Take a fresh look at your lifestyle.

జ్ఞానజ్యోతి సావిత్రి బాయి పూలే

“మనకున్నది ఒకే ఒక శత్రువు, ఆ శత్రువే అజ్ఞానం. విద్యావంతులమై ఆ శత్రువుని తుదముట్టించడమే మన లక్ష్యమని” సావిత్రిబాయి పూలే తన అనుచరులతో పదే పదే చేసిన వ్యాఖ్యలు విద్యకు ఆమే ఇచ్చిన ప్రాముఖ్యతను తెలుపుతుంది. సావిత్రి బాయి పూలే 1831 వ సంవత్సరం జనవరి 3 వ తేది న మహారాష్ట్ర లోని సతారా జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే ఎంతో చురుకైన అమ్మాయి. ప్రతి విషయాన్ని ఇట్టే పసిగట్టే వ్యక్తిత్వం సావిత్రి బాయి ది. ఆమె కు 9 వ ఏటనే 14 సంవత్సరాలున్న జ్యోతిరావు పూలే తో వివాహమైంది. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి, సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సావిత్రి బాయి పూలే.

ఒక్క మాటలో చెప్పాలంటే భర్త జ్యోతిరావు పూలే వెలిగించిన జ్ఞానజ్యోతి సావిత్రి బాయి. పూలే దంపతులకు మొదటి నుంచి సమాజంలో ఉన్న అసమానతలు కుల లింగ మత వివక్షత పై వ్యతిరేక భావం ఉండేది. వీటన్నింటికి కారణం చదువులేకపోవడమే అనే సత్యాన్ని గ్రహించి సమాజంలోని శూద్రులకు, అంటరానివాళ్లకు, స్త్రీలకు విద్యను అందిచాలని ఏకైక లక్ష్యంతో విద్యాసంస్థలు స్థాపించారు. ఇదే లక్ష్యంతో 1848 లో జనవరి 14 న పూణే లోని బుధవార్ పేట లో తాత్యా సాహెబ్ భీడే అనే బ్రాహ్మణుడి ఇంట్లో బాలికల పాఠశాల ను స్థాపించారు. స్కూల్ ని ఏర్పాటు చేయడానికి తన ఇంటిని ఇవ్వడమే కాకుండా 101 రూపాయలు చందా ఇచ్చి పూలే దంపతులను ప్రోత్సహించాడు.

పాఠశాల ప్రారంభించిన మొదట్లోనే అన్నపూర్ణ జోషి, సుమతి మోకాశి, దుర్గా దేశముఖ్, మాధవి దత్తే, సోనూ పవర్ అనే 6 మంది బాలికలు చేరారు. సావిత్రి బాయి పాఠశాల కి వచ్చిన వారికి చదువు విలువ చెప్పి చైతన్యం చేసింది. కష్టాలు ఎన్ని ఎదురైన ఆమె తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. శూద్రులు అంటరానివాళ్ళు మరియు స్త్రీ ల జీవితాలలో విప్లవాత్మక మైన చైతన్యం తీసుకువచ్చిన ధీశాలి సావిత్రిబాయి. 1848 లో మొదటి పాఠశాల తెరిచాక 1851 సెప్టెంబర్ 18 న పూణే లో రస్తాపేటలో బాలికల కోసం మరో పాఠశాల ను ప్రారంభించారు పూలే దంపతులు. దీనిని గమనించిన ప్రజలు నెమ్మది నెమ్మది తమ పిల్లలను బడి కి పంపడం మొదలుపెట్టారు.

ఆ స్కూల్ లో మరాఠీ అక్షరాలు, నీతి కథలు, బాలబోధిని,గణితం, భూగోళం, మరాఠీ చరిత్ర తో పాటు ఆసియా యూరప్ మరియు భారతదేశ పటాలను చూపించి సరైన సమాచారం చెప్పేవారు. ఒకసారి పూణే విశ్వవిద్యాలయం ఆంగ్లేయ అధికారి పోలార్ క్యాండి ఈ పాఠశాలలను పర్యవేక్షించడానికి వెళ్లి ఎంతో పరిశుభ్రంగా క్రమశిక్షణ మరియు తెలివితేటలతో ఉన్న అక్కడి విద్యార్థులను చూసి చాలా సంతోష పడ్డాడట. పెద్ద పెద్ద సంస్థలు కూడా చేయని పని మీరు చేశారు అని పూలే దంపతులను ప్రశంసిస్తూ పాఠశాల రికార్డ్ లో రాసి వెళ్లారట. క్రమక్రమంగా ఈ పాఠశాల సంఖ్య 18 నుండి 52 వరకు చేరింది. చదువుకు దూరంగా నెట్టివేయబడ్డ వారి జీవితాల్లో జ్ఞానజ్యోతి ని వెలిగించి వెలుగులు నింపారు. ఈ పాఠశాల వల్ల ఎంత మంది లాభపడ్డారో అంతకు రెట్టింపు మంది ఈ స్కూల్స్ గురించి తప్పుడు ప్రచారం చేశారు.

ఆ రోజుల్లో స్త్రీ లు అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య జీవనం కొనసాగించేవాళ్ళు. సావిత్రిభాయి సమాజంలోని పురుష ఆధిపత్య వర్గాల నుంచి ప్రతి రోజు ఎన్నో విమర్శలు దాడులను ఎదుర్కోని పాఠశాలకు వెళ్లి బోధన చేసి బాలికల్ని మహిళలను చైతన్యం చేసేది. విశ్లేషణాత్మక ఆలోచనలతో కూడిన ధైర్యవంతురాలు సావిత్రి బాయి. తన ఉపన్యాసాలతో శూద్రులు మహిళలను నిత్యం చైతన్య పరిచేది. ఒక సభలో ఉపన్యాసిస్తూ భారతదేశంలో అమలవుతున్న వర్ణ వ్యవస్థ మూలంగా ఆధిపత్య వర్గాలు 2 వేల సంవత్సరాల నుంచి శూద్రులను స్త్రీలను జ్ఞానానికి అధికారానికి దూరంగా ఉంచారు. దీని కారణంగా విదేశీయులు మన దేశంపైకి దాడి చేసి అగ్రవర్ణాల వారిని ఓడించారు. ఆనాడు శూద్రులకు జ్ఞానం లేకపోవడం వల్ల ప్రేక్షకులుగా ఉండి పోయారు. ఈ పరాజయాలకు శూద్రులు మహిళలు అస్సలు భాద్యులు కాదు. ఇలా చెప్పే సాహసం నాకు కేవలం చదువు వల్లనే వచ్చిందని సావిత్రి బాయి పూలే తరచుగా చెప్పేవారు.

1852 లో ఈమె “తీల్ గుడ్ సమారోత్సవ్”(నువ్వులు బెల్లం సమావేశం) ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ” కులమత భేదాలు పాటించకుండా అందరినీ ఒకే వరుసలో సమావేశ పరుస్తాం. ఒకే రీతిలో పసుపు కుంకుమ పంచుతాం” అని ఒక ఆహ్వాన పత్రిక అచ్చువేసి, మహిళలందరినీ ఆహ్వానించింది. ఆనాటి పరిస్థితుల్లో ఈ ఆహ్వాన పత్రిక అందరిలోనూ విప్లవాత్మకమైన చర్చ కు దారితీసింది. కుల మత బేధాలు లేని సమాజం గురించిన ఆలోచనలు ప్రజల చేశారు. అంతేకాకుండా మహిళల స్థితిగతులు మార్చే ప్రక్రియలో భాగంగా మహిళా సేవా మండల్ స్థాపించి మహిళా సాధికారత కు ప్రయత్నం చేసింది. 1873లో భర్త జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ లో చురుకుగా పని చేస్తూ, బాల్య వివాహాలు మూఢనమ్మకాలు సతిసహగమనం అలాంటి సాంఘిక దూరాచారాల కు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. వితంతు పునర్వివాహాలు జరిపించింది.

1890 లో భర్త జ్యోతిరావు పూలే మరణం తరువాత సత్యశోధక్ సమాజ్ పూర్తి స్థాయి భాద్యతలు చెప్పట్టి కార్యకర్తలకు అనుచరులకు మనోధైర్యాన్ని నింపింది. 1897 లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని పట్టి పీడించింది. 66 సంవత్సరాల వయసులో దత్త పుత్రుడు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధి సోకిన రోగులకు సేవ చేస్తూ మార్చి10 వ తేదీన మరణించింది. తాను అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించిన సామాజిక పోరాట యోధురాలు సావిత్రి బాయి పూలే.నేడు సమాజం కరోనా మహమ్మారి రూపంలో ఆత్యంత కఠిన మైన పరిస్థితులు చవి చూస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో సావిత్రిభాయి పూలే ఇచ్చిన స్ఫూర్తి తో తెలుగు రాష్ట్రాల లో లక్షలాది మంది ఉపాధ్యాయులు లెక్చరర్లు ఆన్లైన్ లో చదువు చెప్పారు… గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి వారి ప్రగతిని పరిశీలించి వారి అభివృద్ధికి తోడ్పడ్డారు.

ప్రపంచంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన ప్రముఖ మహిళామణులలో సావిత్రి బాయి పూలే ఒకరు. ప్రపంచ విద్యావిధానం లోనే సరికొత్త గా నర్సరీ విధానం ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలు అనుసరించేటట్టు చేసిన ఇటలీ దేశానికి చెందిన మారియా మాంటేస్సోరి, అమెరికా లో మహిళా విద్య కు ఎనలేని కృషి చేసిన ఎమ్మా విల్లార్డ్ ,అదే దేశంలో నీగ్రో బాలికల విద్య కోసం పోరాడిన బెతూనే లకు ఏ మాత్రం తీసిపోని మహోన్నత వ్యక్తిత్వం సావిత్రి బాయి ది. అంతే కాకుండా గొప్ప విలువలున్న మానవాతవాది ,కవి, నిస్వార్థ సమాజ సేవకురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి సావిత్రి బాయి పూలే. సమాజంలోని అట్టడుగు వర్గాలకు స్త్రీలకు విద్య ను అందిచేందుకు ఎన్నో అవమానాలు కష్టాలు విమర్శలు దాడులు ఎదుర్కోని ఉక్కు సంకల్పం తో తన కర్త్యవాన్ని నిర్వర్తించిన ధీశాలి. సమాజానికి ఇంతగా సేవలందించిన ఆమె సేవలకు ఇప్పటికి తగిన గుర్తింపు రాకపోగా,చరిత్రలో సావిత్రి బాయి పూలే చేసిన త్యాగాలను కనుమరుగు చేసే కుట్రలు జరుగుతున్నాయి.సమాజంలో వివక్షత రూపు మాపి అందరికీ విద్య అందిన రోజు మనం ఆమె కి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. భవిష్యత్ తరాలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే మార్గదర్శకురాలు సావిత్రి బాయి పూలే జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవం గా అధికారికంగా నిర్వహించాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు.

siva shankar mattam
– శివ శంకర్ మఠం
సోషల్ స్టడీస్ టీచర్

Leave a Reply