Take a fresh look at your lifestyle.

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే వరకూ సీఎంను వదలం

ఉద్యోగాల భర్తీ కోసం 27న దీక్ష చేపడతాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : నిరుద్యోగ యువత పట్ల సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసే వరకూ సీఎంను వదలబోమని స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలై మూడేళ్లయినా సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల రీ అలాట్‌మెంట్‌ ఎం‌దుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సర్వీస్‌ ‌రూల్స్, ‌స్థానికతను పరిగణనలోనికి తీసుకోకుండా జీవో 317ను జారీ చేయడం తుగ్లక్‌ ‌నిర్ణయంలో భాగమేనని పేర్కొన్నారు. ఈ జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

ఉద్యోగుల రీ అలాట్‌మెంట్‌ ‌శాస్త్రీయంగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల సీఎంలకు కలసి గులాంగిరి చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్‌ ‌తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే ధాన్యం కొనుగోళ్ల పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. ఏనుగుతో మొట్టి కాయలు వేయించుకున్నా సీఎం కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఔరంగజేబుగా మారుతున్నారనీ, అందుకే తెలంగాణలో ఛత్రపతి శివాజీలు ఉద్భవిస్తున్నరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడి మూడేళ్లయినా సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించలేదనీ, కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్‌ ‌మోచేతి నీళ్లు తాగుతూ ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఈ సందర్బంగా బండి సంయ్‌ ‌విమర్శించారు.

Leave a Reply