నీళ్లు నిధులు నియామకాలు సార్ కల
ఆ కలను నిజం చేసిన సీఎం కేసీఆర్
బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్ ఇంజిన్ అభివృద్ధి తెలంగాణలోనే
సార్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లిలో చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి హరీష్ రావు నివాళి
పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్ 21 : జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ప్రొఫెసర్గా కెసిఆర్కి ఆప్తుడుగా సార్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని అభివర్ణించారు.
నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో గొప్ప పాత్ర పోషించారన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా బల్లగుద్ది చెప్పిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు జయశంకర్ సార్ కల అని, అది ఈరోజు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు. డబుల్ ఇంజన్ అనే బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని అభివృద్ధి ఈరోజు తెలంగాణలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.