ప్రోఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ మనను వీడి అప్పుడే తొమ్మిదేళ్ళు గడిచింది. విద్యార్థి దశనుండి ప్రత్యేక తెలంగాణరాష్ట్రంకోసం అహర్నిశలు అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు. ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఏర్పాటును కళ్ళారా చూడాలన్నకోరిక తప్ప తనకు మరేకోరిక లేదన్న జయశంకర్‌సార్ తెలంగాణ సాకారమవుతున్న క్రమంలో మహమ్మారి క్యాన్సర్ వాతపడి రెండువేల పదకొండులో సరిగ్గా ఇదేరోజున దివంగతులైనారు. దాదాపుగా మూడు తరాల ఉద్యమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామి అయిన సార్ తెలంగాణ మలిదశఉద్యమ సిద్దాంతకర్తగా తెలంగాణరాష్ట్రం సిద్ధించి తీరుతుందని ఘంటాపథంగా చెప్పేవాడు. మలివిడుత ఉద్యమ ప్రారంభంలో ఏర్పాటుచేసే సమావేశాల్లో పట్టుమని పదిమంది కూడా భాగస్వాములుకాని దశనుండి వేలు, లక్షలు కాదు, యావత్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరినందించే దిశగా గల్లీనుండి ఢిల్లీదాక, ఢిల్లీనుండి విదేశాల్లోని ప్రవాస భారతీయులవరకు ఉద్యమాన్ని విస్తరింపజేయడంలో సార్ కృషి ఎనలేనిది. అధ్యాపకుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌గా, పదవీవిరమణ చేసిన తర్వాత అన్ని దశల్లోనూ ఆయన మస్తిష్కంలో తెలంగాణ తప్ప మరోటి లేదన్నట్లుగా, అటు రాజకీయ నాయకులతోనూ, ఇటు రాష్ట్ర వాంఛను వెలుబుచ్చే అన్ని రంగాలకు చెందిన వారితో నిత్యం చర్చలు, సభలు, సమావేశాలు నెర్పుతూ ఒక విధంగా తన జీవితంలో అధికపాలు ఉద్యమానికే అంకితంచేసిన వ్యక్తి. గ్రామీణ ప్రజలనుండి జాతీయ,అంతర్జాతీయ వేదికలమీద చేసిన ప్రసంగాలన్నీ కూడా తెలంగాణ ఎందుకవసరమన్న విషయాన్ని పండు వలిచిపెట్టినట్లుగా అందరికీ అర్థమమ్యేట్లుగాచెప్పి ఆకట్టుకునేవాడు. తెలంగాణ ట్యాగ్‌లైన్ అయిన నీళ్ళు, నిధులు, నియామకాలపై ఆంధ్రప్రదేశ్ అవతరణనుంచి ఉద్యమ కాలంవరకు జరుగుతున్న అన్యాయాలను అనర్గళంగా ఏకరవుపెట్టి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఉద్యమమద్దతుకు ఒప్పించడంలో ఆయన విశేషంగా కృషిచేశారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కాదనుకున్నా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనన్న విధంగా అనేక రంగాల్లో ఇక్కడి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ గణాంకాలనే తీసుకుని ఒప్పించగలిగిన వ్యక్తి ఆయన. దీంతో వివిధ రాజకీయ పార్టీల్లోఉన్న తెలంగాణవారిలో ఆలోచనరేకెత్తించారు. అందుకే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంత్రులు,నాయకులు ఢిల్లీలో సోనియాముందు తెలంగాణ విషయాన్ని వివరించేందుకు జయశంకర్సార్నే తీసుకువెళ్ళారంటే తెలంగాణపైనా ఆయన ఎంతటి అధ్యయనం చేశాడనడానికి నిదర్శనం.
తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయడమేనని ఆయన సోనియాగాంధీ ముందు బల్లగుద్ది చెప్పడమే, ఆమె తెలంగాణ పట్ల సానుబూతితో వ్యవహరించడానికి కారణంగామారింది. వాస్తవంగా తెలంగాణ వాదం ఎప్పుడు బలంగా ముందుకు వచ్చినా దాన్ని అణగదొక్కేందుకే పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన అనేక సందర్బాల్లో ఉదాహరణతో సోదాహరణంగా వివరించేవాడు. తెలంగాణ ఉద్యమానికి భావవ్యాప్తి ఎంత అవసరమో ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడానికి రాజకీయ నాయకత్వం అంతఅవసరమని వివిధ రాజకీయ నాయకులను ఉద్యమంలో భాగస్వామ్యులను చేయడానికి ప్రయత్నించారు. చాలామంది మద్యలోనే పారిపోతే, ఇవ్వాళ ఉద్యమ నాయకుడిగా ఫలితాన్ని అనుభవిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే రాష్ట్రం సాకారమవుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి. పద్నాలుగేళ్ళలో ఉద్యమం ఒడిదొడుకులకు గురిఅవుతున్నప్పుడల్లా దాన్ని తిరిగి దారిలో పెట్టే విషయంలో వ్యూహకర్తగా అన్ని విధాలుగా కెసిఆర్‌కు చేయూతనందించిన వ్యక్తి ఆయన. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఎత్తులు వేసినా తట్టుకుని నిలబడగలిగాడని ఆయన కెసిఆర్‌ను తరుచూ మెచ్చుకునేవాడు. ఇతర తెలంగాణ నాయకుల మాదిరిగా కాడి క•ందపడేసే తత్వం ఆయనలో లేదని, కొన్నిసార్లు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదని తరుచూ ఉద్యమంపట్ల ఆందోళనకు గురి అవుతున్నవారికి సర్ధి చెప్పేవాడు. కెసిఆర్ కుమారుడు, కూతురు కెటిఆర్, కవిత తన ఉపన్యాసం అయిన తర్వాత వాళ్ళిద్దరు తెల్లకాగితాల కాపీ ఒకటి తెచ్చుకుని ఉద్యమంపై తమకున్న అనుమానాలను తీర్చుకుంటూ వ్రాసుకునేవారని చెప్పేవాడు. తెలంగాణవారికి పరిపాలన రాదని, రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం ఏర్పడుతుందనడాన్ని తీవ్రంగా ఖండించే సార్ అతిత్వరలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బలంగా చెప్పేవాడు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళు రావడంతోనే అభివృద్ధి మొదలవుతుందని, అందుకు కావాల్సిన బ్లూ ప్రింట్ ఎప్పుడో తయారు చేసి పెట్టామనేటోడు. తెలంగాణ భాషను విమర్శించినా, అవహేళనచేసినా కాళోజీ లాగా జయశంకర్‌సార్ కూడా వారిని ఎదిరించడంలో ఏమాత్రం వెనుకాడేవాడుకాదు. ఇలా తెలంగాణకోసం తన జీవితాంతం పోరాడిన సార్ ‘ అబ్తో ఏక్ హీ ఖ్వాయిష్ హై, వో తెలంగాణ దేఖ్నా అవుర్ మర్నా’ అన్న ఆయన కోరిక బతికుండగా తీరకపోవడం దురదృష్టకరం.
