Take a fresh look at your lifestyle.

జీవో 155కు వ్యతిరేకంగా జూడాల సమ్మె ఉధృతం

నాలుగు రోజులుగా విధులు బహిష్కరణ

పీజీ మెడికల్‌ ‌సీట్ల కేటాయింపులో ఇన్‌ ‌సర్వీస్‌ ‌వైద్యులకు ప్రత్యేక రిజర్వేషన్‌ ‌కోటా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 155ను వ్యతిరేకిస్తూ జూనియర్‌ ‌డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మె ఉధృతంగా సాగుతుంది. వూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి జూనియర్‌ ‌డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాలుగో రోజుకు చేరింది. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా మెడికల్‌ ‌కళాశాలలతో పాటు రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ ‌కళాశాలల్లో జూనియర్‌ ‌డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. సర్వీసులో ఉన్న డాక్టర్లకు పీజీ ఇన్‌ ‌సర్వీస్‌ ‌కోటాలో రిజర్వేషన్లు కల్పించడాన్ని జూనియర్‌ ‌డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామనీ, తక్షణమే ప్రభత్వం ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ఉన్న పద్దతిలోనే ర్యాంకు సాధించిన వారికే పీజీ మెడికల్‌ ‌సీటు కేటాయించేలా చర్యలు చేపట్టాలనీ, ఆప్షన్లు ఉండగా ఇన్‌ ‌సర్వీసు వైద్యులకు మేలు చేసేలా ఏకపక్షంగా ప్రభుత్వం జీవో 155ను తీసుకొచ్చి తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చి వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న జీవో 27 ప్రకారం… గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు నీట్‌ ‌పీజీ రాసి అందులో 50 శాతం మార్కులు తెచ్చుకుంటే వారికి ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు కళాశాలల్లోనూ పీజీ మెడికల్‌ ‌సీట్లు కేటాయించే వారనీ, ఈ విధానంతో ప్రతిభ కలిగిన వైద్యులే పీజీ కోర్సుకు అర్హత సాధించే వారని పేర్కొన్నారు.

అయితే, ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ప్రతిభావంతులైన వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న జూనియర్‌ ‌డాక్టరు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావును ఈ విషయంపై కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయనతో చర్చలు జరిపిన తరువాత తమ సమ్మెను కొనసాగించేది లేనిదీ నిర్ణయిస్తామని జూనియర్‌ ‌డాక్టర్ల ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply