పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుండి భద్రతా కల్పించాలనే డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్ జర్నలిస్టస్ యూనియన్(ఐజెయు) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం నుండి హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ,శ్రీరాం రాంచందర్‌లు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనా కాటుకు బలైపోగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే 4 గురు జర్నలిస్టులు మృతి చెందారన్నారు. 1100ల మంది మీడియా సిబ్బందికి, 2,600మంది వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడం విచారకరమన్నారు.
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ప్రభుత్వ సహాయం అందించాలని, కోవిడ్ వారియర్స్‌గా నిలిచిన జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని, కరోనా సోకిన జర్నలిస్టులకు కార్పోరేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ డిఆర్ఓ హరిసింగ్ ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రము అందించేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాడిపెళ్లి మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లాల వెంకట రమణ, సోషల్ మీడియా రాష్ట్ర కో-ఆర్డినేటర్ బోళ్ల అమర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల సంతోష్, ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు నార్లగిరి యాదగిరి, కెంచే కుమారస్వామి, నల్లాల బుచ్చిరెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ రామ్ చందర్, వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు దొమ్మటి శ్రీకాంత్, జిల్లా కమిటీ నాయకులు తోట సుధాకర్, జన్ను స్వామి, డాక్టర్ విష్ణువర్ధన్, ఎండి షంషుద్దీన్, వాజిద్, రాజేందర్, నయీమ్ పాషా, తిరుపతి రెడ్డి, గోపి, భాస్కర్, ఉష్మన్ పాషా, ఖాదర్ పాషా, శివ శంకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.