Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ అం‌టే ఎందుకంత చిన్నచూపు?

  • కొరోనాతో ప్రాణాలు కోల్పోతున్న కలం వీరులు
  • 10రోజుల వ్యవధిలోనే కొరోనాకు 20మంది కలం కార్మికుల బలి
  • ఆసుపత్రులు, ఇంట్లో కొన ఊపరితో కొట్టుమిట్టాడుతున్న వారెందరో.. పట్టించుకోని పాలకులు
  • రూ.2లక్షల సహాయం పోయిన ప్రాణాన్ని తెస్తుందా?..ఆదుకోవాలంటూ అర్థిస్తున్న జర్నలిస్టు కుటుంబాలు
  • జర్నలిస్టుల గోడు మాత్రం పట్టించుకోరా?
  • జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్‌గా గుర్తించాలని సర్వత్రా డిమాండు

ఇప్పుడు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల కుటుంబాల అందరిలో వినిపిస్తున్న మాట ఒకటే జర్నలిస్ట్ అం‌టే ఎందుకంత చిన్నచూపు?…వార్త రాయడానికే జర్నలిస్ట్ ‌గుర్తుకు వస్తాడా?అని. దీనికి
కారణం. కొరోనా కాటుకు జర్నలిస్టులు బలి కావడమే. కొరోనా జర్నలిస్టులను కబలిస్తుంది. కొరోనాతో కలం కార్మికులు కష్టాల్లో పడ్డారు. కాదు, కాదూ మృత్యువు అంచునా ఉన్నారు. మృత్యువు అంచున ఉండటమేంటీ మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ…ప్రజల సమస్యలనే తమ సమస్యలుగా, ప్రభుత్వ పథకాలను తమ కలాల ద్వారా రాస్తూ ప్రచారకులుగా పని చేసే కలం కార్మికులు కొరోనా బారినపడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గడిచిన పది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 20మంది వరకు కలం కార్మికులు కొరోనాకు బలయ్యారు. మరికొందరు ఆసుపత్రుల్లో, ఇండ్లలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

కొరోనా బారినపడ్డాం మమ్మల్ని ఆదుకోండంటూ అభ్యర్థిస్తున్నారు. వేడుకుంటున్నారు. ప్రాధేయపడుతున్నారు. కొరోనా సోకిన పలువురు జర్నలిస్టులు వైద్యం కోసం వీడియోలు తీసి సోషల్‌ ‌మీడియాలో పెడుతున్న పోస్టులు గుండెల్ని పిండేస్తున్నాయి. ప్రజలకు జరిగే అన్యాయాలపై వార్తలు రాసే కలం కార్మికులు జర..మా ప్రాణాల్ని కాపాడడంటూ కన్నీరు మున్నీరవుతున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. పాలకులు మాత్రం అంతగా స్పందించడం లేదు. కొరోనా కాలంలో ప్రాణాలు తెగించి విధి నిర్వహణలో పాల్గొంటూ…ప్రాణాలనే పోగొట్టుకున్న వారు కొందరైతే…ప్రాణాపాయ స్థితిలో ఇంకొందరు. కొరోనాతో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్నా కూడా పాలకులు కలం కార్మికుల పట్ల చూపెట్టాల్సిన కనీస కనికరం, మానవత్వాన్ని కూడా చూపెట్టలేకపోతున్నారు. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వంటి ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు మినహాయిస్తే…మరెవరూ కూడా కొరోనా బారినపడిన కలం కార్మికులను పట్టించుకున్న పాపానపోవడం లేదు. తెలంగాణ మీడియా అకాడమీ కొరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామనీ ప్రకటించడమంటే చేతులు దులుపుకోవడమే.

కొరోనా బారినపడి ఆక్సిజన్‌ అం‌దక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నామంటూ జర్నలిస్టులు నెత్తి, నోరు కొట్టుకున్నప్పుడే స్పందించి మెరుగైన వైద్యం అందించి ఉంటే కొందరైనా కలం కార్మికులు బతికేవారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు గుర్తింపు తెచ్చేది పాత్రికేయుడు నేడు ప్రమాదంలో ఉన్నాడు. జర్నలిస్టులు ఇప్పుడు కొరోనా సెకెండ్‌ ‌వేవ్‌ ‌లో పిట్టల్లా రాలిపోతున్నారు. ఏ జర్నలిస్ట్ ‌వాట్సాప్‌ ‌గ్రూపులో చూసినా- తోటి ఉద్యోగుల పాజిటివ్‌ ‌వార్తలు. సహాయం కోసం అభ్యర్థనలు. ఆసుపత్రి ఐసియూ వార్తలు. త్వరగా కోలుకోవాలని తోటివారి ప్రార్థనలు. మృతికి సంతాప వార్తలు. పోయినవారి గురించి నాలుగు మంచి మాటలు. వారి కుటుంబం భవిష్యత్తు మీద ఆందోళనలు. పోయిన వారికి జ్ఞాపకంగా ఫొటోకు దండ వేసి నివాళులర్పించడం కాదు, కాస్తయినా ఆర్థికంగా ఆదుకునే ఆలోచన చేసే వారే కరువయ్యారు. కొరోనా కారణంగా చనిపోయిన వారిలో సీనియర్‌ ‌జర్నలిస్టులు అమర్‌నాథ్‌, ‌శ్రీనాథ్‌ ‌వంటి వాళ్లు కూడా ఉన్నారు.

జర్నలిస్టుల కోసం సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన అమర్‌నాథ్‌ ‌చనిపోతేనే.. పెద్దగా ఎవరూ పట్టిచుకోలేదు. ఇతర జర్నలిస్టుల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. వృత్తి పట్ల ఉన్న మక్కువతో చాలిచాలనీ జీతాలతోనే జర్నలిస్ట్‌లుగానే బతుకు బండి సాగిస్తున్నారు. ఎలాగోలా బతుకు బండిని లాగుతున్న జర్నలిస్ట్‌ల పాలిట కొరోనా శాపంగా మారింది. మంత్రులు.. ముఖ్య మంత్రులు..అధికారులు.. ప్రోగ్రామ్స్‌ను వారికంటే ముందుగా వెళ్లి గంటల తరబడి వేచి వుండి కవరేజ్‌ ఇచ్చే జర్నలిస్టులకు బతుకు కవరేజ్‌కి గ్యారంటీ లేకుండా పోయింది. బతకడానికి రిపోర్టగా పని చేస్తూ… ఇప్పుడు తమతో పాటు కుటుంబ సభ్యులను వైరస్‌ ‌కాటుకు బలి చేస్తున్నారు. కొరోనా సోకితే లక్షల రూపాయలు కావాల్సిందే. ఇంట్లో తిండికే దిక్కులేని జర్నలిస్టులు అంత భారం ఎలా భరిస్తారు? అందుకే ఇండ్లలోనే ఉంటూ రోధిస్తున్నారు. తమను కాపాడాలంటూ వీడియోల్లో మొర పెట్టుకుంటున్నారు.

ఎవరైనా దాతలు ముందుకు వస్తే తన ప్రాణం నిలుస్తుందనే ఆశతో చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. ఎవరు ఔనన్నా, కాదన్నా… జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం మానేసింది. మొదటి వేవ్‌ ‌లో జర్నలిస్ట్ ‌మనోజ్‌ ‌మరణం తర్వాత.. గాంధీలో అతని పేరుతో వార్డు పెట్టామని చెప్పి ప్రచారం చేసుకుంది. తర్వాత అంతా ఉత్తదే. ఇప్పుడు సెకండ్‌ ‌వేవ్‌లో పాతిక్రేయులను మహమ్మారి వెంటాడుతున్నా.. కేసీఆర్‌ ‌సర్కార్‌ ఏమాత్రం కనికరం చూపడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టుల కుటుంబాలను కదిలిస్తే వారు చెప్పే బాధలు వర్ణనాతీతమనీ చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ ‌కార్డస్ ‌పని చేయడం లేదు. పెండింగ్‌ ‌బకాయిలును సర్కార్‌ ఇవ్వలేదంటూ హెల్త్ ‌కార్డులను తీసుకోవడం లేదు ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్. ‌ప్రాణాలు తెగించి పని చేస్తున్నా ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్‌గా కూడా జర్నలిస్ట్‌లను గుర్తించడం లేదు సర్కార్‌. ‌పారిశుధ్య కార్మికుల(వీరికి ఇచ్చినట్లుగా జర్నలిస్టులకు ఇవ్వాలన్నదే ఉద్దేశం)కు ఇచ్చే భరోసా కూడా జర్నలిస్ట్‌లకు లేదు. కనీసం కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌ను అందించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటే జర్నలిస్ట్ అం‌టే ఏ పాటి గౌరవం ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అపర దానకర్ణుడుగా పేరు తెచ్చుకున్న సిఎం కేసీఆర్‌ ‌జర్నలిస్టులను ఇంతగా చిన్న చూపు చూడటం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు, అర్థం కావడం లేదు.

