Take a fresh look at your lifestyle.

నా భర్తతో పాటు నాకు చితిపెట్టండి….

భర్త చితిపైన పడుకుని రోధించిన మావోయిస్టుల మందుపాతర దాడిలో మృతి చెందిన జవాను భార్య
ఛత్తీస్‌ఘఢ్‌లో హృదయ విదారక సంఘటన

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భర్త వేలు పట్టుకుని ఏడు అడుగులు నడిచిన భార్య వంద ఏళ్ళు కలిసి జీవించాలని అనుకున్న తన భర్త అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో భార్య ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భర్త అంత్యక్రియలు చేసేందుకు చితిపై పెడుతున్న తరుణంలో నా భర్తతో పాటుగా నాకు కూడ చితి అంటించండంటూ భార్య తన బంధువులను వేడుకున్న తీరు పలువురి మనస్సును కలిచివేసింది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఆరన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరతో 11 మంది డిఆర్‌జె జవాన్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ జవాన్ల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. కాగా బీజాపూర్‌ ‌జిల్లా నీరం గ్రామానికి చెందిన లక్మో డిఆర్‌జె జవాన్‌గా 2016 నుండి పనిచేస్తున్నారు. లక్మో కూడ మృతి చెందిన వారిలో ఉన్నారు. ఆ మృతదేహాన్ని వారి గ్రామానికి తీసుకువెళ్ళి వారి బంధువులకు అప్పగించారు. ఇది చూసిన భార్య తూలేమత్కాని ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.

ఆ తరువాత బంధువులు అంతిమ సంస్కారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. దీనితో లక్మో భార్య తన భర్తతో పాటు తనను కూడ చితి మంటలో ఉంచాలని రోధించింది. భర్త లక్మో కోసం ఏర్పాటు చేసిన చితిపై ఆమె పడుకుని తన భర్తతో పాటు తనకు కూడ నిప్పటించాలని బంధువులను వేడుకుంది. ఈ సంఘటన చూస్తున్న అనేక మంది హృదయాలను కలిచివేసింది. భర్తతో పాటు నేను కూడ దేవుడు దగ్గరకు వెళ్తానని పదేపదే బంధువులను వేడుకుంది. బంధువులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా వినకుండా చితిపైనే పడుకుని ఉంది. కొద్దిసేపటికి బంధువులు ఆమెను వారించారు. ఉన్న ఇద్దరు పిల్లలను చూసుకోవల్సిన బాధ్యత నీపై ఉందని ఆమెను బంధువులు పదే పదే బ్రతిమిలాడారు. అయినప్పటికి ఆమె తీవ్ర మనస్థాపానికి గురై తన భర్తతో పాటు తాను పయనిస్తానని, నన్ను నీ వెంటే తీసుకువెళ్ళమని భర్త చితిపై పడి రోధించింది. బంధువులు మళ్లీ మళ్లీ నచ్చచెప్పటంతో కొద్దిసేపటికి ఆమె శాంతించింది. ఈ సంఘటన ఇప్పుడు ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ హృదయ విదారక సంఘటనతో అటవీ ప్రాంతంలో విషాదం నెలకొంది.

Leave a Reply