Take a fresh look at your lifestyle.

ఇక ఉంటా…బ్రదర్‌..!

  • ‌సుప్రసిద్ధ పాత్రికేయులు
  • పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

తుదిశ్వాస వరకు జర్నలిజం విలువలకు కట్టుబడిన నిఖార్సైన వ్యక్తిత్వం
సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం అనారోగ్యంతో తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు 86 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌ ‌వ్యాధితో బాధపడుతున్నారు. తుదిశ్వాస వరకు జర్నలిజం విలువలకు కట్టుబడి తనదైన విలక్షణ వ్యక్తిత్వానికి దర్పణంగా నిలిచిన మహనీయుడు పొత్తూరి. ఆయన1934 ఫిబ్రవరి 8న ఉమ్మడి మద్రాస్‌ ‌రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్రజనత పత్రిక ద్వారా పాత్రికేయరంగంలోకి ప్రవేశించి అనేక మైలురాళ్లను స్థాపించిన జర్నలిజం పితామహుడాయన. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పొత్తూరి పార్థివకాయానికి జూబ్లీహిల్స్ ‌మహాప్రస్థానంలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, రచయితలు, సామాజికవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో పొత్తూరి ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా సేవలందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం దినపత్రికలలో పనిచేసి జర్నలిజానికి మెరుగులు దిద్దిన విశిష్ట పాత్రికేయుడు పొత్తూరి. ఆంధ్రప్రభలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశారు.

జర్నలిజంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఐదు దశాబ్దాలపాటు విలువైన అక్షరాల వెలుగులను తెలుగుపాఠకులకు అందించిన కలం ఆయన సొంతం. ఆయన చింతన (ఆధ్యాత్మిక సంపాదకీయాలు), స్ఫూర్తిప్రదాతలపైన రాసిన వ్యాఖ్యానాల సంకలనం చిరస్మరణీయాలు. ఇవి తెలుగుపాఠకులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోయే రచనలు. ఇవేకాక వ్యాసప్రభ, నాటిపత్రికల మేటివిలువలు, పారమార్థిక పదకోశం వంటి రచనలను ఆయన అందించారు. మాజీ ప్రధాని పీవీ గురించి రాసిన ఇయర్స్ ఆఫ్‌ ‌పవర్‌లో సహ రచయితగా ఆయన ఉన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని నిష్కర్షగా చెప్పి, తెలంగాణ ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడు పొత్తూరి. సీనియర్‌ ‌జర్నలిస్టులను, వర్ధమాన జర్నలిస్టులను ఒకేతీరుగా గౌరవించడం ఆయన ప్రత్యేకత. ఆయన ఇకలేరన్న సమాచారంతో ఆయన సన్నిహితులు, శిష్యులు చెరగని నవ్వుతో ఆయన పలకరించేతీరును జ్ఞాపకం చేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఐదుదశాబ్దాల పత్రికారంగంలోని ఎత్తుపల్లాలను, నిశితంగా పరిశీలించి, తన విశిష్టవ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న ప్రత్యక్షసాక్షి పొత్తూరి. ఆయన ధారణాశక్తిని చాలామంది పాత్రికేయులు ప్రశంసిస్తుంటారు. శతాబ్దం కిందటి పత్రికల సంగతులను కూడా పుంఖానుపుంఖాలుగా చెప్పడం ఆయనకే తెలిసిన విద్య.

సీఎం కేసీఆర్‌ ‌ప్రగాఢ సంతాపం
సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పొత్తూరి ఇచ్చిన నైతిక మద్ధతు చాలా విలువైనదని, ఉద్యమ సందర్భంలో ఆయన మద్ధతు తెలంగాణ ప్రజలకు కొండంతబలాన్ని ఇచ్చిందని కేసీఆర్‌ ‌గుర్తు చేసుకున్నారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ‌భగవంతుడిని ప్రార్థించారు. కాగా, విలువల జర్నలిజానికి పొత్తూరి నిజమైన ప్రతినిధి అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీర్‌హరీశ్‌రావు కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని సంతాపసందేశంలో పేర్కొన్నారు. మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ ‌తదితరులు కూడా పొత్తూరి మరణానికి సంతాపం తెలిపారు.

దేవులపల్లి అమర్‌ ‌సంతాపం
నిఖా••ర్సైన జర్నలిజానికి చిరునామాగా నిలిచిన గొప్ప పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు అని జాతీయ అంతరాష్ట్రీయ ఆంధ్రప్రదేశ్‌ ‌మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌సంతాపసందేశంలో పేర్కొన్నారు. పొత్తూరికి ఆయన నివాళులర్పించారు. ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఆర్‌ఎన్‌ఏ ‌చీఫ్‌ఎడిటర్‌ అవ్వారు రఘు, ప్రజాతంత్ర పబ్లిషర్‌ ‌దేవులపల్లి అజయ్‌ ‌తదితరులు కూడా నివాళులర్పించారు.

రాజకీయ నాయకుల సంతాపం
సీనియర్‌ ‌పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి డీకే సమరసింహారెడ్డి, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత నిరంజన్‌ ‌తదితరులు నివాళులు అర్పించారు. తెలుగు పాత్రికేయ రంగం గొప్ప పాత్రికేయుడిని కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పొత్తూరి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ ‌సంతాప సందేశంలో పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకమైన రచన)తో తెలుగు పాఠకులకు మార్గదర్శకుడుగా నిలచిన పాత్రికేయుడు పొత్తూరి అని ఆయన నివాళి అర్పించారు.

Leave a Reply