“‘జబాబి కీర్తన్ మండలీ’ సభ్యులు పాటలలో ఝల్కారిబాయిని దుర్గాదేవిగా ధైర్య సాహసాలను కీర్తించారు. నిమ్నవర్గాల అస్తిత్వపు భూమికగా నిలిచిన ఆమె ఆ వర్గాల గౌరవ మర్యాదలకు ప్రతీకగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్, రోహిల్‌ఖండ్, మిగతా ప్రాంతాలలో అంటరాని వర్గం ప్రతి సంవత్సరం ఝల్కారిబాయి జయంతిని జరుపుకుంటుంది. భర్త పూరన్ ప్రభావం ఝల్కారి మీద ఉంది. ఆమె కేవలం లక్ష్మిబాయి సేవకురాలు కాదు, మహిళా సైనిక దళ సభ్యురాలు కూడా.”
చరిత్ర ఎప్పుడూ విజేతలనే కీర్తిస్తుంది. యుద్ధంలో అమరులైన పరాజిత నిమ్న వర్గ సైనికులకు విస్మరించడం ఆనవాయితీ. అక్కడక్కడ పుటల్లో స్థానమివ్వడం చరిత్రలో అప్పుడప్పుడూ జరిగే అరుదైన సంఘటన. ఉత్తరప్రదేశ్ దళితుల అస్తిత్వపు అన్వేషణలో స్థానం దక్కిన నిమ్నవర్గ ప్రతీక ఝల్కారిబాయి. 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో ముఖ్యభూమిక పోషించిన వీరవనితగా ఉత్తరప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఆమె ప్రాచుర్యం పొందింది. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ దళిత వాదనకు ఆమేను ఉదాహరణగా చెబుతుంది.
50వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా 1997లో ఝల్కారిబాయిని గుర్తు చేసుకుంటూ బుందేల్‌ఖండ్, అలాహాబాద్ ప్రాంతాలలో వేడుకలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాలలో ‘గౌరవ్ దివస్’’, మరికొన్ని ప్రాంతాలలో ‘ఇతిహాస్ దివస్’’ పేరిట వేడుకలు జరుపుకొన్నారు. భాజపా-ఆరెస్సెస్ ఝాన్సీ లక్ష్మిబాయిని కీర్తించగా, బీఎస్పి-నిమ్న వర్గ సంస్థలు ఝల్కారిబాయి వీరగాథలను స్మరించాయి. రాణి లక్ష్మిబాయి అనుంగు సహచరిగా, సలహాదారుగా, మారువేషధారిణిగా, ఈస్టిండియా కంపెనీ సైన్యానికి కూడా భ్రాంతి కలిగించి, వారి వ్యూహాలను నిర్వీర్యం చేసిన యోధురాలు ఝల్కారిబాయి.
1830 నవంబర్ 22న ఝాన్సీ సమీపంలోని భోజ్లా దళిత కోరి కులంలో మూల్ చంద్, దనియాబాయి దంపతులకు ఝల్కారి జన్మించింది. చిన్నతనం నుంచే ధైరస్తురాలు. పశువులు కాస్తుండగా ఒక సారి చిరుతపులి దాడి చేసినప్పుడు కేవలం చిన్న కర్ర సహాయంతో చిరుతను వధించిన గాధ బుందేల్ జానపద గేయాల్లో ఇప్పుడూ పాడతారు.మరొకసారి గొడ్డలితో పులిని తెగనరికిన శౌర్యం జనం మనసులో చెరగని ముద్ర. పాఠశాల చదువు లేకపోయినా గుర్రపు స్వారి, విలువిద్య నేర్చుకుంది. రాణి లక్ష్మిబాయి ఫిరంగిదళ సైనికుడు పూరన్ సింగ్ ను పెళ్ళి చేసుకుని, ఝాన్సీ సైన్యంలో మహిళదళ సభ్యురాలైంది. అచ్చుగుద్దినట్టు తనలా ఉండే ఝల్కారిబాయి అంటే లక్ష్నిభాయికి ప్రత్యేక అభిమానం.
సిపాయిల తిరుగుబాటు సమయంలో జనరల్ హ్యూరోస్ పెద్ద సైన్యంతో ఝాన్సీ పై దాడి చేసినప్పుడు నాలుగువేల సైన్యం మాత్రమే ఉన్న లక్ష్మీ బాయి నానాసాహేబ్ సహాయం కోరినా సహాయం చేసే అవకాశం ఆయనకు లేదు. ఝాన్సీకోట కాపలదారు ‘దుల్హాజూ’ కంపేనీ సైన్యాలతో ఒప్పందం చేసుకుని కోటద్వారాలను తెరవడంతో మంత్రుల సలహాతో ఝాన్సీ లక్ష్మీబాయి కోటనుంచీ బయటపడింది. లక్ష్మిబాయి వేషంలో ఉన్న ఝల్కారి కొద్దిపాటి సైన్యంతో హ్యురోస్ను ఎదిరించి పట్టుబడినా పరిస్థితిని ఝాన్సీ సైన్యాలు అనుకూలంగా మలుచుకుని, కంపెనీ సైన్యాలను నిరోధించగలిగాయి.
సావర్కర్ నేతృత్వంలోని అభినవ భారత్ సభ్యులు సిపాయిల తిరుగుబాటు సందర్భాన్ని పురస్కరించుకుని 1907 లో ‘యాద్ గారి దివస్’’ జరుపుకుని నానాసాహేబ్, ఝాన్సి లక్ష్మిబాయి, తాంతియాతోపే వంటి యోధులను స్మరించుకున్నారు. 1928లో విప్లవ పత్రిక ‘కీర్తి’’లో భగవతి చరణ్ వోహ్ర రాసినాదస్ మే కా శుభ్ దిన్’’ వ్యాసం జాతీయవాద చరిత్రకారుల 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా నాంది పలికింది. జవహార్ లాల్ నెహ్రూ, బి.ఎల్.వర్మ, సుభద్ర కుమారి చౌహాన్, పండిత్ సుందర్ లాల్ తమ రచనలలో పోరాటయోధుల వీరగాధలను మహిమాన్వితపరిచారు.’అమర్ చిత్ర కథాస్’’ , నౌటంకీ రూపాలద్వారా ప్రజాదరణ కలిపించారు. పాఠశాల, కళాశాలల చరిత్ర పుస్తకాలలో వీరగాథలను పాఠ్యాంశాలుగా చేర్చారు. దురదృష్టవశాత్తు దళిత స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రస్థావించకపోవడం వివక్షపూరిత ప్రవృత్తికి నిదర్శనం.
ఇది గ్రహించిన దళితులు 1960 తరువాత సిపాయి తిరుగుబాటులో వారి పాత్ర ప్రస్తావించారు. ఝల్కారిబాయి, ఊదాదేవి, చేత్రం జాతవ్, మాతదిన్ భంగీ, భంకే చమర్ వంటి నిమ్నవర్గీయుల చరిత్ర వెలికి తీయడం ప్రారంభమైంది. ‘జబాబి కీర్తన్ మండలీ’ సభ్యులు పాటలలో ఝల్కారిబాయిని దుర్గాదేవిగా ధైర్య సాహసాలను కీర్తించారు. నిమ్నవర్గాల అస్తిత్వపు భూమికగా నిలిచిన ఆమె ఆ వర్గాల గౌరవ మర్యాదలకు ప్రతీకగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్, రోహిల్‌ఖండ్, మిగతా ప్రాంతాలలో అంటరాని వర్గం ప్రతి సంవత్సరం ఝల్కారిబాయి జయంతిని జరుపుకుంటుంది. భర్త పూరన్ ప్రభావం ఝల్కారి మీద ఉంది. ఆమె కేవలం లక్ష్మిబాయి సేవకురాలు కాదు, మహిళా సైనిక దళ సభ్యురాలు కూడా.
విష్ణురావు గాడ్సే మరాఠీ పుస్తకం ‘మాజా ప్రవాస్’లో రాణి వలే ఆమె గొప్ప వ్యూహకర్తగా పేర్కొన్నాడు. ఝల్కారి జీవిత చరిత్ర రాసిన భవాని శంకర్ విశారద్ ఆమె జీవితంలో అనేక కీలక విషయాలు తెలిపాడు. తిరుగుబాటులో పోరాడిన ఝల్కారి దళితుల స్మృతిపథంలో, చరిత్రలో ఒక చెరగని సంతకమని శ్యాం లాల్ బౌద్ద్ ‘ఝల్కారి వ పూరన్ కోరీ’లో పేర్కొన్నాడు. సీనియర్ ఐ ఎ ఎస్ అధికారి మాత ప్రసాద్ ‘‘ఝల్కారిభాయి నాటక్’’ అత్యంత ప్రాచుర్యం పొందింది. రాణి లక్ష్మిబాయికి బ్రిటీష్ వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొనడం ఇష్టం లేక రాజీ పడడానికి సిద్దపడగా, ఝల్కారిబాయి అడ్డుపడి పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని ‘‘స్వతంత్ర సంగ్రాం మే అచ్యుతోంకి యోగ్ దాన్’’ గ్రంథంలో డి.సి.దిన్ కర్ ప్రస్తావించాడు.
బుందెల్‌ఖండ్, ఝాన్సి ప్రాంతాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఝల్కారిబాయి పేరు పెట్టడం మొదలైంది. ‘వీరాంగణ ఝల్కారిబాయి మహోత్సవ్’ పేరిట ప్రతి సంవత్సరం బుందేల్‌ఖండ్ జిల్లా, బ్లాక్ స్థాయిలలో బిఎస్పి ఆద్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం 2001లో ఆమె చిత్రంతో తపాలా బిళ్ళ కూడా విడుదల చేసింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ భోపాల్ గురుతేజ్ బహదూర్ కాంప్లెక్స్‌లో 2017లో ఝల్కారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్,
చరిత్ర శాఖ, ఎన్జిడిసి, మహాత్మాగాంధీ యూనివర్సిటి