మే 12…వింజమూరి అనసూయా దేవి జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494
వింజమూరి అనసూయా దేవిభారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త, దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఐదుసార్లు జీవితకాల సాధన పురస్కారాలు అందుకున్న మొదటి భారతీయ మహిళ. విశ్వ విద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన ఘనత ఆమెదే. దేవులపల్లి కృష్ణశాస్త్రి విరచిత ప్రముఖ దేశభక్తి గీతం “జయ జయ జయ ప్రియ భారత” పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే.అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయిద్య కళాకారిణి. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. అనసూయా దేవి సంగీత కళాకారుల, సాహిత్య కారుల కుటుంబంలో జన్మించారు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ చేయించుకున్న ఘనత ఆమెది. ఆమె ప్రముఖ భావ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేన కోడలు. కర్ణాటక సంగీతం మునుగంటి వెంకట్రావు దగ్గర నేర్చుకున్నారు. ఆమె తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు కవి. తల్లి వింజమూరి వెంకటరత్నమ్మ 1914లో అనసూయ అనే తొలి మహిళల పత్రిక ప్రారంభించి, సంపాదకత్వం వహించారు.
కవి, రచయిత, రంగస్థల నటులు అయిన తండ్రితో చిన్నతనంలో పలు కార్యక్రమాలకు తరుచుగా వెలుతుండడం, ఎడ్ల బండిలో ఆమె మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊరు పిఠాపురం వెళ్ళిన సందర్భాలలో పల్లె పదాలు, పాటలు వినడం ద్వారా జానపద పాటల ప్రభావానికి లోనైనారు. అలా పొలాల్లో పాటలు, గంగి రెద్దుల వారు, ప్రభల వారి పాటల్ని అనుక రించి పాడడం ప్రారంభించారు. బాణీలు మార్చి నచ్చినట్లు పాడడం సాధన చేశారు. తొమ్మిదేళ్ల వయసులోనే నాటి యువ కవుల కవిత్వానికి సంగీతం సమ కూర్చడం మొదలుపెట్టారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడి, అలాంటి గొప్పవారి ప్రశంసలను అందుకున్నారు. 1937లో ఏలూరులో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన రాజకీయ సమావేశం జరిగిన సందర్భంలో మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి సుభాష్ బోస్ కోసం రాసిన ‘ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార’ పాటకు సంగీతం సమకూర్చి స్వయంగా పాడగా, బోస్ ఆమెను అభినందించి, ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేనగోడలు అయిన వింజమూరి, ఆయన రాసిన ప్రముఖ దేశభక్తి గీతం “జయజయజయ ప్రియ భారత” పాటకు బాణీ సమకూర్చారు.1930 మధ్య కాలంలో గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, నండూరి సుబ్బారావు మొదలైన మహా కవుల గేయాలకు స్వరాలు మొదట స్వయంగా సమకూర్చి పాడి, తర్వాత తన చెల్లెలు సీతతో కలిసి పాడి భావ గీతాలు, లలిత గీతాల ప్రక్రియకు, చెల్లెలు సీత తో కలిసి “సీతా – అనసూయ” లుగా ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని.
“జయ జయ ప్రియ భారత లాంటి అనేక దేశభక్తి గీతాలు, మొక్కజొన్న తోటలో లాంటి జానపద బాణీల స్వర కర్త ఆమె..మారుమూల పల్లె ప్రజల నోళ్లలో నానుతున్న జానపద గేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన తొలి గాయని.గురజాడ అప్పారావు ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మా’, అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ పాటలకు బాణీలు కట్టింది తానేనని, ‘కృష్ణపక్షం’ కవిత్వానికి సంగీతం జోడించానని, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ప్రచురించక మునుపే, ‘మరో ప్రపంచం పిలిచింది’ కవితకు బాణీ కట్టానని ఇంటర్వ్యూలలో చెపుతుండే వారు.. మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’కి, ఇతర భాషల్లో, కన్నడంలో ‘మహాత్మా కబీర్’ లాంటి సినిమాలకు సంగీత దర్శకత్వం చేశానని,. ‘రోజులు మారాయి’లోని ‘ఏరువాక సాగారో’, ‘మంగమ్మ గారి మనవడు’లోని ‘నోమి నోమన్న లాలో’ పాటలకు తన బాణీలనే వాడుకున్నారు కానీ తనకు క్రెడిట్ ఇవ్వలేదని బాధను వ్యక్తం చేసే వారు. శాస్త్రీయ సంగీతం తనకు జ్ఞానాన్ని ఇచ్చిందని, లలిత సంగీతం తనను వరించి నా దరికి వచ్చిందని, జానపద సంగీతం తనను వరించి తరించిందని చెప్పేవారు.
అనసూయా దేవి 11 గ్రంధాల రచన గావించారు. అనేక దేశాలలో వేలాది కచేరీలు నిర్వహించారు. జానపద సంగీతంపై ఆమె ఏడు పుస్తకాలను రచించారు. 90వ జన్మదినం సందర్భంగా ఎందరో మహానుభావులు పుస్తకం రాసి విడుదల చేశారు.ప్రపంచ వ్యాప్తంగా 11 జీవన సాఫల్య పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ వారి “కళా ప్రపూర్ణ” మొదలైన శతాధిక గుర్తింపులు పొందారు. పారిస్‌లోనూ అనసూయాదేవికి ‘క్వీన్ ఆఫ్ ఫోక్’అనే బిరుదును ప్రదానం చేశారు. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్యారిస్ లోనూ ఈమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు.భారత దేశం గర్వించదగ్గ జానపద కళాకారిణి అనసూయదేవి 2019 మార్చి 23న తన 99వ ఏట అమెరికాలోని హ్యుస్టన్‌లో కన్నుమూశారు.