Take a fresh look at your lifestyle.

డైలీ జర్నలిస్ట్ ‌రాసిన ‘‘జర్నలిస్ట్ ‌డైరీ’’

వృత్తి ధర్మాన్ని ప్రవృత్తిగా చేసుకుని కలం ధారలు కురిపిస్తునే, వాటిని కాలక్రమేణా గళ ధ్వనులుగా మార్చుకుని పాతికేళ్ళకు పైగా ప్రయాస పడకుండా.. గుంభనంగా, గంభీరంగా ప్రయాణిస్తున్న సతీష్‌ ‌బాబు ఎవరో తెలియక పోవచ్చు కాని, పాత్రికేయ కుటుంబంలో పుట్టి మరోపాత్రికేయుని ఇంట కాలుపెట్టి పత్రికా రంగంలో కాలూని, తనకంటూ గుర్తింపుతో ప్రకాశించిన జర్నలిస్ట్ ‌డైరీ సృష్ఠికర్త సతీష్‌ ‌బాబు, వార్తా ప్రపంచంతో సంబంధం ఉన్న ప్రతివారికీ మూడు తరాలకు పరిచయమే. ప్రింట్‌ ‌మీడియాలో ప్రవేశించి వాణిజ్య వార్తలను కొద్ది సంవత్సరాలు కాచి వడబోసి మూస జర్నలిజం కాకుండా మాస్‌ ‌జర్నలిజంలోకి అడుగుపెట్టిన సతీష్‌ ‌బాబు, వి హెచ్‌ ‌గా ప్రసిద్ధులైన వరిష్ఠ పాత్రికేయులు, ‘‘డి ఎన్‌ ఎఫ్‌ ‌హనుమంతరావు’’కు అన్నింటా వారసుడే. మూడున్నర దశాబ్దాలు మించిన జర్నలిజం ప్రయాణంలో సుమారు మొదట్లో ప్రింట్‌ ‌మీడియాలో సాగి, అక్కడ నుంచి కాలు బయటపెట్టి పాతికేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్‌ (‌టీవీ) వార్తా రంగంలో నిలదొక్కుకుని తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకుని ఆమార్గాన్నే నేటికీ నమ్ముకున్న సతీష్‌ ‌బాబు అనేక చానళ్ళ ప్రవాహంలో ఈదారు.
పాకుడురాళ్ళ టెలివిజన్‌ ‌మాధ్యమంలో వార్తలతో చేసిన ప్రయణాన్ని జర్నలిస్ట్ ‌డైరీగా నామకరణం చెసి జెమినీ టీవీ, మా టీవీ, ఎంజీ టీవీల నుంచీ టీవీ 9 వరకూ .. దాదాపు అన్ని చానళ్ళలో తన డైరీ పేజీలను తిరగేసారాయన. ధర్మపీఠం, ఫోకస్‌, ‌స్పాట్‌ ‌లైట్‌, ‌ముఖ్యమంత్రితో ముఖాముఖి, జిందగీ వంటి కార్యక్రమాలను కనిపించేలా వినిపించి తెలుగు టీవీ ప్రేక్షకుల ఆదరణ పొందారు. తన కలానికి పొగరెక్కువ అని, గళానికి వగరు, వ్యంగ్యమూ ఎక్కువేనని చెప్పుకున్నట్లే నిరూపించుకున్నారు కూడా. తనదైన తరహాలో భాషా భావ ప్రకటనను స్వేచ్ఛగా ప్రసారం చేసుకున్నవాటిని గుది గుచ్చి పుస్తక రూపం ఇచ్చారు. ఎప్పటికప్పుడు తాజాగా ఎంచుకున్న అంశాలు ఇప్పుడు చదవాలంటే వేడిగా ఉండకపోవచ్చుకానీ ఏ అంశమూ ప్రాధాన్యత కోల్పోదు. వినిపించిన గళకథలు ఎప్పుడూ కనిపించేలా పుస్తకరూపం ఇచ్చే సమయంలో ఒక సహచరుడు ‘‘గుండె గుప్పెట్లో బతుకు పుస్తకం’’ అని అభిప్రాయపడ్డారట. నిజంగా గొప్ప ప్రశంస కదా..

