపులుగా వొచ్చి బాబ్రీని పడగొట్టారన్న వాదానికి సీబీఐ తగిన ఆధారాలను సమర్పించలేకపోయింది. ఆరోజుల్లో ఒక్క అద్వానీ, జోషిలు మాత్రమే కాకుండా అందరూ భావోద్వేగ ప్రకటనలు చేశారు. అంత మాత్రాన వారంతా దోషులని అనలేం. అంతేకాక, ఈ ఘటన కారణంగా పాకిస్తాన్‌ ‌భారత్‌పై అంతర్జాతీయ స్థాయిలో విషప్రచారం సాగించింది. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్‌పై బురద జల్లే కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. శతాబ్దాలుగా లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్న భారత్‌ ఇమేజ్‌ని ఈ ఘటన దెబ్బతీసిన మాట వాస్తవమే. ఈ ఘటన ముందస్తు పథకం ప్రకారం జరిగిందనడానికి ఆధారాలు లేవనీ, సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియోల టేపులను ప్రామాణికంగా పరిగణించలేమనీ, సంఘ విద్రోహ శక్తులే ఈ పని చేశారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అంతేకాకుండా మసీదు కూల్చివేత యత్నాలను నిందితులుగా ఉన్న వారే అడ్డుకున్నారంటూ  సంచలన విషయాన్ని న్యాయస్థానం వెల్లడించింది. సిబీఐ పంజరంలో పక్షి అని సుప్రీమ్‌కోర్టు ఇదివరకే అభివర్ణించింది. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా సాక్ష్యాలను మార్చేస్తుందన్న అపవాదును మూటగట్టుకుంది. ఏ న్యాయస్థానమైనా తన ముందున్న ఆధారాలతో కేసులను పరిష్కరిస్తుంది. ఈ కేసు తీర్పును కూడా అలాగే  భావించాలి.

Leave a Reply