- సమావేశాలకు సర్వం సిద్ధం చేసిన పార్టీ
- అధికార పీఠమే లక్ష్యంగా సమరశంఖం
- 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ
- నేడు హైదరాబాద్ చేరుకోనున్న జెపి నడ్డా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి నుంచి హైదరాబాద్ నోవాటెల్ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని సహా పలువురు పార్టీ పెద్దలు హాజరు కానుండడంతో సమావేశాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా తెలంగాణపై బిజెపి ఫోకస్ పెట్టిందని స్పష్టమవుతన్నది. ఇప్పటికే సిఎం కెసిఆర్ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయం తీసుకోవడంతో పాటు, ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. నిత్యం బిజెపిని, మోడీని లక్ష్యంగా చేసుకుని టిఆర్‌ఎస్ పోరాడుతుంది. బిజెపి కూడా టిఆర్‌ఎస్‌ను, కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలతో హోరెత్తిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఈ సమావేశాలలో సమరశంఖం పూరించబోతుంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం, టీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తెలంగాణను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తుంది. ఐదేళ్ల తర్వాత దేశ రాజధాని వెలుపల, అందునా ప్రత్యక్ష పద్ధతిలో జరగబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఇటు తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామన్న వాతావరణం కల్పించడంతో పాటు అటు పార్టీ క్యాడర్‌కు నూతనోత్సాహాన్నిచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.
ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు కాబోతున్నాయని తెలంగాణ బిజెపి నేతలు పదేపదే ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 360 మంది జాతీయ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. సమావేశాల సందర్భంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాల కోసం జేపీ నడ్డా నేడు హైదరాబాద్ చేరుకోనుండగా, మోదీ, అమిత్‌షా రేపు రానున్నారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జూలై 3న సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగసభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ వేదిక అవుతోంది. 2004 జనవరిలో ఉమ్మడి ఏపీలో వైస్రాయ్ హోటల్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అప్పుడు వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నారు.
వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు కూడా పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించగా, అప్పటి ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజపేయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా మరోమారు హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల పాటు నిర్వహించే సమావేశాలను, ప్రధాని మోడీ బహిరంగసభను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయికి దూసుకు పోవాలని స్థానిక నేతలు భావిస్తున్నారు. సమావేశాల సందర్భంగా తెలంగాణలో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాల కమ్యూనిటీలతో ఆ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. హరియాణాకు చెందిన వారితో ఆ రాష్ట్ర సీఎం ఖట్టర్, తమిళ కమ్యూనిటీ సమావేశానికి నటి ఖుష్బూ, అన్నామలై, మురుగన్ హాజరవుతారు. గుజరాతీల సమావేశానికి ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్, విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ వారితో భేటీకి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ హాజరు కానున్నారు. వీరితోపాటు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, ఇతర ఈశాన్య రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల ప్రజలతో సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా భారీ బలప్రదర్శనకు కూడా పార్టీ సిద్ధం అవుతుంది. మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసవి•కరణకు ఏర్పాట్లు చేసున్నారు.