కానీ, తెలంగాణ మీడియా అకాడమీ మాత్రం ఎవరికైనా కోవిడ్‌ ‌సోకితే మాత్రం 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ చేతులు దులుపుకుంటుంది. దీంతో కొరోనా సోకిన జర్నలిస్టులు చికిత్సకు డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారు. అంతంత జీతాలతో కాలం వెళ్లదీసే జర్నలిస్టులు లక్షలాది రూపాయలతో చికిత్స ఎలా తీసుకుంటారు? అందుకే మృత్యువు కౌగిట్లోకి వెళుతున్నారు. ఇండ్లలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు అక్షర యోధులు. బతికి ఉండి.. విలేఖరిగా పని చేస్తున్నప్పుడు మాత్రమే వారి అవసరం నేతలకు ఉంది. చనిపోయిన తర్వాత వారి గురించి పట్టించుకునే తీరిక కూడా నేతలకు లేదు. ఇంతకాలం తమ వార్తలు రాయాలంటూ బతిమాలాడుకునే రాజకీయ నేతలు.. ఇప్పుడు కనీసం ఫోన్‌ ‌కూడా ఎత్తడం లేదు. జర్నలిస్టులు రాసిన వార్తలతో పెద్ద నేతలుగా ఎదిగిన వారు కూడా కష్టసమయంలో వాళ్లను ఆదుకోవడం లేదు. తాము చేసే ధర్నాలు, మీటింగుల వార్తల కోసం గంటకోసారి ఫోన్‌ ‌చేసే నేతలు… కష్టాల్లో ఉన్న జర్నలిస్టులు కాపాడమని వేడుకుంటున్నా కనీసం స్పందించడం లేదు. దీంతో వృత్తిలో భాగంగా రాజకీయ నేతల చుట్టూ పరుగులు పెట్టిన జర్నలిస్టులు..

ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ.. కాలగర్భంలో కలిసిపోతున్నారు. లోకం కష్టాలను వార్తగా రాసినవారి కష్టాలకు కనీసం వార్తగా చోటు కూడా లేదు. ఉండాలని జర్నలిస్టు కోరుకోడు కూడా. ఉద్యోగం సంగతి దేవుడెరుగు. బతికితే చాలనుకుంటున్నాడు జర్నలిస్టు. కొరోనా రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో లోకానికి చెప్పి చెప్పి జర్నలిస్టు అలసిపోయాడు. వృత్తిలో భాగంగా కొరోనాకు ఎదురు వెళ్లి కొరోనాను ఒళ్లో పెట్టుకున్నాడు జర్నలిస్టు. ఇప్పుడు జర్నలిస్టు ఒళ్లో ఉన్న కొరోనాను దించి, జర్నలిస్టును రక్షించే పాఠకుడెవరు? జర్నలిస్టు పొతే ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రేక్షకుడెవరు? ఇది ఏ జర్నలిస్టు రాయని విషాదాక్షర వార్త. రాసినా అచ్చుకాని మాటలు మూగబోయే మౌన రోదనాభరితం.

చివరగా…అందరికీ ఒకటే మాట, ఒకటే ప్రశ్న. జర్నలిస్ట్ అం‌టే ఎందుకంత చిన్నచూపు?వార్త రాయడానికే జర్నలిస్ట్ ‌గుర్తుకు వస్తాడా?ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోరా? ప్రజల కోసం పని చేసే కలం కార్మికులను బతికించే బాధ్యత ఈ పాలకులపైన లేదా?పరుగులు పెట్టి.. పోటీ పడి న్యూస్‌ ‌కవర్‌ ‌చేసి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు కొరోనా కాటుకు బలవుతున్నా కనీస స్పందన లేకపోవడం బాధాకరమనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జర్నలిస్ట్‌ల కుటుంబాలకు రక్షణ.. ఆదరణ అసలే లేదు.. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు స్పందించి జర్నలిస్టుల బతుకులకు భరోసా కల్పిస్తారనీ ఆశిద్ధాం. కొరోనా కాటుకు బలైన అక్షర యోధులకు జోహార్లు అర్పిద్ధాం.

ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర

Leave a Reply