Take a fresh look at your lifestyle.

23‌న జేపీ నడ్డాతో బీజేపీ నేతల వర్చువల్‌ ‌సమావేశం

రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నగర పాలికల ఎన్నికలపై చర్చ

ఈనెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు వర్చువల్‌ ‌మీటింగ్‌ ‌ద్వారా సమావేశం కానున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నియమించిన కొత్త కమిటీతో పాటు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో నడ్డా సమావేశం
కానున్నారు. త్వరలో జరుగనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు జీహెచ్‌ఎం‌సి ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తయారు చేయాలనే ఆలోచనతో ఆ పార్టీ అధిష్టానం ఉంది.

ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జాతీయ నాయకత్వం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో పాటు పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసే దిశగా నడ్డా రాష్ట్ర పార్టీ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు. అలాగే, రాష్ట్రంలో కొరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, దీనికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన నిధులను సరైన విధంగా ఖర్చు చేయకపోవడం, కీష్ణా, గోదావరి నదులపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వంటి అంశాలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నడ్డా పార్టీ రాష్ట్ర నాయకులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply