తిరుపతి,సెస్టెంబర్8 : తిరుచానూరు సపంలోని పద్మావతి నిలయం తోపాటు తొండవాడ సపంలోని కోవిడ్ కేర్ సెంటర్లను టీటీడీ తిరుపతి జేఈవో సదా భార్గవి బుధవారం పరిశీలించారు. పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం, తొండవాడ వద్ద ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ల లో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఆహారం తయారీకి అవసరమైన సరుకులు టీటీడీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, భోజనాల నాణ్యతను ఆమె పరిశీలించారు. స్టోర్స్ లో టీటీడీ నుంచి వచ్చిన సరుకుల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో సిబ్బందితో మాట్లాడుతూ, కోవిడ్ కేర్ సెంటర్లకు నెలవారీగా ఎన్ని సరుకులు వస్తున్నాయి, ఎన్ని ఉపయోగిస్తున్నారనే వివరాలను పరిశీలించారు.
అవసరానికి మించి సరుకులను నిల్వ ఉంచుకోరాదని సిబ్బందికి ఆమె సూచించారు. పద్మావతి నిలయంలో 282 మంది, తొండవాడ దగ్గర ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో 131 మంది రోగులు ఉన్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి జెఈవో తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారని ఆమె గమనించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది, అన్నదానం సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, క్యాంటీన్స్ డిప్యూటీ ఈవో లక్ష్మణ్ నాయక్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, డాక్టర్ భరత్ తో పాటు వైద్య విభాగం అధికారులు పాల్గొన్నారు.