లభించు చోటు : 302, టి.వి.కె. రెసిడెన్సి, ప్లాట్‌ 9‌బీ జర్నలిస్ట్ ‌కాలనీ, రోడ్‌ ‌నంబర్‌ 3, ‌బంజారా హిల్స్, ‌హైదరాబాద్‌ – 500 034 (‌తెలంగాణ)

దైనందిన టీవీ ప్రసారాలకు భిన్నంగా, వంకర్లు పోయే యాంకర్లు లేకుండా.. వ్యాఖ్యాత కనిపించకుండా తన గంభీర గళం వినిపిస్తూ కథనాలు సాగిపోయాయి. అప్పుడదొక కొత్త ప్రయోగం. వార్తా ప్రథానాంశాలను ఎంచుకోవడం.. వాటికి క్లుప్త రూపంలో వ్యాఖ్యలు పేర్చడం జర్నలిస్ట్ ‌దైరీ ప్రత్యేకత. శబ్దాన్ని అక్షరంగా మార్చేటప్పుడు అప్పటి ఉత్సుకత జావకారకుండా ఇప్పుడూ తాజా రుచి ఆస్వాదించే విధంగా అంశాలను ప్రోదిచేసి పుస్తకంలో మూడు అధ్యాయాలుగా అలంకరించారు. ‘‘గుండె గుప్పిట్లో బతుకు పుస్తకం’’ మొదటి భాగం లో 29 మెరుపులు, ‘‘ప్రాథమిక చికిత్స’’ రెండో అధ్యాయంలో 31 విరుపులు.. మూడో అధ్యాయం ‘‘నా నోటిమాట’’ లో 26 చెణుకులు పాఠకునితో ముచ్చటిస్తాయి. నిడివి తక్కువైనా సూటిగా మనసులోకి చొచ్చుకు పోయేలా, నిజాలను నిర్భయంగా, మరొక్క సారి వెనక్కి తిరిగేలా, ఒళ్ళు గగుర్పరచే సన్నివేశాలను ఆసక్తి రేకెత్తించేలా, బాధాకర విషయాలకు గుండె ద్రవించేలా, కష్టాల కథలకు శిలలు కరిగేలా.. చక్కని పద ప్రయోగాలతో, సులభ గ్రాహ్య భాషలో సాగే మొత్తం 86 అంశాలు చదువుతూంటే, ప్రత్యక్ష ప్రసారాలను విన్న చెవులు మరోసారి సతీష్‌ ఉచ్చారణను నెమరు వేసుకుంటాయి.

జర్నలిస్ట్ ‌డైరీ లో ప్రస్తావించిన 86 కథనాలు అనేక సందర్భాలలో పాఠకులకు పరిచయమైనవే. రాజకీయాలు, సినిమాలు, నేరాలు, ఘోరాలు, సాహిత్యం, కన్నీళ్ళు, బాధలు, హాస్యం, త్యాగాలు, విధులు, పిల్లలు, యువకులు, వృద్ధులు, మహిళలు, మతాలు, కులాలు, ఉద్యోగాలు, బాంధవ్యాలు, బంధాలు, బంధనాలు, మోసాలు, మాయలు, ప్రేమ, పెళ్ళిళ్ళు.. ఎన్నో ఎన్నెన్నో వార్తలుగా పాతికేళ్ళకిందట విన్నవే, మీడియా ప్రయాణంలో ఒక దశలో ప్రసారమైన ఎపిసోడ్స్ అచ్చులో వచ్చిన మొదటి భాగం.. మళ్ళీ ఒక్కసారి చదివితే.. సతీష్‌ ‌బాబు ఎరిగిన ప్రముఖులు, చేసిన ఇంటర్వ్యూలు, వ్యక్తిగత సభాషణలు, వెలుగులోకి రాని ఎన్నెన్నో విషయాలు.. త్వరలో ‘‘జర్నలిస్ట్ ‌డైరీ’’ రెండో భాగంగా ముస్తాబవుతున్నది.
– నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply