హైదరాబాద్ మహానగర ప్రజల మెట్రో రైల్ కల పరిపూర్ణమైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జేబీఎస్ ఎంజీబీస్ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ జేబీఎస్ వద్ద పచ్చ జెండా ఊపి మెట్రో రైల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మల్కాజ్గిరి ఎంపి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మేయర్ రామ్మోహన్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతనిదులు పాల్గొన్నారు. ఈ మార్గం పూర్తి కావడంతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి మూడో దశ కూడా ప్రారంభమైనట్లయింది.
మెట్రోప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు.కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ప్రారంభమైన జేబీఎస్ ఎంజీబీఎస్ మార్గం 11 కిలోమీటర్లు ఉండగా, జేబీఎస్ పెరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంబీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గంలో ప్రయాణికులు కేవలం 16 నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చు.