Take a fresh look at your lifestyle.

జయహో జనయిత్రి….

మహిళలు అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకాశాలు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడులు కడతాం. కానీ ఆడపిల్ల తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే. అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుటుంబంలో, సమాజంలో ఎన్నో ఆంక్షలను ఎదుర్కొంటుంది. వెనకబడిన దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యాలుగా దూసుకెళ్తున్న సమాజాల్లోనూ చాలా వరకూ మహిళలకు అవకాశాలు తక్కువే ఉన్నాయి. అందుకే వాటిని అందిపుచ్చుకుని, ఆంక్షలను బద్దలు కొట్టడానికి ఆమె సమరశంఖం పూరించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. అతివలను చైతన్యపరిచి, వారిలోని ప్రతిభను చాటే ఓ చారిత్రక ఘట్టానికి పునాదిగా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంతకీ మార్చి 8 రోజే ఎందుకు ఈ దినోత్సవం? దీని వెనక చరిత్ర ఏంటి? వంటి విషయాలు చాలా మందికి తెలియదు. ఈ ఉద్యమమే అమెరికా మిల్లులో రాజుకుంది.. నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సైన్యంలో, సైన్సులో, రాజకీయాల్లో, కళల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. మగవారితో సమానంగా అవకాశాలు, జీతాలు, పని సమయం, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నీ అందుకుంటున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. మహిళలు పురుషులతో సమానంగా ఎంత గొడ్డు చాకిరీ చేసినా వారికి సమానమైన వేతనం వచ్చేది కాదు. దీంతో తొలిసారి దీనిపై ఉద్యమం మొదలైంది.

పురుషులతో సమానమైన పని చెసినా వేతనాలు ఎందుకు సమానంగా ఇవ్వరంటూ అమెరికాలోని పశ్చిమ పెన్సిల్వేనియాలో ఒక కాటన్‌ ‌మిల్లులో మొదటిసారిగా ఉద్యమం రాజుకుంది. మహిళలందరూ ఏకమై సమాన వేతనాలు, సమాన గుర్తింపు కోసం సమ్మె బాటపట్టారు. ఈ ఆందోళనలు రోజు రోజుకూ పెరిగిపోయి 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. ఆ తర్వాత దీన్ని స్పూర్తిగా తీసుకొని తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటువేసే హక్కు కోసం న్యూయార్క్ ‌నగరంలో15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఇది కూడా సఫలం కావడంతో సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించారు.ఇది కాస్తా 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ‌జర్మనీ మరియు స్విట్జర్లాండ్‌ ‌దేశాల్లో మహిళా దినోత్సవం నాడు తమ హక్కుల కొరకు లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజుకు ప్రాముఖ్యత పెరిగి అన్ని దేశాలలో మహిళా దినోత్సవం జరపడం మొదలయ్యింది.

1977 లో ఐక్యరాజ్య సమితి మొదటిసారి అధికారికంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. ఏ దేశంలో చూసిన రాజ్యాంగం, చట్టాలు అన్ని మహిళలకు సమాన గుర్తింపు ఇస్తూ.. వారికి హక్కులు, రక్షణ కల్పించాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతరం చాలానే ఉంది. నేటికి వారిపట్ల వివక్ష పోవడం లేదు. మహిళా దినోత్సవానికి పునాది వేసిన అమెరికాలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకపోవడమే పురుషులకు,స్త్రీలకు మధ్య ఎంత అంతరం ఉందో అర్థం అవుతుంది. ప్రతి రోజు ఏదో ఒక చోట లైంగిక వేధింపులు, పురిట్లోనే చిదిమేయడాలు మన దేశంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. స్త్రీని ఓ ఆట వస్తువుగా చూసే సమాజాలు నేటికి ఉన్నాయి.

- Advertisement -

ఇప్పటికీ మన దేశంలో మహిళలు కేవలం గృహిణులుగానే మిగిలిపోతున్నారు. ఎలాంటి ప్రతిఫలం లేకుండా సుమారు ఆరు గంటల పాటు ఉచిత సర్వీసు అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సమానమైన వేతనం, కూలీలు ఇవ్వడం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. దీనికి తోడు చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. కానీ రకరకాల కారణాల వల్ల ఇవి ఇంకా కలగానే మిగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మార్చి 8ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజున చాలా దేశాల్లో జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నారు. అమెరికాలో ఈ నెల మహిళల చరిత్రగా నిలిచిపోయింది. దీంతో ప్రతి ఏటా అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ఏదో ఒక అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది. మన దేశంలో అయితే మహిళల్లో ప్రతిభ చాటిని వారిని గుర్తించి పురస్కారాలను అందిస్తున్నారు. రష్యా, ఇటలీ లాంటి దేశాల్లో మార్చి 8 నుంచి నాలుగు రోజుల పాటు పువ్వులు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతుంటారు.

నరేష్‌ ‌జాటోత్‌. ఎంఏ.‌బీఈడీ.

( డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ‌పొలిటికల్‌ ‌సైన్స్) 
‌సిద్ధార్థ డిగ్రీ అండ్‌ ‌పీజీ కాలేజ్‌ ‌నల్లగొండ(8247887267)

Leave a Reply