జహీరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీని ప్రారంభించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు.
జర్నలిస్టుల సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన జహీరాబాద్ పస్తాన్ పూర్ లో జర్నలిస్టు కాలనీనీ ప్రారంభించారు. ఇందులో 31 మంది జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు జీతాలు లేకున్నా…నిలువ నీడలేకున్నా ప్రజా సేవలో ఉంటారని కొనియాడారు. జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ వంద కోట్లతో నిధి ఏర్పాటు చేశారని చెప్పారు.

కొరోనా వచ్చిన జర్నలిస్టుల కు ప్రెస్ అకాడమీ ద్వారా ఒకొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. 532 మందికి కోటి రూపాయలు ప్రెస్ అకాడమీ ద్వారా అందజేసినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు జర్నలిస్టు చనిపోతే లక్ష రూపాయల ఆర్థిక సాయం, నెలకు 3 వేల పెన్షన్, పిల్లల చదువుకు ప్రభుత్వం సాయమందిస్తోందన్నారు. అక్రిడేషన్ కార్జులు, బస్సుసౌకర్యం, డబుల్ బెడ్ రూం ఇళ్ల వంటి సౌకర్యాలును ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. మెదక్, గజ్వేల్, ఆందోళ్ లోనూ జర్నలిస్టు లకు డబుల్ బెడ్ రూంలు సిద్దమవుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టు కాలనీకి రామలింగారెడ్డి నగర్ పేరు పెట్టడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లో రామలింగారెడ్డి జర్నలిస్టుగా సేవలందించారని గుర్తు చేశారు. జర్నలిస్టు ఇళ్ల కోసం పలుమార్లు ప్రస్తావన తేచ్చేవారన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్,జెడ్పీ ఛైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.